US Visa Test Tightens: కొత్త జంటలకు వీసా అగ్ని పరీక్ష
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:19 AM
పెళ్లైన కొత్త జంటలు అమెరికా వీసా పొందడంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ట్రంప్ పాలనలో గ్రీన్‌కార్డ్, వీసాలకు కఠిన పరీక్షలు, ఇంటర్వ్యూలు, నిశిత విచారణలు కొనసాగుతున్నాయి

అమెరికా వెళ్లడం ఈజీ కాదు
అమెరికన్‌ను పెళ్లాడినా అక్కడికెళ్లడం కష్టమే!
ముగిసిన ‘బైడెన్’ వెసులుబాట్లు
ట్రంప్ నేతృత్వంలో వీసాలకు కఠిన టెస్ట్.. నిశిత పరిశీలన
ట్రంప్‌ను హత్య చేస్తా..డబ్బులివ్వండి
అమెరికాలో తల్లిదండ్రులను అడిగిన 17 ఏళ్ల బాలుడు
ఇవ్వకపోవడంతో వారి హత్య
వాషింగ్టన్, ఏప్రిల్ 14: ‘‘మా అమ్మాయికి అమెరికా సంబంధం ఖాయం చేసుకున్నాం.’’ అని మురిసిపోయే రోజులు పోయాయ్!. పెళ్లయిన వెంటనే కొత్త దంపతులను సంతోషంగా అగ్రరాజ్యానికి పంపించి ఆనందించే పరిస్థితి కూడా కనుమరుగైంది. కొత్త జంటకు గత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో కొనసాగిన స్వల్ప పరిశీలనలు, తేలిగ్గా ఉండే ఇంటర్వ్యూలు, వెనువెంటనే ఇచ్చే అనుమతులకు కాలం చెల్లింది. ఇప్పుడంతా ట్రంప్ హయాం. వలసలపై ఉక్కుపాదం మోపుతున్న కొత్త అధ్యక్షుడు నూతన జంటల విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. దీంతో అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని వివాహం చేసుకున్న వారు.. అక్కడకు చేరుకోవాలంటే.. నెలలు కాదు, ఏకంగా ఏళ్లు పట్టే పరిస్థితి ఏర్పడింది. అది కూడా.. అనేక శల్య పరీక్షలు, ఇంటర్వ్యూలూ దాటుకుని విజయం దక్కించుకుంటేనే అంటున్నారు అధికారులు.
ఏం జరిగింది?
అమెరికాలో అక్రమ వలసలు పెరిగిపోయాయని చెబుతున్న ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్.. అలాంటివారిని బలవంతంగా ఇంటికి పంపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘పెళ్లి’ పేరుతో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయా? అని ఆరా తీశారు. అదేసమయంలో పెళ్లి చేసుకుని అగ్రరాజ్యానికి వస్తామన్న వారిని అన్ని కోణాల్లోనూ పరిశీలించాలని, ఇంటర్వ్యూలను కఠినతరం చేయాలని ఆదేశించారు. వాస్తవానికి ఈ విషయంలో గత అధ్యక్షుడు బైడెన్ సులభతర విధానం ప్రవేశ పెట్టినప్పటికీ ఆ గడువు ముగిసిపోయింది. దీంతో ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అమెరికా పౌరుడు, లేదా పౌరురాలిని వివాహం చేసుకున్న వారు.. ఇంటర్వ్యూను సమర్థంగా ఎదుర్కొనేందుకు కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. వాటిని ఆధారంగా సమర్పిస్తే అధికారులు సాధ్యమైనంత వేగంగా అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వీటిలో 1) పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్ 2) వివాహ ఖర్చుల రికార్డు 3) అదేవిధంగా ఇరుపక్షాల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన కాల్ లాగ్స్ 4) జీవిత భాగస్వామి పేర తీసుకున్న బీమా వంటివి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీ బాత్రూంలో కిటికీలెన్ని?
కొత్త జంటల ఇంటర్వ్యూలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలను నిపుణులు ఉదహరించారు. బెడ్‌పై మీరు ఏవైపు నిద్రిస్తారు?. ముందుగా ఎవరు నిద్రలేస్తారు?. మీ బాత్‌రూంలో ఎన్ని కిటికీలు ఉన్నాయి?. మీ జీవిత భాగస్వామికి ఫుడ్ అలెర్జీ ఉందా? వంటి ప్రశ్నలు కూడా ఎదరవుతాయని ఇమ్మిగ్రేషన్ అటార్నీ శర్మ తెలిపారు.
