Share News

96 గంటల సుదీర్ఘ చర్చలు

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:51 AM

దాదాపు 15 నెలలపాటు అంతులేని విధ్వంసానికి, ప్రాణనష్టానికి, వేదనలు, రోదనలకు కారణమైన ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం వెనుక సుదీర్ఘమైన కసరత్తు దాగి ఉంది.

96 గంటల సుదీర్ఘ చర్చలు

  • దానివల్లే ఇజ్రాయెల్‌- హమాస్‌ కాల్పుల విరమణ

  • ఒప్పందానికి అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తిత్వం

  • హమాస్‌ వెనక్కి తగ్గేవరకూ ఆమోదించం: నెతన్యాహు

  • ఇజ్రాయెల్‌ వైదొలిగితేనే బందీల విడుదల: హమాస్‌

  • ఒప్పందం ఘనత మాదే.. బైడెన్‌, ట్రంప్‌ ప్రకటనలు

టెల్‌అవీవ్‌, జనవరి 16: దాదాపు 15 నెలలపాటు అంతులేని విధ్వంసానికి, ప్రాణనష్టానికి, వేదనలు, రోదనలకు కారణమైన ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం వెనుక సుదీర్ఘమైన కసరత్తు దాగి ఉంది. ఇరుపక్షాలు నిరవధికంగా 96 గంటలపాటు చర్చలు జరిపి చివరికి ఒక పరిష్కారానికి చేరుకున్నాయి. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్‌, ఈజిప్టు ప్రతినిధుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఖతార్‌ రాజధాని దోహాలో ఓ బహుళ అంతస్తుల భవనంలో చర్చలు జరిగాయి. ఇజ్రాయెల్‌, హమాస్‌ ప్రతినిధులు విడివిడిగా ఒక్కో అంతస్తులో ఉండగా.. వారితో మధ్యవర్తులు చర్చలు జరుపుతూ వివాదాన్ని కొలిక్కి తెచ్చారు. కాగా, ఈ చర్చల ప్రక్రియలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌ తరఫున ప్రతినిధులు ఒక్కటిగా కాకుండా.. ఎవరికివారుగానే పాల్గొనటం విశేషం. బైడెన్‌ దూత గా బ్రెట్‌ మెక్‌గార్క్‌, ట్రంప్‌ ప్రతినిధిగా స్టీవ్‌ విట్కా ఫ్‌ పాల్గొన్నారు. అయితే, వారిద్దరూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకొంటూ.. మంచి సమన్వయంతో చర్చలను ముందుకు తీసుకెళ్లారని అమెరికా ప్రభుత్వాధికారులు వెల్లడించారు. చర్చల్లో అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్‌, ఆ దేశ జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సులివాన్‌ కీలకపాత్ర పోషించారని బైడెన్‌ కొనియాడారు. తమ వల్లే ఇజ్రాయెల్‌-హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమైందంటూ అటు బైడెన్‌, ఇటు ట్రంప్‌ పోటాపోటీగా ప్రకటనలు జారీ చేయటం గమనార్హం.


ఒప్పందం ప్రకారం ఇలా..

ఈ నెల 19 నుంచి అమలులోకి రానున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. తమ వద్ద బందీలుగా ఉన్న 33 మందిని హమాస్‌ వచ్చే ఆరువారాల వ్యవధిలో విడిచిపెడుతుంది. దానికి బదులుగా ఇజ్రాయెల్‌ జైళ్లలో సుదీర్ఘకాలంగా మగ్గుతున్న వందలాది మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ వదిలిపెడుతుంది. గాజాలో మోహరించిన పలు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం వైదొలుగుతుంది. ఇజ్రాయెల్‌ హెచ్చరికలు, బాంబుల వర్షంతో తరలిపోయిన గాజా వాసులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటారు. రెండోదశలో భాగంగా హమాస్‌ తమ వద్ద ఉన్న మిగిలి ఉన్న బందీలను (వీరిలో ఇజ్రాయెల్‌ సైనికులు కూడా ఉన్నారు) విడిచిపెడుతుంది. ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణకు పూర్తిగా కట్టుబడి, దళాలను పూర్తిగా ఉపసంహరించుకోనంతవ రకూ తాము రెండో దశ బందీల విడుదల ప్రక్రియను చేపట్టబోమని హమాస్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, హమా్‌సను పూర్తిగా తుదముట్టించేంతవరకూ తమ పోరాటం ఆగదని ఇజ్రాయెల్‌ తెలిపింది.


యుద్ధనష్టం ఇజ్రాయెల్‌

2023 అక్టోబరు 7న హమాస్‌ దాడి - 1200 మంది మృతి; బందీలు 251 మంది (వీరిలో కొందరు ఇప్పటికే విడుదల కాగా.. పలువురు మరణించారు. 62 మంది సజీవంగా ఉన్నట్లు అంచనాలున్నాయి) ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం: మృతి చెందిన సైనికులు: 840; గాజా నుంచి ఇజ్రాయెల్‌ మీదికి ప్రయోగించిన రాకెట్లు: 10 వేలకుపైగా; దాడుల కారణంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలు: 75,500


గాజా

మరణించిన పాలస్తీనీయన్లు - 46 వేల మందికిపైగా (వీరిలో సగానికిపైగా స్త్రీలు, పిల్లలు), గాయపడిన వారు - 1.09 లక్షల మంది, హతమైన మిలిటెంట్లు: 17 వేల మంది (ఇజ్రాయెల్‌ సైన్యం చెప్పినదాని ప్రకారం), ధ్వంసమైన ఇల్లు, కట్టడాలు: 1,36,000; ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజలు: 19 లక్షల మంది; ఇజ్రాయెల్‌ అదుపులో ఉన్న గాజా భూభాగం: 90 ు.

పుతిన్‌తో భేటీ కానున్న ట్రంప్‌!

అమెరికా అధ్యక్షుడిగా ప్ర మాణం అనంతరం ట్రంప్‌.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని గురువారం వార్తలు వెలువడ్డాయి. ఈ సమావేశంలో.. ఉక్రెయిన్‌ నాటో సభ్యత్వం గురించి ఇరువురూ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. నాటో తో సంబంధాలను ఉక్రెయిన్‌ వదులుకోవాలని, పరిమితంగానే సైన్యాన్ని ఉంచుకోవాలని పుతిన్‌ డిమాండ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందన్న వివరాలు వెల్లడి కాలేదు.

Updated Date - Jan 17 , 2025 | 04:51 AM