శ్రుతిమించుతున్న ట్రంపరితనం!

ABN, Publish Date - Mar 14 , 2025 | 03:26 AM

ప్రస్తుత ప్రపంచ నియమాల పట్ల తనకు గౌరవం బొత్తిగా లేదని డొనాల్డ్ ట్రంప్ నిర్లజ్జగా చాటి చెపుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చర్చలకు పిలిచి అవి ఫలించకపోడంతో...

శ్రుతిమించుతున్న ట్రంపరితనం!

ప్రస్తుత ప్రపంచ నియమాల పట్ల తనకు గౌరవం బొత్తిగా లేదని డొనాల్డ్ ట్రంప్ నిర్లజ్జగా చాటి చెపుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చర్చలకు పిలిచి అవి ఫలించకపోడంతో ప్రపంచ మీడియా ముందే అతడిని గెంటివేసిన ట్రంప్ తన అమానవీయతకు హద్దు లేదని స్పష్టం చేశారు. ట్రంప్‌ను నిర్భయంగా నీళ్లు నమలకుండా ఎదుర్కొన్న జకదేకవీరుడనే ఖ్యాతి జెలెన్ స్కీని వరించింది. ఇంకొకవైపు ట్రంప్‌కు దాసోహం చెప్పి వచ్చినట్టుగా ప్రధాని మోదీని ఇండియాలోని కొన్ని వర్గాలు ఖండిస్తున్నాయి.

జో బైడెన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా పూర్తి అండదండలు ఇచ్చింది. అమెరికా, యూరప్‌లు జెలెన్ స్కీకి సైనిక ఆర్థిక సహాయాన్ని దండిగా అందించాయి. అది ఉక్రెయిన్ – రష్యా యుద్ధంగా కాకుండా రష్యా – అమెరికా కూటమి మధ్య సమరంగా సాగింది. ఇందులో ఉక్రెయిన్ అప్పుడప్పుడూ అక్కడక్కడా కొద్ది విజయాలు సాధించినప్పటికీ మొత్తం మీద రష్యాదే పైచేయి అయింది. ఆంక్షలు రష్యాను ఏమీ చేయలేకపోయాయి. దీనితో ట్రంప్ యుద్ధానికి తెరదించాలని నిర్ణయించాడు. 2022 ఫిబ్రవరిలో మొదలైన ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లు దాటి కొనసాగుతూ వచ్చింది. యుద్ధం వల్ల ఆహారం, ఇంధనం తదితరాల ధరలు పెరిగిపోయి మానవాళి తీవ్ర అశాంతికి గురి అవుతున్నది. అందుచేత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యుద్ధవిరమణ ఘట్టాన్ని స్వహస్తాలతో ఆవిష్కరిస్తున్నాడనే ఖ్యాతి ట్రంప్ ఖాతాలో చేరుతున్నది. ఆయన ఉక్రెయిన్ యుద్ధం నుంచి అమెరికా సేనలను ఉపసంహరించారు. రష్యాపై ఆంక్షల ఉపసంహరణకు చర్యలు చేపట్టారు.


ఒకవైపు యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామంటూనే అమెరికా మద్దతు లేకపొతే అభాసుపాలు అవుతామని యూరపు దేశాలూ గ్రహించాయి. అవి సొంత రక్షణ బడ్జెట్లను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. జెలెన్ స్కీతో కలిసి శాంతి ఒప్పందం ముసాయిదాను సిద్ధం చేసి అమెరికా ముందు ఉంచాలని భావిస్తున్నాయి. అయితే ఆ ప్రతిపాదనను ట్రంప్ గాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గాని అంగీకరిస్తారా? జెలెన్ స్కీ తాము కోల్పోయిన భూభాగాలను తిరిగి తమకు అప్పగించాలని కోరుతాడు. అంతే కాదు, భవిష్యత్తులో ఉక్రెయిన్ భద్రతకు అమెరికా, యూరప్‌లు హామీ ఇవ్వాలని కూడా జెలెన్ స్కీ అర్థిస్తున్నాడు, నాటోలో సభ్యత్వమూ కావాలంటున్నాడు. అందుకు ట్రంప్ నిరాకరించాడు. అందుచేత అది అయ్యే పని కాదు. ఉక్రెయిన్‌కి సభ్యత్వం ఇచ్చి నాటో తన గుమ్మం వద్ద తిష్ట వేసుకోవడం నచ్చకనే పుతిన్ యుద్ధాన్ని మొదలుపెట్టాడు. తాము ఆక్రమించుకున్న 20శాతం ఉక్రెయిన్ భూభాగంలో అరంగుళమైనా ఇచ్చేది లేదని పుతిన్ తెగేసి చెపుతాడు. పుతిన్ తన మాట కాదనడనే ధీమాలో ట్రంప్ ఉన్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా శాంతి చర్చల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్టు, భవిష్యత్తులో అమెరికా మద్దతు కోసం అవసరమైన ఒప్పందంపై సంతకం చేయదలచినట్టు తనకు లేఖ రాశాడని ట్రంప్ తాజాగా పార్లమెంటులో ప్రకటించాడు.

