రాహుల్‌పై ‘అర్బన్ నక్సల్’ అస్త్రం!
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:39 AM
పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాజ్యాంగంపై చర్చ ఒక వికృతమైన కలహంగా మారింది. పాలక, ప్రతిపక్ష సభ్యుల జరిగిన పొట్లాటలో కొంత మంది ఎంపీలు శారీరకంగా గాయపడ్డారు. ఈ శోచనీయ పరిణామానికి...
పార్లమెంటు శీతాకాల సమావేశాలలో రాజ్యాంగంపై చర్చ ఒక వికృతమైన కలహంగా మారింది. పాలక, ప్రతిపక్ష సభ్యుల జరిగిన పొట్లాటలో కొంత మంది ఎంపీలు శారీరకంగా గాయపడ్డారు. ఈ శోచనీయ పరిణామానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీయే కారణమని పాలక పక్ష ఎంపీలు తీవ్రంగా ఆరోపించారు. సభలో చోటుచేసుకున్న ఈ ద్వంద్వ యుద్ధాన్ని 2001లో పార్లమెంటుపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద బృందాల దాడిగా బీజేపీ ఎంపీ ఒకరు అభివర్ణించారు! ప్రతిపక్ష సభ్యులు ‘అర్బన్ నక్సల్స్’గా సభలోకి ప్రవేశించారని కూడా ఆ ఎంపీ ఆరోపించారు.
రాహుల్‌గాంధీని ఒక ‘అర్బన్ నక్సల్’గా చిత్రించే ప్రయత్నాలు గత కొంత కాలంగా జరుగుతున్నాయి. గత సార్వత్రక ఎన్నికలకు ముందు డాక్టర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, సామాజిక న్యాయం, కుల గణన, జాతీయ సంపద పునః పంపిణీ తదితర అంశాలపై రాహుల్ ఉపన్యాసాలను ‘నక్సలైట్ అజెండా’గా పాలక పక్షం పదే పదే అభివర్ణించింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల సందర్భంగా కూడా రాహుల్‌పై అటువంటి విమర్శలనే తీవ్రంగా గుప్పించారు. మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడం బీజేపీకి తప్పనిసరి అయింది. ఆ అనివార్యతకు రాజకీయ, ఆర్థిక కారణాలు రెండూ ఉన్నాయి. అవి: సార్వత్రక ఎన్నికలలో కోల్పోయిన సీట్లను మళ్లీ స్వాయత్తం చేసుకోవడం; ముంబై, గుర్గావ్ ఆర్థిక వ్యవస్థలపై నియంత్రణ సాధించడం.
2004లో రాహుల్‌గాంధీ రాజకీయాలలోకి ప్రవేశించిన నాటి నుంచి ఆయనను రాజకీయంగా అంతమొందించడానికి బీజేపీ నాయకులు శతథా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పట్లో ఆయన్ను ‘పప్పు’ అని అపహసిస్తుండేవారు. ఆయనొక అపరిణత యువకుడు అని, పరిణత నాయకుడుగా ఎట్టి పరిస్థితులలోను ఎదగలేరని వారు తరచు ఎద్దేవా చేస్తుండేవారు. రాహుల్ గురించిన ఈ కథనాన్ని బీజేపీ, దాని మాతృసంస్థ, సోదర సంస్థలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో విజయవంతమయ్యాయి. ఆ ప్రచారం ఎంత ప్రభావశీలంగా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థాయి నాయకులు సైతం దానిని దాదాపుగా విశ్వసించడం జరిగింది!
భారత్ జోడో యాత్ర (కన్యాకుమారి నుంచి శ్రీనగర్ దాకా), న్యాయ్ యాత్ర (మణిపూర్ నుంచి ముంబై దాకా) నిర్వహించేందుకు రాహుల్ నిర్ణయించుకోవడం పలువురిని విస్మయపరిచింది. అదొక సాహసోపేత నిర్ణయం, సందేహం లేదు. ఆ యాత్రలలో రాహుల్ దేశ వ్యాప్తంగా పర్యటించడంతో పాటు ప్రజలను విస్తృతంగా కలుసుకున్నారు. వారితో సంభాషించారు. వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను కూలంకషంగా తెలుసుకున్నారు. దీనితో పాటు మీడియా ప్రతినిధులు, మేధావి వర్గాలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ ఉభయ యాత్రలతో అశేష ప్రజలకు రాహుల్ సన్నిహితమయ్యారు. ఈ పరిణామం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ నాయకులు ఇరువురినీ అమితంగా విస్మయపరిచింది. న్యాయ్ యాత్రతో తన ప్రజాకర్షణ శక్తిని రాహుల్ ఇతోధికంగా పెంచుకున్నారు.
