బిస్కెట్లలో ఏవి మంచివి..
ABN, Publish Date - Jan 26 , 2025 | 10:41 AM
ఈ మధ్య ఉస్మానియా బిస్కెట్స్ ప్రతి దుకాణంలోనూ దొరుకుతున్నాయి. వీటికి మామూలు బిస్కెట్స్‌కి తేడా ఏమిటి? మిల్లెట్ బిస్కెట్స్ అన్నిటికంటే మంచిదా? బిస్కెట్స్ అందరూ తినొచ్చా?

ఈ మధ్య ఉస్మానియా బిస్కెట్స్ ప్రతి దుకాణంలోనూ దొరుకుతున్నాయి. వీటికి మామూలు బిస్కెట్స్‌కి తేడా ఏమిటి? మిల్లెట్ బిస్కెట్స్ అన్నిటికంటే మంచిదా? బిస్కెట్స్ అందరూ తినొచ్చా?
- తనిష్క్, రాజస్థాన్
మామూలు బిస్కెట్లతో పోలిస్తే ఉస్మానియా బిస్కెట్లలో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికం. సాచ్యురేటెడ్ కొవ్వు కలిగిన వెన్న లేదా హైడ్రోజినేటెడ్ కొవ్వు పదార్థాలను వీటి తయారీలో వాడడం వల్ల ఉస్మానియా బిస్కెట్స్ లేదా బేకరీ బిస్కెట్స్ గుల్లగా ఉంటాయి. అధిక కొవ్వులు, అందులోనూ సాచ్యురేటెడ్ కొవ్వు ఉండే పదార్థాలను తరచూ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. మామూలు బిస్కెట్లు కూడా మైదా, నూనె, చక్కెర మొదలైన పదార్థాలతోనే తయారవుతాయి.
మిల్లెట్ బిస్కెట్స్‌లో కొద్దిపాటి చిరుధాన్యాలు వాడినప్పటికీ, కొంత మేరకు మైదా లేదా గోధుమ పిండి, చక్కెర లేదా మరేదైనా తీపినిచ్చే పదార్థం, కొద్దిగా కొవ్వు వాడవలసి ఉంటుంది. ఇలా బిస్కెట్లు ఏవైనా వాటిలో పిండి పదార్థాలు అధికం, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. చాలా బిస్కెట్లలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్ల లాంటి పోషకాలు అసలు ఉండవు. కాబట్టి బిస్కెట్లను దైనందిన ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ప్రత్యేక ఉపయోగాలేమీ లేవు. పోషకాహారం స్థానంలో ప్రత్యామ్నాయాలుగా బిస్కెట్లు తీసుకొంటే ఇబ్బందే. అలవాటుగా కాకుండా ఎప్పుడైనా ఒకసారి రెండుకు మించకుండా తీసుకున్నప్పుడు ఎటువంటి బిస్కెట్లయినా పర్లేదు కానీ ప్రతి రోజూ బిస్కెట్లు తీసుకోవడం ఏ వయసుల వారికైనా మంచిది కాదు. బిస్కెట్లను కూడా జంక్ ఫుడ్ కిందే పరిగణించాలి.
మా అమ్మకు 38 ఏళ్ళు. మాంసాహారం తీసుకొంటారు. గత ఆరునెలలుగా ఫ్యాటీ లివర్, ఫ్యాటీ పాంక్రియాస్ సమస్యలతో బాధపడుతున్నారు. సైనస్ సమస్య ఉండడం వల్ల సిట్రస్ పండ్లను తీసుకోరు. గత మూడు నెలలుగా కేవలం పండ్లు, కొబ్బరి నీళ్లు, ఆకుకూరలు మాత్రమే తింటున్నారు. పప్పు ధాన్యాలు బాగా ఇబ్బంది కలిగిస్తున్నాయని అవి కూడా మానేశారు. తగిన పోషకాలు అందక బాగా బరువు తగ్గి నీరసించిపోయారు. తగిన పోషకాల కోసం ఏ ఆహారం తీసుకోవాలి?
- అంజలి, ఖమ్మం
ఫ్యాటీ లివర్, ఫ్యాటీ పాంక్రియాస్‌తో పాటు గాస్త్రైటిస్ వంటి జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులలో మార్పులను బట్టి ఈ నియమాలు మారుతూ ఉంటాయి. కేవలం పండ్లు, ఆకుకూరలు, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల ప్రొటీన్లు, ఆవశ్యక కొవ్వులవంటి అవసరమైన పోషకాలు అందక ఆరోగ్యం మెరుగయ్యేందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. ప్రొటీన్ కోసం పప్పు ధాన్యాలు తీసుకోలేనప్పుడు గుడ్డు, పెరుగు వంటి ప్రత్యామ్నాయాలు ప్రయత్నించవచ్చు. కొన్నిసార్లు నిపుణుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది. సైనస్ ఉన్నప్పుడు సిట్రస్ పండ్లు తినకూడదు అనేది అందరికి వర్తించదు. కేవలం సిట్రస్ పండ్లు తీసుకున్నప్పుడు సైనస్ లక్షణాలు కనిపించి ఎలర్జీ వంటివి ఉన్నవారు మాత్రం వీటిని మానేయడం లేదా తగ్గించి తీసుకోవాలి. సొంత వైద్యం లేదా ఉచిత సలహాల ద్వారా ఇటువంటి ఆరోగ్య సమస్యలు నయం చేసుకుందాం అనుకొంటే మాత్రం ఇబ్బందే.
నాకు 67 ఏళ్ళు. రాత్రిపూట పాలు తాగేప్పుడు అందులో చిటికెడు పసుపు, మిరియాలు కూడా తీసుకోవచ్చా?
- సుబ్బారావు , అనంతపురం
పసుపులో ఉండే కర్కుమిన్ అనే యాంటీఆక్సిడెంట్ కొవ్వులొ కరిగే స్వభావం కలిగి ఉంటుంది. దీనిని శరీరం శోషించుకునేందుకు మిరియాలు ఉపయోగ పడతాయి. సాధారణంగా పాలలో కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉంటాయి కాబట్టి అందులో పసుపు, మిరియాల పొడి వేసుకొంటే శరీరం సంగ్రహించేందుకు బాగుంటుంది. అలాగే పాలు, పాల పదార్థాల్లోని ట్రిప్టోఫాన్ అనే ఎమినో ఆమ్లం నిద్ర చక్కగా పట్టేందుకు సహాయపడుతుంది. మజ్జిగలో వెన్న తీయకుండా ఉన్నప్పుడు అందులో పసుపు, మిరియాలు వేసుకోవచ్చు, కానీ వెన్న తీసిన మజ్జిగలో వేస్తే కొవ్వు పదార్థాలు తక్కువ కాబట్టి పసుపును శరీరం సంగ్రహించుకునే అవకాశం తక్కువ అవుతుంది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
Updated Date - Jan 26 , 2025 | 10:41 AM