Los Angeles: హాలీవుడ్ ప్రముఖులపై ప్రజాగ్రహ జ్వాల
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:02 AM
ఎటుచూసినా ఎగసిపడుతున్న మంటలు! నలువైపుల నుంచీ చుట్టుముడుతున్న కార్చిచ్చు!! కాల్చే వేడి.. కమ్మేస్తున్న పొగ..
కాలిఫోర్నియా కార్చిచ్చు
నీటి కొరత కారణంగా అదుపులోకి రాని మంటలు.. ఇళ్లను
కాపాడుకోవడానికి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న హాలీవుడ్ ప్రముఖులు
ప్రైవేటు ఫైర్ ఫైటర్లకు గంటకు 2వేల డాలర్లు ఇస్తున్న వైనం
నీటి కొరతకు సెలబ్రిటీలే కారణమంటూ ప్రజల ఆగ్రహం
గతంలో నిబంధనలు ఉల్లంఘించి తోటలకు నీటిని అడ్డగోలుగా వాడారని ఆరోపణ
లాస్‌ఏంజెలెస్: ఎటుచూసినా ఎగసిపడుతున్న మంటలు! నలువైపుల నుంచీ చుట్టుముడుతున్న కార్చిచ్చు!! కాల్చే వేడి.. కమ్మేస్తున్న పొగ.. దావాగ్ని ధాటికి దారిలో ఉన్నవన్నీ దగ్ధమైతెల్లటి మంచులా కురుస్తున్న బూడిద! హాలీవుడ్ తారలు నివసించే చోటుగా, ‘సిటీ ఆఫ్ ఏంజెల్స్’గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాస్‌ఏంజెలె్‌సలో ప్రస్తుత పరిస్థితి ఇది!! కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆరుచోట్ల దావానలం రగలగా.. వాటిలో లాస్‌ఏంజెలెస్ ప్రాంతంలో మొదలైన ‘ప్యాలిసేడ్స్ వైల్డ్‌ఫైర్’ పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఆ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక దళాలు శక్తికి మించి చెమటోడుస్తున్నాయి. కానీ... నీటి కొరత కారణంగా ఫైర్ హైడ్రంట్స్ పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రావట్లేదు. దీంతో ఈ ముప్పు నుంచి తమ ఇళ్లను కాపాడుకోవడానికి.. హాలీవుడ్ ప్రముఖులు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టే అపర కుబేరులు ప్రైవేటు ఫైర్‌ఫైటర్లకు గంటకు రూ.1.72లక్షలు.. అంటే రోజుకు దాదాపు రూ.40లక్షలు కూడా చెల్లించడానికి సిద్ధం అవుతున్నారు.
దీంతో ఆయా ప్రముఖులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. అసలు ఈ పరిస్థితికి కారణం వారేనని సామాన్యులు మండిపడుతున్నారు. ఆ కథేంటంటే.. వరుసగా మూడేళ్లుగా ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో.. అక్కడి అధికారులు 2022లో నీటి సంరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలు పెట్టారు. వాటిలో ముఖ్యమైనది.. ఇంటి చుట్టూ ఉండే పచ్చికకు, మొక్కలకు వారానికి రెండుసార్లు.. అదీ ఒక్కో తడవకూ 8 నిమిషాల చొప్పున మాత్రమే నీరు పెట్టాలనే నిబంధన. దాన్ని ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కానీ హాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరైన కిమ్ కర్దాషియన్ తన ఇంటి తోటకు వాడాల్సినదానికన్నా అదనంగా 8 లక్షల లీటర్లకు పైగా నీటిని వాడారు. కిమ్ కర్దాషియన్ మాత్రమే కాదు.. లాస్ ఏంజెలె్‌సలో నివసించే సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆంథోనీ హాప్కిన్స్, మెల్ గిబ్సన్, తదితర సెలబ్రిటీలు, సంపన్నులందరిదీ అదే పద్ధతి అని సమాచారం!! నీటి కొరతతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. ఈ సెలబ్రిటీలు అంత విచ్చలవిడిగా నీటిని వాడేయడంపై సామాన్యుల్లో చాలాకాలంగా ఆగ్రహం ఉంది. ‘‘ఒకవైపు లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతుంటే.. ప్రాణాలు కాపాడే నీటివనరులను ‘కేవలం’ మీ విలాసవంతమైన భవనాలను కాపాడుకోవడానికి మళ్లించాలని అనుకుంటున్నారన్నమాట’’ అని దుయ్యబడుతున్నారు.
మరింత ముప్పు..
క్యాలిఫోర్నియాను వణికిస్తున్న పాలిసేడ్స్, ఈటన్ కార్చిచ్చుల కారణంగా ఇప్పటిదాకా 16 మంది మరణించగా.. 12,300 ఇళ్లు, వ్యాపార నిర్మాణాలు తగలబడిపోయాయి. మరో 57 వేల నిర్మాణాలకు దావాగ్ని ముప్పు పొంచి ఉంది. దాదాపు 35 వేల ఇళ్లు/వ్యాపారసముదాయాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పాలిసేడ్స్ దావానలం 23,707 ఎకరాల అడవిని దహించగా.. ఈటన్ కార్చిచ్చు కారణంగా 14,117 ఎకరాల అటవీప్రాంతం తగలబడిపోయింది. ఆ ప్రాంతాల్లోని రెండు లక్షల మందిని వేరేప్రాంతాలకు తరలించారు. మరో లక్షన్నర మంది తరలింపునకు ఆదేశాలిచ్చారు. అగ్నిమాపక దళాలు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా పాలిసేడ్స్‌లో 11ు, ఈటన్‌లో 27ు మంటలను అదుపులోకి తేగలిగారు. పరిస్థితి ఇలా ఉండగా.. ఆ ప్రాంతంలో బలమైన ‘శాంటా అనా గాలులు’ మరోసారి వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు చేసిన ప్రకటన ప్రజల్లో ఆందోళన పెంచింది. క్యాలిఫోర్నియా గవర్నర్ గవిన్ ఈ దావానలాలను అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి ఉత్పాతాలుగా అభివర్ణించారు. పాలిసేడ్స్, ఈటన్‌లో కార్చిచ్చు అదుపులోకి రానప్పటికీ.. కెన్నెత్‌లో పూర్తిగా, హర్స్ట్‌లో 89ు మేర మంటలు అదుపులోకి రావడం ఊరట కలిగించే విషయం. హర్స్ట్‌లో కూడా దావానలం చల్లారితే.. రెండుచోట్ల నుంచీ కలిపి 14 వేల మంది ఫైర్‌ఫైటర్లను పాలిసేడ్స్, ఈటన్‌కు తరలించే అవకాశం అధికారులకు కలుగుతుంది.
Updated Date - Jan 13 , 2025 | 05:01 AM