India Slams Pak: రైలు హైజాకింగ్ ఘటనపై అసంబద్ధ ఆరోపణలు.. పాక్‌పై మండిపడ్డ భారత్
ABN, Publish Date - Mar 14 , 2025 | 12:21 PM
బలోచ్ రైలు హైజాకింగ్‌లో భారత్ పాత్రను కొట్టిపారేయలేమంటూ పాక్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. తమ వైఫల్యాలకు ఇతరులపై నెపం నెట్టడం మానుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: బలోచిస్థాన్ రైలు హైజాకింగ్‌లో భారత్ పాత్ర ఉండొచ్చంటూ పాక్ విదేశాంగ శాఖ చేసిన ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది. తన సమస్యలకు పొరుగువారిని బాధ్యుల్ని చేసే ప్రయత్నం మానుకోవాలని మండిపడింది. ‘‘పాక్ చేసిన నిరాధార ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాము. ప్రపంచంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మూలం ఎక్కడుందో ప్రపంచానికి అంతటికీ తెలుసు. ఎదుటి వారిపై నెపం నెట్టి బాధ్యుల్ని చేసే బదులు పాక్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. తన అంతర్గత సమస్యలకు, వైఫల్యాలకు ఇతరులు కారణమని అనడం మానుకోవాలి’’ అని విదేశాంగ శాఖ రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు (India Slams Pak over Train Hijack Incident).
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
గురువారం హైజాకింగ్ ఘటనపై పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. రైలును హైజాక్ చేసిన వేర్పాటువాదులు ఆఫ్ఘనిస్థాన్‌లోని తమ లీడర్లతో టచ్‌లో ఉన్నారని అన్నారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాపాలను ఆప్ఘాన్ భూభాగంలో అనుమతించరాదని అక్కడి వారికి తాము గతంలో అనేక సార్లు స్పష్టం చేసినట్టు కూడా పేర్కొన్నారు. ఈ ఘటనలో పాలు పంచుకున్న పాత్రధారులు సూత్ర దారులు అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా తమకు సహకరించాలని ఆప్ఘాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Donald Trump: ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..
ఈ క్రమంలో విలేకరులు భారత్ ప్రస్తావన తెచ్చారు. బలోచ్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాపాలకు గతంలో భారత్‌ను నిందించే పాక్ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా అని అన్నారు. దీనిపై పాక్ ప్రతినిధి స్పందిస్తూ తమ విధానంలో మార్పు ఏమీ లేదని అన్నారు. ‘‘వాస్తవాల్లో మార్పు ఏమీ లేదు. పాక్‌పై ఉగ్రవాదం ఎగదోయడం వెనక భారత్ ఉంది. ఈ ఘటనలో మాత్రం కాల్ డాటా ఆప్ఘానిస్థాన్ పాత్ర సూచిస్తోంది. మేము అది మాత్రమే అన్నాము’’ అని అన్నారు. పొరుగు దేశాలను అస్థిరపరిచి ప్రపంచవ్యాప్తంగా హత్యలను భారత్ ప్రేరేపించే ప్రయత్నం చేస్తోందని కూడా అన్నారు. భారత మీడియా కూడా బలోచ్ చర్యలను పొగుడుతూ కథనాలు ప్రచురిస్తోందని, ఇది భారత విధానాలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. దీంతో, భారత్ పాక్ తీరును ఎండగడుతూ గట్టి రిప్లై ఇచ్చింది. అయితే, రైలును తమ ఆధీనంలోకి తీసుకున్నామని ఇటీవల పాక్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ ముగిసినట్టు వెల్లడించింది. అయితే, బలోచ్ ఆర్మీ మాత్రం ఈ ప్రకటనను తోసి పుచ్చింది.
Read Latest and International News
Updated Date - Mar 14 , 2025 | 12:50 PM