Grand Canyon : చంద్రుడిపై పది నిమిషాల విధ్వంసం!
ABN, Publish Date - Feb 08 , 2025 | 05:47 AM
గ్రాండ్ కాన్యన్.. అమెరికాలోని అరిజోనాలో కొలరాడో నది కొన్ని మిలియన్ల సంవత్సరాలపాటు కొండలను రాసుకుంటూ ప్రవహించడం వల్ల సహజసిద్ధంగా ఏర్పడ్డ అతి పెద్ద లోయ! 6093 అడుగుల లోతు.. 446 కిలోమీటర్ల పొడుగు.. 29 కిలోమీటర్ల వెడల్పుతో

న్యూయార్క్, ఫిబ్రవరి 7: గ్రాండ్ కాన్యన్.. అమెరికాలోని అరిజోనాలో కొలరాడో నది కొన్ని మిలియన్ల సంవత్సరాలపాటు కొండలను రాసుకుంటూ ప్రవహించడం వల్ల సహజసిద్ధంగా ఏర్పడ్డ అతి పెద్ద లోయ! 6093 అడుగుల లోతు.. 446 కిలోమీటర్ల పొడుగు.. 29 కిలోమీటర్ల వెడల్పుతో అచ్చెరువొందించే ఆ ప్రకృతి అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ ఏటా లక్షలాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తుంటారు! అలాంటి అతిపెద్ద లోయలు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో రెండున్నాయి. వాటి పేర్లు.. వ్యాలిస్ ష్రోడింగర్, వ్యాలిస్ ప్లాంక్. వీటిలో వ్యాలిస్ ష్రోడింగర్ దాదాపు 2.7 కిలోమీటర్ల లోతుతో.. ఇంచుమించుగా 270 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. వ్యాలిస్ ప్లాంక్ పొడుగు కూడా దాదాపు 270 కిలోమీటర్లేగానీ.. లోతు ఏకంగా 3.5 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అవి మన గ్రాండ్ కాన్యన్ లోయలా సహజసిద్ధంగా కొన్ని మిలియన్ సంవత్సరాలపాటు నీటి రాపిడి వల్ల ఏర్పడ్డవి కావని.. 380 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశకలం తాకిడి కారణంగా కేవలం పది నిమిషాల్లో ఏర్పడ్డాయని అంతర్జాతీయ శాస్త్రజ్ఞుల బృందం తాజా అధ్యయనంలో వెల్లడైంది. నాసాకు చెందిన లూనార్ రికన్నైజాన్స్ ఆర్బిటర్ ఆ ప్రాంతంలో తీసిన ఛాయాచిత్రాలు, ఇతరత్రా డేటాను విశ్లేషించి వారు ఈ అంచనాకు వచ్చారు. అప్పట్లో ఆ గ్రహశకలం గంటకు 3600 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొన్నప్పుడు ఉత్పన్నమైన శక్తి.. అమెరికా, సోవియెట్ యూనియన్, చైనా దేశాలు ఇప్పటిదాకా చేపట్టిన అణు పరీక్షలన్నింటివల్ల ఉద్భవించిన శక్తి కన్నా 700 రెట్లు ఎక్కువని.. అందుకే 10 నిమిషాల వ్యవధిలో ఈ లోయలు చందమామపై ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞులు వివరించారు.
ఇవి కూడా చదవండి..
AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Feb 08 , 2025 | 05:47 AM