Share News

DeepSeek AI: చాట్‌జీపీటీకి చైనా పోటీ!

ABN , Publish Date - Jan 29 , 2025 | 02:16 AM

చైనాలోని హాంగ్జౌ నగరంలో ‘డీప్‌సీక్‌’ అనే కృతిమ్ర మేధ (AI) సంస్థ తన ఏఐ మోడల్‌ ‘ఆర్‌1’ను ఆవిష్కరించింది! ఆ తర్వాత వారంరోజుల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది! చాట్‌ జీపీటీ, మెటా, జెమినై వంటి ప్రముఖ ఏఐ మోడళ్లకే సవాల్‌ విసిరే స్థాయిలో ప్రజాదరణ పొందింది.

DeepSeek AI: చాట్‌జీపీటీకి చైనా పోటీ!

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘డీప్‌సీక్‌’ కృత్రిమ మేధ

(సెంట్రల్‌ డెస్క్‌)

ప్రపంచమంతా వాషింగ్టన్‌డీసీలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించే వేడుకలపై దృష్టిసారించిన వేళ.. అదే రోజు (జనవరి 20న) శ్వేతసౌధానికి 12 వేల కిలోమీటర్లకు ఆవల.. చైనాలోని హాంగ్జౌ నగరంలో ‘డీప్‌సీక్‌’ అనే కృతిమ్ర మేధ (ఏఐ) సంస్థ తన ఏఐ మోడల్‌ ‘ఆర్‌1’ను ఆవిష్కరించింది! ఆ తర్వాత వారంరోజుల్లోనే అది ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది! చాట్‌ జీపీటీ, మెటా, జెమినై వంటి ప్రముఖ ఏఐ మోడళ్లకే సవాల్‌ విసిరే స్థాయిలో ప్రజాదరణ పొందింది. యాపిల్‌ యాప్‌స్టోర్‌లో చాట్‌జీపీటీని దాటేసి.. ‘అత్యధికులు డౌన్‌లోడ్‌ చేసుకున్న ఉచిత యాప్‌’గా అగ్రస్థానంలో నిలిచింది. ఆ కథేంటో తెలియాలంటే.. ముందు ఈ ‘డీప్‌సీక్‌’ను అభివృద్ధి చేసిన లియాంగ్‌ వెన్‌ఫెంగ్‌ (40) కథ తెలియాలి. దక్షిణ చైనాలోని గువాంగ్‌డాంగ్‌లో జన్మించిన లియాంగ్‌.. ఐటీ ఇంజనీరింగ్‌లో బాచిలర్స్‌ డిగ్రీ (2007), ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌ చేశాడు. 2015లో అతడు హై ఫ్లయర్‌ అనే హెడ్జ్‌ ఫండ్‌ కంపెనీని ప్రారంభించాడు. అది కంప్యూటర్‌ ఆధారిత స్టాక్‌ ట్రేడింగ్‌ కంపెనీ. దానికి అవసరమైన వ్యూహాలు రూపొందించేందుకు లియాంగ్‌ కృత్రిమ మేధపై దృష్టి సారించాడు. ఏఐ రూపకల్పనకు అత్యంత శక్తిమంతమైన చిప్‌లు కావాలి కాబట్టి.. 2021లో పదివేలకు పైగా ఎన్‌విడియా హెచ్‌800 చిప్‌లను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో లియాంగ్‌ చుట్టూ ఉన్నవాళ్లంతా అతణ్నో పిచ్చివాడి కింద జమకట్టారు. కానీ.. తాను చేయబోతున్నదేంటో లియాంగ్‌కు తెలుసు. అందుకే.. ‘ఇది గేమ్‌ చేంజర్‌ కాబోతోంది’ అని మాత్రమే వారికి చెప్పిన లియాంగ్‌ 2023 మే నెలలో డీప్‌సీక్‌ సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఏడాదిన్నరలోపే.. డీప్‌సీక్‌కోడర్‌, లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ మోడల్‌, డీప్‌సీక్‌-వీ2, డీప్‌సీక్‌ కోడర్‌-వీ2 ఇలా పలు మోడళ్లను అభివృద్ధి చేశాడు. 2025 జనవరి 10న డీప్‌సీక్‌ వీ3ని విడుదల చేశాడు. దానికి కొనసాగింపుగా.. తర్కంతో కూడిన క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పే డీప్‌సీక్‌ ఏఐ మోడల్‌ ఆర్‌1ను జనవరి 20న ఆవిష్కరించాడు.