ఏం జరుగుతుంది?
అమెరికా పౌరులను వివాహం చేసుకున్న వ్యక్తులను తొలిదశలో ఇంటర్వ్యూ చేయనున్నారు. ఇది గతంలో మాదిరిగా ఉండదు. కఠినంగా ఉంటుంది.
వివాహిత భారత పౌరురాలు అయితే.. ఆమెను అమెరికా కాన్సులేట్ అధికారులే ఇంటర్వ్యూ చేస్తారు.
జీవిత భాగస్వామి హెచ్-1బీ వర్క్ వీసాపై అమెరికాలో ఉంటే.. అప్పుడు మాత్రమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారిని అమెరికా సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సేవల అధికారులు ఇంటర్వ్యూ చేస్తారు.
ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు.. అన్ని పత్రాలను ముందుగానే ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. అధికారులు అడిగే ప్రశ్నలకు గతంలో మాదిరి ‘తెలీదు, మరిచిపోయా’.. వంటి సమాధానాలు చెబితే వెంటనే బయటకు పంపుతారు. బ్లాక్ లిస్టులో పెడతారు.
నకిలీ వివాహాలను పసిగట్టే విషయంలో మరింత లోతుగా పరిశీలిస్తారు. దీనికి సంబంధించి అధికారిక విధానాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
గ్రీన్ కార్డు ఉన్నవారు.. తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసాలకు 3-4 సంవత్సరాల సమయం పడుతోంది.
కొన్ని కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వాములను వేర్వేరుగా ఇంటర్వ్యూ చేసి.. విషయాలను సరిపోల్చుకుంటారు. తేడా వస్తే ‘బ్లాకే’.
ఎవరెవరికి ఎంతెంత సమయం?
అమెరికా పౌరులు తమ జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసాల కోసం ‘ఫాం ఐ-130’ అనుమతి పొందడానికి 14 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత 3-4 నెలలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
గ్రీన్ కార్డు దారులు జీవిత భాగస్వాములకు స్పాన్సర్ చేసే వీసా.. ‘ఎఫ్2ఏ’కు చాలా జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం 2022లో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ట్రంప్‌ను చంపేందుకు డబ్బులివ్వలేదని తల్లిదండ్రుల కాల్చివేత
అమెరికాలో 17 ఏళ్ల బాలుడి ఘాతుకం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుక కుట్ర పన్నిన ఓ 17 ఏళ్ల బాలుడు అందుకు డబ్బులివ్వడంలేదని తల్లిదండ్రులను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన అమెరికా విస్కాన్సిన్‌లో జరిగింది. విస్కాన్సిన్‌లోని మిల్వాకి ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు నికిటా కాసప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన తల్లి టటియానా కాసప్, సవతి తండ్రి డొనాల్డ్ మేయర్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కొన్ని వారాల పాటు మృతదేహాల పక్కన నివసించాడు. ఆ తర్వాత 14 వేల యూఎస్ డాలర్లు, పాస్‌పోర్టు, తన పెంపుడు కుక్కను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. టటియానా కాసప్, డొనాల్డ్ మేయర్ కొన్ని రోజులుగా కనబడడం లేదని అందిన ఫిర్యాదుతో పోలీసులు వారింటికి చేరుకొని చూడగా అక్కడ వారి మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనపించాయి. ఈ హత్యలపై విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడు నికిటా కొన్ని రోజులుగా పాఠశాలకు రావడం లేదని తెలుసుకుని, గాలించి గత నెల క్యాన్సన్‌లో అతడిని అరెస్టు చేశారు. అనంతరం దర్యాప్తులో అతడి గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ను ఆరాధించే నికిటా.. అధ్యక్షుడు ట్రంప్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీని కోసం తల్లిదండ్రులను నిందితుడు డబ్బు అడగ్గా దానికి వారు నిరాకరించడంతో వారిని హత్య చేశాడని తెలుసుకున్నారు. తర్వాత అతడు ఓ డ్రోన్‌ను, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేశాడని పోలీసులు కనుగొన్నారు. ఓ రష్యా వ్యక్తితో కలిసి అతడు ఈ పథకం పన్నినట్లు తెలుసుకున్నారు. ట్రంప్‌ను చంపి ఉక్రెయిన్ పారిపోవాలని అతడు ప్రణాళిక వేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..