ఉక్రెయిన్ యుద్ధానికి తెర దించడానికి ట్రంప్ సిద్ధం చేసుకున్న శాంతి వ్యూహంలో రెండు భాగాలున్నాయి. ఉక్రెయిన్‌లోని అత్యంత అరుదైన ఖనిజాలను తవ్వి తీసుకుపోవడానికి జెలెన్ స్కీ సమ్మతి తీసుకుంటూ ఒప్పందాన్ని కుదుర్చుకోడం అందులో ఒకటి. తాను ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాల్లోని విలువైన ఖనిజాలను తవ్వి తీయడానికి కూడా అమెరికాను అనుమతిస్తానని పుతిన్ ప్రకటించాడు. ప్రపంచంలో అత్యంత అరుదైన ఖనిజాల్లో 5 శాతం మేరకు ఉక్రెయిన్‌లోనే ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ కార్లు తదితర విద్యుత్‌ వాహనాల బ్యాటరీల్లో ఉపయోగించే గ్రాఫైట్ నిల్వలు 19 మిలియన్ టన్నుల వరకు ఉన్నాయి. ఇవి భారీగా ఉన్న అయిదు దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. విమానాలు, విద్యుత్ కేంద్రాల వంటి నిర్మాణాల్లో ఉపయోగించే టైటానియం; బ్యాటరీల తయారీలో కీలక ముడిసరకు లిథియం; అణు ఆయుధాలు, రియాక్టర్లలో ఉపయోగించే బెరిల్లియం, యురేనియం నిక్షేపాలు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. అణ్వాయుధాలు, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తదితర ఆధునిక సాధనాల్లో ఉపయోగించే 17 అపురూప ఖనిజాల నిల్వలు అక్కడ ఉన్నాయి. ఈ ఖనిజాల సంపదలో 75 శాతంతో చైనా ప్రపంచాధిపత్యాన్ని వహించి ఉంది. దానిని దెబ్బతీయడం కోసం ఉక్రెయిన్‌పై ట్రంప్ కన్నేశాడు. వాస్తవానికి రష్యాను జయించడానికి ఉక్రెయిన్‌ను అడ్డం పెట్టుకుని అమెరికా, యూరప్‌లు జెలెన్ స్కీకి సైన్యాన్ని, ఆయుధాలను సరఫరా చేశాయి. వాటిని అప్పుగా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ దాన్ని అప్పు ఖాతాగా రాసి ఉక్రెయిన్ ఖనిజాలను దోచుకోదలచుకున్నట్టు అర్థమవుతున్నది.


ట్రంప్ హయాంలో అమెరికా ప్రపంచ ప్రజాస్వామ్య గురువు పాత్ర నుంచి తప్పుకుంటున్నదా అన్నది నేటి కీలక ప్రశ్న. అంతర్జాతీయంగా కరడుగట్టిన సామ్రాజ్యవాదిగా, నియంతగా ఉన్నప్పటికీ దేశీయంగా ప్రజాస్వామ్య మర్యాదలు పాటిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు దానిని కూడా వదులుకుంటున్నది. అక్రమ వలసల పేరుతో విదేశీయులను తరిమేయడం, కనీసావసర ఖర్చుల కోసం క్యాంపస్ బైట చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిన విదేశీ విద్యార్థులకు ఆ సౌకర్యాన్ని సైతం తొలగించడం ట్రంప్ అమెరికా దిగజారుడుతనాన్ని చాటుతున్నది. ట్రంప్‌ను ఎన్నుకున్న మెజారిటీ ఓటర్లు అమెరికా తన ధనాన్ని అంతర్జాతీయ కర్తవ్యాల కింద దుర్వినియోగం చేస్తున్నదనే ట్రంప్ ప్రచారాన్ని నమ్మి ఆయనకు ఓట్లు వేశారు. ట్రంప్ ఆధిపత్యం తాత్కాలికమే కావచ్చు, అమెరికన్ ఓటర్లలోని తిరోగమన ధోరణి ఒకంతట పోయేది కాదు.