444.jpg


ఖర్చు తక్కువ.. సామర్థ్యంలో మేటి..

ఓపెన్‌ ఏఐ సంస్థ చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడానికి 10 కోట్ల డాలర్ల దాకా (దాదాపు రూ.865 కోట్లు) ఖర్చయితే.. లియాంగ్‌కు డీప్‌సీక్‌ను అభివృద్ధి చేయడానికి జస్ట్‌ 60 లక్షల డాలర్లు (దాదాపు రూ.52 కోట్లు) అయ్యిందంతే!! కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని కూడా డీప్‌సీక్‌ చాలా తక్కువగా వాడుకుంటుంది. ఉదాహరణకు.. ఓపెన్‌ఏఐ, మెటా వంటివి 16వేలు అంతకంటే ఎక్కువ అధునాతన చిప్‌లతో కూడిన సూపర్‌కంప్యూటర్ల ద్వారా ఏఐ చాట్‌బాట్లకు శిక్షణ ఇస్తుంటే.. డీప్‌సీక్‌ కేవలం 2000 పాత చిప్‌లతో అంతే సమర్థంగా శిక్షణ ఇస్తోంది. కానీ.. పనితీరులో మాత్రం అది మిగతా ఏఐలతో సమానంగా ఉందని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు. లాజికల్‌ రీజనింగ్‌ టెస్ట్‌ స్కోర్‌ ఫలితాల్లో డీప్‌సీక్‌.. చాట్‌జీపీటీని, క్లాడ్‌ ఏఐని 7 నుంచి 14ు తేడాతో అధిగించినట్టు చెబుతున్నారు. క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో చాట్‌జీపీటీతో (78ు) పోలిస్తే డీప్‌సీక్‌ (92ు) బాగా పనిచేస్తున్నట్టు తెలిపారు.

ఖర్చు తగ్గించండి..

డీప్‌సీక్‌ జోరుపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఈ పరిణామాన్ని అమెరికన్‌ పరిశ్రమలకు మేలుకొలుపుగా భావించాలని హెచ్చరించారు. కృత్రిమ మేధ పోటీలో గెలుపుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఏఐ మోడళ్ల అభివృద్ధికి వందల కోట్ల డాలర్లు ఖర్చుచేయడం మాని తక్కువ ఖర్చుతో ఇవే సామర్థ్యాలను సాధించాలని సూచించారు. ఇక.. డీప్‌సీక్‌ అభివృద్ధి చేసిన ఆర్‌1 మోడల్‌ పనితీరు ఆకట్టుకునేలా ఉందని.. ఓపెన్‌ఏఐ చీఫ్‌ శామ్‌ ఆల్ట్‌మన్‌ ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు. ఈ రంగంలో కొత్తపోటీదారును కలిగి ఉండడం ఉత్సాహాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.


టెక్‌ దిగ్గజాల షేర్లు ఢమాల్‌..