రాహుల్‌లో వచ్చిన ఈ పరివర్తన బీజేపీని ఎందుకు కలవరపరిచింది? కాంగ్రెస్‌ను తన ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ పరిగణిస్తోంది. న్యూఢిల్లీలో అధికారానికి తనతో పోటీపడగల సమ ఉజ్జీ అని కూడా భావిస్తోంది. కాంగ్రెస్ అఖిల భారత రాజకీయ పక్షమని, ఆసేతు హిమాచలం ఆ పార్టీకి సంస్థాగత బలం ఉన్నదని బీజేపీకి బాగా తెలుసు. ఏ ప్రాంతీయ పార్టీ కూడా కాంగ్రెస్ మాదిరిగా తనతో పోటీకి రాలేదన్నది బీజేపీ భరోసా. కాంగ్రెస్ మనుగడకు ఆలంబన గాంధీ కుటుంబ నాయకత్వమన్న వాస్తవం కూడా బీజేపీకి బాగా తెలుసు. కాంగ్రెస్‌కు గాంధీ కుటుంబ నాయకత్వం లేకుండా చేస్తే ఆ పార్టీని ఉనికిలో లేకుండా రూపుమాపడం సులువవుతుందని బీజేపీ విశ్వసిస్తోంది. గాంధీల వలే దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకోగల నాయకులు మరెవ్వరూ కాంగ్రెస్‌కు లేరు అన్నది బీజేపీ సునిశ్చిత భావన. గాంధీ కుటుంబేతర వ్యక్తులు ఎవరినీ జాతీయ స్థాయిలో నాయకులుగా రూపొందించుకోలేకపోవడం కాంగ్రెస్ పార్టీ స్వతస్సిద్ధ బలహీనత. కాంగ్రెస్ జాతీయ నాయకత్వంలో గాంధీ కుటుంబాన్ని లేకుండా చేసినప్పుడు మాత్రమే బీజేపీ తిరుగులేని సంపూర్ణ జాతీయ పార్టీగా ఆవిర్భవించగలదు.
కాంగ్రెస్ ప్రాభవ ప్రాబల్యాలను పూర్తిగా అణచివేయడం బీజేపీకి అనివార్యమయింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంతవరకు ప్రాంతీయ పార్టీలను తనకు అనుకూల పరచుకోవడంలో సఫలమయింది. బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు చాలా చాలా తక్కువ. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇండియా కూటమిలోని అనేక పార్టీలు సైతం తమకుతాముగా కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్నాయి. ఎన్నికలలో పరాజయాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని అవి గట్టిగా విశ్వసించడం వల్లే ఇండియా కూటమి విచ్ఛిన్నమయిపోయే దుస్థితి దాపురిల్లింది. అయినప్పటికీ గత వేసవిలో జరిగిన సార్వత్రక ఎన్నికలలో రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ ఒక ప్రధాన శక్తిగా ప్రభవించడం బీజేపీని గందరగోళ పరుస్తోంది. ముఖ్యంగా ఆయన ప్రతిపాదిస్తున్న సామాజిక న్యాయం, సంపద పునఃపంపిణీ అజెండాలకు సమాజంలోని అట్టడుగు వర్గాల వారి నుంచి అపురూపమైన ప్రతిస్పందన లభిస్తోంది. ఇది బీజేపీని వెన్వెంటనే కాకపోయినా సమీప భవిష్యత్తులో అస్థిరత్వం పాలు చేసే ప్రమాదం ఎంతైనా ఉన్నది. ఈ వాస్తవాన్ని గుర్తించిన బీజేపీ రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా ‘అర్బన్ నక్సల్’ కథనాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఆయన నాయకత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తోంది.
