ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education System: విద్యా సంక్షోభాన్ని కనీసం గుర్తించండి!

ABN, Publish Date - Mar 15 , 2025 | 03:30 AM

రాబోయే బడ్జెట్‌లో తెలంగాణలో గ్రామ గ్రామాన, పట్టణాలలోని వివిధ బస్తీలలోను విద్యకు పెద్దపీట వేయాలని గత నెల రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్ర ముఖ్యమంత్రికి....

రాబోయే బడ్జెట్‌లో తెలంగాణలో గ్రామ గ్రామాన, పట్టణాలలోని వివిధ బస్తీలలోను విద్యకు పెద్దపీట వేయాలని గత నెల రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రులు రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్ట్‌కార్డుల రూపంలోను సంతకాల సేకరణ ద్వారాను ప్రజా అభిప్రాయాన్ని సమీకరిస్తున్నారు. మరోవైపు విద్యా ప్రేమికులు, బుద్ధిజీవులు, ప్రొఫెసర్లు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు, తల్లుల సంఘాలు... వీరంతా సభలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేగాక తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌ ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా కలిసి విద్యా వ్యవస్థ మెరుగు కోసం నిధులను పెంచవలసిన ఆవశ్యకత గురించి ఒక నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ మధ్య జరిగిన ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌ మరియు కమిషన్ సభ్యుడు రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ పెద్దలు విద్య మీద చేస్తున్న ప్రకటనలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభంపై వారికి పూర్తిగా అవగాహన ఉన్నట్లు కనిపించదు. ప్రభుత్వ విద్య నిర్వీర్యం కావడానికి గత కొన్నేళ్ళుగా బడ్జెట్లలో దానికి సరిపడా నిధులు కేటాయించక పోవడమే కారణం అని ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలి.


ప్రభుత్వ విద్య బాగుపడే పరిస్థితి కానీ బాగుపరిచే రాజకీయ సంకల్పం కానీ కనుచూపు మేరలో కనిపించకనే పేద తల్లిదండ్రులు ప్రైవేటు బడుల బాట పట్టారనటానికి ప్రభుత్వ గణాంకాలే ఋజువు. 2023–24 యుడైస్ లెక్కల ప్రకారం ప్రభుత్వ బడిలో కేవలం 26 లక్షల మంది (43శాతం) విద్యార్థులు చదువుతుంటే, ప్రైవేటు బడులలో 34లక్షల మంది (57శాతం) చదువు‘‘కొంటున్నారు’’. అదే ఏడాది ఒకటవ తరగతి చేరికలు చూసినట్లయితే దాదాపు 66శాతం మంది విద్యార్థులు ప్రైవేటు బడులలో చేరారు. ఇక పట్టణాలలో విపరీతంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ బడులను ఏర్పాటు చేయకపోవడం వల్ల హైదరాబాద్‌లో 81శాతం, మేడ్చల్‌లో 85శాతం, రంగారెడ్డిలో 70శాతం మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రైవేటు బడులకు పంపుతున్నవారిలో అధికశాతం ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు కావు.

ఈ ధోరణి ఒక్క రోజులో మారింది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండే మొదలైంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా కొనసాగుతున్నది. దీనికి రుజువు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి ఏటా తగ్గింపులే. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరం విద్యకు 10శాతం కేటాయించారు. అలా మొదలైన తగ్గింపు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ గత తొలి బడ్జెట్ వరకు కొనసాగుతూనే ఉన్నది. తక్కువ నిధుల వల్ల విద్యా ప్రమాణాలు మరింతగా దిగజారుతున్నాయి.


గత సంవత్సరం బడ్జెట్‌ (2024–25)లో విద్యకు రూ.21,292వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది బడ్జెట్‌లో 7.3శాతం మాత్రమే. ఇందులో పాఠశాల విద్యకు కేటాయించింది రూ.17,942వేల కోట్లు (6.2శాతం) మాత్రమే. ఇన్ని వేల కోట్లు కేటాయించినట్లు కనిపించినా అందులో దాదాపు రూ.15వేల కోట్లు సిబ్బంది జీతాలకే ఖర్చు అవుతున్నాయి. ఇక మౌలిక సదుపాయాల కల్పనకు, పర్యవేక్షణకు, పాఠశాలలో వినూత్న ప్రయోగాలకు, పోటీ ప్రపంచంలో అవసరమైన కంప్యూటర్‌లకు, కృత్రిమ మేధకు సంబంధించిన పాఠ్యాంశాల బోధనకు సరిపడా నిధుల కొరత స్పష్టంగా కనిపిస్తున్నది.