ఒపెన్‌ ఏఐ, మెటా, గూగుల్‌ వంటి సంస్థలు వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి.. అత్యంత అధునాతన చిప్‌లు ఉపయోగించి తమ తమ కృతిమ్ర మేధ మోడళ్లను అభివృద్ధి చేసినట్టు చెప్పుకొంటుంటే.. ఎప్పుడో నాలుగేళ్ల నాటి ఎన్‌విడియా చిప్‌లతో వాటికి పోటీనిచ్చే ఏఐ మోడల్‌ను చైనా కంపెనీ తయారుచేసిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో ఆయా కంపెనీల షేర్లు పతనమవడం ప్రారంభించాయి. ఎన్‌విడియా కంపెనీ షేరు ధర ఏకంగా 17 శాతం క్షీణించింది,. దీంతో ఒక్కరోజే ఆ సంస్థ దాదాపు రూ.52 లక్షల కోట్ల మేర మార్కెట్‌ విలువను కోల్పోయింది. ఆ కంపెనీ సహవ్యవస్థాపకుడు జెన్సన్‌ హువాంగ్‌ ఆస్తుల నికర విలువ రూ.1.74 లక్షల కోట్ల మేర తరిగిపోయింది. ఇది ఆయన మొత్తం ఆస్తిలో 20 శాతానికి సమానం. డీప్‌సీక్‌ దెబ్బకు నాస్‌డాక్‌ సూచీ 3.1 శాతం, ఎస్‌ అండ్‌ పీ ఇండెక్స్‌ 1.5ు నష్టపోవడంతో టాప్‌-500 బిలియనీర్లు దాదాపు రూ.9.35 లక్షల కోట్లు నష్టపోయారు.

ఉచితంగా..

ఓపెన్‌ఏఐ, మెటా, గూగుల్‌ జెమినై, క్లాడ్‌ ఏఐ వంటివాటిని కొంతమేర మాత్రమే ఉచితంగా వాడుకోగలం. ఆధునిక వెర్షన్లు, ఫీచర్లు వాడుకోవాలంటే డబ్బు చెల్లించాల్సిందే. కానీ, డీప్‌సీక్‌ సంస్థ తన కృత్రిమమేధ మోడల్‌ను ఓపెన్‌సోర్స్‌ విధానంలో అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అంటే.. వినియోగదారులు ఉచితంగా వాడుకోవడమే కాదు.. వ్యాపారసంస్థలు, పరిశోధకులు డీప్‌సీక్‌ కోడ్‌ను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వీలు ఉంటుందన్నమాట. అయితే.. అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ డేటాకు మాత్రం డీప్‌సీక్‌ సంస్థ కొంత మొత్తాన్ని వసూలు చేస్తోంది. అదీ ఇతర ఏఐలతో పోలిస్తే చాలా తక్కువ. కాగా.. డీప్‌సీక్‌ యాప్‌ డౌన్‌లోడ్‌కు కోట్లాది మంది ప్రయత్నిస్తుండడంతో సర్వర్లు స్తంభించిపోతున్నాయి.


అది మాత్రం అడక్కు!

ప్రపంచంలో ఏ విషయం గురించి అడిగినా ఠక్కున చెప్పే డీప్‌సీక్‌ ఏఐ.. చైనాకు సంబంధించిన, ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టే అంశాల గురించి అడిగితే మాత్రం... ‘ఆ ఒక్కటి అడక్కు’ అన్నట్టుగా ముడుచుకుపోతుంది. ఆ ప్రశ్నకు తనకు సమాధానం తెలియదంటుంది. ఉదాహరణకు.. అరుణాచల్‌ప్రదేశ్‌ గురించి ఒక భారతీయుడు డీప్‌సీక్‌ను అడిగితే.. ‘క్షమించండి. అది నా పరిధిలో లేని అంశం. మనం మరే ఇతర అంశం గురించైనా మాట్లాడుకుందాం’ అని సమాధానం ఇచ్చింది. ‘జిన్‌పింగ్‌ ఒక నియంతా?’ అనే ప్రశ్నకు, ‘తైవాన్‌ దేశం గురించి చెప్పు’ అనే ప్రశ్నకు కూడా.. డీప్‌సీక్‌ అదే సమాధానం ఇవ్వడం గమనార్హం.



ఇవి కూడా చదవండి..

Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..

Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 02:19 AM