బీజేపీ కుటిల దాడుల నుంచి రాహుల్‌ను రక్షించగల స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? కాంగ్రెస్ నాయకులలో ఎంత మంది రాహుల్ ప్రతిపాదిస్తున్న సామాజిక న్యాయ, సంపద పునః పంపిణీ లక్ష్యాలకు నిబద్ధమై ఉన్నారు? కాంగ్రెస్ పార్టీని జాతీయ కార్యనిర్వాహక వర్గం స్థాయి నుంచి గ్రామ కమిటీల వరకు సామాజిక న్యాయం ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించని పక్షంలో పై ప్రశ్నలకు సరైన సమాధానాలు రావుగాక రావు. ఎందుకని? చాలా మంది కాంగ్రెస్ నాయకుల సామాజిక న్యాయసాధన లక్ష్య స్ఫూర్తి పూర్తిగా సందేహాస్పదమైనది. ఆ పార్టీ ద్వితీయ స్థాయి నాయకులలో అత్యధికులు కరడుగట్టిన మితవాదులు లేదా కులీన వర్గాలకు చెందినవారే. రాహుల్‌గాంధీ భావాలు, ఆదర్శాలను వారు విశ్వసిస్తున్నారని చెప్పగల పరిస్థితి ఏ మాత్రం లేదు. నిజానికి రాహుల్ నిర్వహించిన భారత్ జోడో, న్యాయ్ యాత్రలు దేశ వ్యాప్తంగా ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచాయి. ప్రజాభిప్రాయం కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినప్పటికీ ఆ సానుకూలతను ఓట్లుగా మార్చుకోవడంలో రాష్ట్ర స్థాయిలోని ద్వితీయ స్థాయి నాయకులు ఘోరంగా విఫలమయ్యారు.
ఇటీవలి సంవత్సరాలలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంటోంది. గతంలో కాంగ్రెస్ పట్ల బద్ధ వ్యతిరేకత చూపినవారు సైతం ఇప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్నారు. అయితే కాంగ్రెస్ వారిని విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. దేశ రాజకీయాలలో మళ్లీ అగ్రగామి శక్తిగా ఆవిర్భవించాలంటే అటువంటి ఉపేక్షా ధోరణులను కాంగ్రెస్ తక్షణమే విడనాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. పార్టీ పనితీరులో ఒక మౌలిక మార్పు అవశ్యం వచ్చి తీరాలి. రాహుల్ నాయకత్వంపై బీజేపీ దాడులను తన మిత్రపక్షాలు ఏవీ ఖండించకపోవడం కాంగ్రెస్‌ను ఎంతైనా కలవరపెడుతోంది పైగా బీజేపీ వలే అవి కూడా రాహుల్ నాయత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ ధోరణులు బాగా ప్రబలిపోతున్నాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ ముందున్న ప్రత్యామ్నాయం బీజేపీకి వ్యతిరేకంగా ఒంటరిగా పోరాడటమే, తప్పదు. అయితే కాంగ్రెస్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది అసాధ్యం. దేశ రాజకీయాలు అంతకంతకూ భావజాల పోరాటంగా పరిణమిస్తున్నాయన్న వాస్తవం విస్మరించరానిది. సమస్యేమిటంటే కాంగ్రెస్ శ్రేణులు తమ నాయకుడిని అనుసరించలేకపోతున్నాయి. ప్రజలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన సాహసోపేతంగా నిర్దేశిస్తున్న అజెండాలను అర్థం చేసుకోలేకపోతున్నాయి. కాంగ్రెస్ శ్రేణుల ఉదాసీన వైఖరులను రాహుల్ మార్చగలరా? తన భావాలు, భావజాలాన్ని సమాజంలోని అట్టడుగు స్థాయి వర్గాలకి తెలియజేసి వారితో సహా దేశ ప్రజలనందరినీ ఉత్తేజపరిచేందుకు వాటికి మనసా వాచా కర్మణా నిబద్ధమయి, అంకితభావంతో కృషి చేసే కొత్త తరం కార్యకర్తలు, నాయకుల అవసరం రాహుల్‌కు విశేషంగా ఉన్నది.
ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
Updated Date - Jan 14 , 2025 | 12:39 AM