Share News

Golconda Blue Auction: గోల్కొండ బ్లూ వజ్రం 430 కోట్లు

ABN , Publish Date - Apr 15 , 2025 | 03:59 AM

గోల్కొండ గనుల్లో దొరికిన అరుదైన ‘గోల్కొండ బ్లూ’ వజ్రం మే 14న జెనీవాలో వేలంకి రానుంది 23.24 కేరట్ల ఈ నీలి వజ్రానికి రూ.430 కోట్ల వరకూ ధర పలికే అవకాశం ఉంది

Golconda Blue Auction: గోల్కొండ బ్లూ వజ్రం 430 కోట్లు
Golconda Diamond

జెనీవా, ఏప్రిల్‌ 14: ఒకనాటి గోల్కొండ రాజ్యంలోని వజ్రాల గనుల్లో దొరికిన అరుదైన ‘గోల్కొండ బ్లూ’ వజ్రం వేలానికి రానుంది. ప్రఖ్యాత క్రిస్టీస్‌ సంస్థ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మే 14వ తేదీన ఈ వజ్రాన్ని విక్రయించనుంది. రాచ వారసత్వం, విభిన్నమైన నీలి రంగులో, 23.24 కేరట్ల పరిమాణంతో ఉండటంతో ‘గోల్కొండ బ్లూ’కు మంచి ధర పలుకుతుందని క్రిస్టీస్‌ సంస్థ ప్రతినిధి రాహుల్‌ కడాకియా తెలిపారు. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. ‘గోల్కొండ బ్లూ’ వజ్రం గురించి తెలిసిన చరిత్ర ప్రకారం.. మొదట్లో అది ఇండోర్‌ రాజు మహారాజా యశ్వంత్‌రావు హోల్కర్‌-2 వద్ద ఉండేది. 1923 సమయంలో చేతికి ధరించే బ్రాస్‌లెట్‌లో ఈ వజ్రాన్ని పొదిగారు.

తర్వాత ఇండోర్‌ పియర్స్‌గా పిలిచే మరో రెండు వజ్రాలతో కలిపి ‘గోల్కొండ బ్లూ’ను మహారాణి ధరించే నెక్లస్ లో అమర్చారు. ఆ కాలంలో ఇండోర్‌కు వచ్చిన ఫ్రెంచ్‌ చిత్రకారుడు బెర్నార్డ్‌ బౌటెట్‌ గీసిన చిత్రంలో మహారాణి ఈ నెక్లెస్‌ను ధరించి ఉండటం గమనార్హం. 1947లో నాటి ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్‌స్టన్‌ చేతికి ‘గోల్కొండ బ్లూ’ వజ్రం చేరింది. తర్వాత బరోడా మహరాజు దాన్ని కొనుగోలు చేశారు. కొంతకాలం అనంతరం మళ్లీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా జెనీవాలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో వేలం వేయనున్నారు. సాధారణంగా స్వచ్ఛమైన నీలం రంగులో ఉండే వజ్రాలకు డిమాండ్‌ ఎక్కువ. ఇంతకు ముందు 14.62 కేరట్ల ‘ఓపెన్‌హైమర్‌ బ్లూ’ వజ్రం ఏకంగా రూ.495 కోట్లకు అమ్ముడవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి..

వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్

భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 15 , 2025 | 10:43 AM