Share News

Federal Funds Suspension: హార్వర్డ్‌ నిధులకు ట్రంప్‌ ఎసరు

ABN , Publish Date - Apr 16 , 2025 | 07:02 AM

అమెరికా హార్వర్డ్‌ వర్సిటీ 220 కోట్ల డాలర్ల ఫెడరల్‌ నిధులను ట్రంప్‌ ప్రభుత్వం స్తంభింపజేసింది. వైట్‌హౌస్‌ సూచనలకు విరుద్ధంగా వర్సిటీ చేసిన నిర్ణయంపై ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది, హార్వర్డ్‌ అధ్యక్షుడు ఈ నిర్ణయాన్ని ఎసరుగా పేర్కొన్నారు.

Federal Funds Suspension: హార్వర్డ్‌ నిధులకు ట్రంప్‌ ఎసరు

  • 220 కోట్ల డాలర్లు స్తంభింపజేసిన సర్కారు

  • ప్రభుత్వానికి తలొగ్గమన్న వర్సిటీ అధ్యక్షుడు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 15: అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ వర్సిటీకి 220 కోట్ల డాలర్ల ఫెడరల్‌ నిధులను ట్రంప్‌ ప్రభుత్వం స్తంభింపజేసింది. క్యాంప్‌సలో యూదు వ్యతిరేక నిరసనలను కట్టడి చేయడంలో భాగంగా వైట్‌హౌస్‌ నిర్దేశించిన పలు నిబంధనలను అమలు చేయడానికి తిరస్కరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వర్సిటీ పరిపాలనా విధానాలతో పాటు ప్రవేశాలు, నియామకాల ప్రక్రియల్లో మార్పులు చేయాలని, విదేశీ విద్యార్థుల స్ర్కీనింగ్‌ విషయంలో ఇమిగ్రేషన్‌ అధికారులతో సహకరించాలని ఈనెల 3న హార్వర్డ్‌ వర్గాలకు ఆదేశాలు అందాయి. అయితే తమ స్వతంత్రత, రాజ్యాంగ హక్కులపై వర్సిటీ ఎలాంటి చర్చలు జరపబోదని, ప్రభుత్వ విధానాలకు లొంగబోమని వర్సిటీ విద్యార్థులు, సిబ్బందికి రాసిన బహిరంగ లేఖలో హార్వర్డ్‌ అధ్యక్షుడు అలన్‌ గార్బెర్‌ స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం హార్వర్డ్‌ వర్సిటీకి 2.2 బిలియన్‌ డాలర్ల గ్రాంట్లతో పాటు ఫెడరల్‌ కాంట్రాక్టుల కింద మరో 60 మిలియన్‌ డాలర్లు స్తంభింపజేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంతేకాదు, హార్వర్డ్‌ను రాజకీయ సంస్థ గా ప్రకటిస్తామని, పన్ను మినహాయింపును రద్దు చేస్తామనీ ట్రంప్‌ హెచ్చరించారు. కాగా, ట్రంప్‌ డిమాండ్లను తిరస్కరించడం ద్వారా హార్వర్డ్‌ వర్సిటీ మిగిలిన ఉన్నత విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలిచిందని మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పేర్కొన్నారు. మిగిలిన సంస్థలూ ఇదే బాటలో పయనిస్తాయని ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో ఆయన ఆకాంక్షించారు.

Updated Date - Apr 16 , 2025 | 07:02 AM