డాలర్ ద్వారా కాకుండా సొంత కరెన్సీలతో విదేశీ వాణిజ్య లావాదేవీలు జరిపితే చూస్తూ ఊరుకోబోమని బ్రిక్స్ (బ్రెజిల్, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలను ట్రంప్ బెదిరించాడు. అంటే బలప్రయోగంతో డాలర్ ఆధిపత్యాన్ని కొనసాగింపజేయాలన్నది ట్రంప్ ఆంతర్యంగా బోధపడుతున్నది. ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు కేవలం 45 బిలియన్ డాలర్లే. ఈ మాత్రం భాగ్యానికి ఇండియా టారిఫ్‌లు దారుణమైనవని ట్రంప్ భూతద్దంలో చూపిస్తున్నాడు. చైనాతో దానికున్న వాణిజ్య లోటు 300 బిలియన్ డాలర్లు. అమెరికా మొత్తం వాణిజ్య లోటు 1.2 ట్రిలియన్ డాలర్లు. చైనాతో అమెరికాకు గల లోటు అందులో నాలుగో వంతు. ట్రంప్ తన ప్రతీకార సుంకాల విధానంతో ఈ అగ్రరాజ్య మర్యాదను మంచితనాన్ని బూడిదపాలు చేస్తున్నాడు. ట్రంప్‌ను సంతృప్తిపరచడానికి ఇండియా కొన్ని రాయితీలను ప్రకటించింది. ట్రంప్ ఒకవైపు అమెరికాను ప్రపంచ దేశాలకు అగ్రరాజ్యం అన్న బాధ్యత నుంచి తప్పించదలిచాడు. అదే సమయంలో తన సుంకాల బీభత్సానికి దేశ దేశాలు తల వంచేలా చేయదలిచాడు. ట్రంప్ సుంకాలు, వాటికి ప్రతీకార సుంకాలు ధరలను విపరీతంగా పెంచివేస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్, పారిస్ వాతావరణ ఒప్పందం వంటి సంస్థల నుంచి అమెరికా మళ్ళీ ఉపసంహరించుకుంటున్నది. అమెరికా భాగస్వామిగా ఉన్న అన్ని అంతర్జాతీయ సంస్థలపై ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ట్రంప్ ఆదేశించాడు. కలిసి నడవడం కంటే, ప్రపంచ చుక్కానిగా ఉండడం కంటే జాతీయ ప్రయోజనాలే ప్రధానంగా అడుగులు వేయాలని ట్రంప్ అమెరికా ఆశిస్తున్నది. పాలస్తీనా మీద అమానుష అనైతిక నిప్పుల వర్షం కురిపిస్తూ నిరాయుధులైన అమాయక జనాన్ని ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్‌ను ఎవరైనా వెనకేసుకుని రాగలరా? అటువంటి ఇజ్రాయెల్‌కు వ్యతిరేక వైఖరి తీసుకున్నందుకు, ‘‘తన దృష్టిలో’’ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్న దేశాలైన చైనా, వెనెజులా, క్యూబా, సౌదీ అరేబియాలను చేర్చుకున్నందుకు, ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ నుంచి అమెరికా తప్పుకున్నట్టు బోధపడుతున్నది. ట్రంప్ మొదటి పాలన సందర్భంగా 2018లో మొదటిసారి, ఇప్పుడు రెండోసారి ఈ కమిషన్ నుంచి అమెరికా వైదొలగింది. ప్రపంచంలో మానవహక్కుల పరిరక్షణ తన దృష్టి కోణం నుంచి జరగాలని ట్రంప్ కోరుతున్నాడు! స్త్రీ బాల వృద్ధులనే విచక్షణ లేకుండా దాదాపు ఏభై వేలమంది గాజా వాసులను హతమార్చడం ఆయన దృష్టిలో మానవ హక్కుల ఉల్లంఘన కాదు.


ఇంతవరకూ అంతర్జాతీయ సహాయ కార్యక్రమాలకు తమ వంతు వాటా ఇస్తూనే అప్రతిహత ఆధిపత్యాన్ని చలాయించిన అమెరికా ఇప్పుడు దేనికీ పైసా ఇవ్వకుండా రౌడీయిజాన్ని ప్రదర్శించబోతున్నది. తనకున్న అపారమైన సైనిక శక్తితో నియంతృత్వాన్ని అమలు చేయదలచింది. ఇది ట్రంపరితనం! ఐక్యరాజ్య సమితి, ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకున్న మేర దాని స్థానాన్ని చైనా వంటి దేశాలు నెమ్మదిగా భర్తీ చేసే అవకాశాలు లేకపోలేదు. ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక, ఆయనను ఎదిరించనూ లేక ప్రధాని మోదీ అభాసుపాలవుతున్నారు. ట్రంప్‌తో ఇలాగే కలిసి నడిస్తే అంతర్జాతీయంగా మనం మరింత చులకన అయిపోతాము.

గార శ్రీరామమూర్తి

సీనియర్‌ పాత్రికేయులు

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 14 , 2025 | 03:26 AM