పోనీ ఇన్ని వేల కోట్ల జీతాలు చెల్లిస్తున్న ఉపాధ్యాయులతో కేవలం బోధనే చేయిస్తున్నారా అంటే అదీ లేదు. వారికి పలు బోధనేతర పనులు అప్పగిస్తున్నారు. ఇక పర్యవేక్షణ అధికారులు సంవత్సరాల తరబడి లేరు. ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకు బోధన పని నుంచి ఉపశమనం కల్పించి పర్యవేక్షణ అధికారిగా అదనపు డ్యూటీ వేశారు. ఇవిగాక పదవీ విరమణ పొందిన టీచర్ల స్థానంలో మరో టీచర్ రావడంలో జాప్యం, వెనుకబడిన ప్రాంతాలలో ఉపాధ్యాయుల కొరత, గ్రామంలో ఉన్న విద్యార్థులకు అనుగుణంగా కాకుండా తగ్గిన విద్యార్థుల నమోదును బట్టి టీచర్ల నియామకం వంటి సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో విద్య గురించి చర్చ జరిగినప్పుడల్లా రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చర్చను అటువైపు మళ్లించేది. ప్రస్తుత ప్రభుత్వం కూడా 20 ఎకరాలలో ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్నాయి. పనులు సాగుతున్నాయి కూడా. దాదాపు 1000 గురుకుల పాఠశాలలు కల్పించిన మాట వాస్తవమే. కానీ విద్యార్థులకు విద్యను అందించడానికి గురుకుల పాఠశాలలు ప్రత్యామ్నాయం కాదని పాలకులు గుర్తించాలి. కుటుంబంలో మొదటితరం చదువు వైపు వచ్చిన విద్యార్థులకు, ఆదరణ కరువైన పిల్లలకు గురుకులాలు నిర్వహించాలి. అంతే కానీ రాష్ట్రంలో ఉన్న 60 లక్షల మంది పిల్లలకు విద్యను అందించే సామర్థ్యం వాటికి లేదు.


అంతకంతకూ తగ్గుతున్న బడ్జెట్‌ కేటాయింపులను బట్టి ప్రభుత్వం తమ పిల్లలకు చదువు చెప్పదలచుకోవడం లేదన్న అభిప్రాయానికి సమాజం చేరుకున్నది. అందువల్ల ప్రైవేటు బడులవైపు మొగ్గుచూపక తప్పలేదు. స్తోమత ఉన్నవాళ్ళకు ప్రైవేటు బడులతో ఇబ్బంది లేదు. కానీ రోజు కూలీలు, చిన్న వ్యవసాయ కుటుంబాల వారు, కౌలు రైతులు, పట్టణాలలో పేద బస్తీలలో నివసించే అసంఘటిత రంగ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో ఉన్న అతిపేదలు తల తాకట్టు పెట్టి మరీ తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. జూన్ నెల రాగానే కుటుంబాలలో ఒక గుబులు. పోయిన సంవత్సరం ఫీజుల బాకీతో సహా ప్రస్తుత సంవత్సరం ఫీజులు కట్టాలనే ఒత్తిడి. అందరిముందూ పిల్లలను అగౌరవపరిచే ప్రైవేటు బడుల దుస్సంప్రదాయాలు. ఇవన్నీ భరిస్తూ ఆ పేద కుటుంబాలు ఒక్కో విద్యార్థి మీద పెడుతున్న ఖర్చు లెక్కేస్తే ప్రభుత్వ విద్యా బడ్జెట్ కన్నా అధికంగానే ఉంటుంది. ఇన్ని కష్టాలు పడినా ప్రైవేట్‌ బడులలో నాణ్యమైన విద్య అందుతుందా అంటే అదీ లేదు!

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు బడ్జెట్లలో సరిపడా నిధులు కేటాయించకపోవటం వల్ల విద్యా వ్యవస్థ నేడు అతిపెద్ద సంక్షోభ దశకు చేరుకున్నది. ఈ సంక్షోభం నుండి బయటపడడానికి, తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్య పట్ల సన్నగిల్లిన విశ్వాసాన్ని పెంచడానికి, కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యకు 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామన్న తమ హామీని నిలబెట్టుకోవాలి. 2025–26 బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేసి విద్య పట్ల రాజకీయ సంకల్పాన్ని ఋజువు చేసుకోవాలి.

ఆర్. వెంకట్ రెడ్డి

జాతీయ కన్వీనర్, ఎం.వి. ఫౌండేషన్

Updated Date - Mar 15 , 2025 | 03:33 AM