Impact India: భూకంప తీవ్రత పెరుగుతోందా?
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:12 AM
ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో భూకంపం వస్తే.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు ఎందుకొస్తాయి? పాకిస్థాన్‌లో భూకంప కేంద్రం ఉంటే..

ఎక్కడో పాక్‌లో భూమి కంపిస్తే..
న్యూఢిల్లీ వరకు ప్రకంపనలు
తక్కువ లోతులో భూకంప కేంద్రమే సమస్య
(సెంట్రల్‌డెస్క్)
ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో భూకంపం వస్తే.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు ఎందుకొస్తాయి? పాకిస్థాన్‌లో భూకంప కేంద్రం ఉంటే.. న్యూఢిల్లీలో 5.1 తీవ్రతతో ప్రకంపనలు ఎందుకొస్తాయి? నేపాల్‌లో భూకంపానికి ఉత్తరాది రాష్ట్రాలకు లింకేమిటి? ఈ ప్రశ్నలకు భూకంప(సెస్మిక్) జోన్‌తోపాటు.. భూగర్భంలోని ఫలకాలు.. వాటిల్లో పగుళ్లు(ఫాల్ట్స్), థ్రస్ట్‌లు ప్రధాన కారణమని భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉంటే.. సుదూర ప్రాంతా ల వరకూ ప్రకంపనలకు ఉంటాయని వివరిస్తున్నారు. ఫలకం లోపలి పగుళ్లతో తక్కువత తీవ్రత ఉంటుందని, ఫలకం సరిహద్దుల్లో, అంతర్-ఫలకాల పగుళ్లు ప్రాణ, ఆస్తినష్టాన్ని కలిగించే స్థాయిలో భూకంపాలను సృష్టిస్తాయని పేర్కొంటున్నారు.
ప్రధాన ఫాల్ట్స్ ఇక్కడే..
భూగర్భంలోని ఫలకాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు భూకంపాలు వస్తాయనే విషయం తెలిసిందే..! భారతదేశం భారత ఫలకంపై ఉండగా.. అది ఏడాదికి 5 సెంటీమీటర్ల చొప్పున ఎగువకు కదులుతుంది. ఈ క్రమంలో పైన ఉండే యురేషిన్ ఫలకం కిందకు దూసుకుపోతోంది. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో హిమాలయాలు ఏర్పడ్డాయి. అయితే.. ఫలకలపైన పలుచోట్ల పగుళ్లు ఏర్పడుతుంటాయి. థ్రస్ట్‌లు ఏర్పడుతాయి. వీటి వల్ల కూడా భూకంపాలు వస్తుంటాయి. వీటి కారణంగా గడిచిన శతాబ్దికాలంలో 8 అంతకంటే ఎక్కువ తీవ్రత ఉన్న నాలుగు భూకంపాలు సంభవించి, భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించాయి. 2004లో సముద్ర గర్భంలో 9.3 తీవ్రతతతో వచ్చిన భూకంపం భారీ సునామీని సృష్టించి.. చరిత్రలోనే అతిపెద్ద విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. ఇక 5-8 తీవ్రతతో ఈ శతాబ్దకాలంలో 650కి పైగా భూకంపాలు వచ్చాయి. వీటన్నింటికీ భూఫలకాల్లో క్రియాశీల లోపాలే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండో-యురేషియన్ ఫలకాల మధ్య హిమాలయాల తూర్పు అంచుల్లో ఇండో-బర్మీ్‌స-అండమాన్ ఫాల్ట్స్‌లో తీవ్రస్థాయిలో ఘర్షణ జరుగుతుందని వివరిస్తున్నారు. ి ఇక ద్వీపకల్ప భాగంలో నర్మద-సోన్-తపతి చీలికలు, దక్కన్ పీఠభూమిలో గోదావరి చీలిక ఫాల్ట్స్‌గా ఉండగా.. అండమాన్ సబ్‌డక్షన్ జోన్‌లో రెండు ఫాల్ట్స్ ఉన్నాయి. ఉత్తరాదితో పోలిస్తే.. ద్వీపకల్ప భాగంలో భూకంప తీవ్రతలు తక్కువ అని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఫాల్ట్స్‌కు ఉండే లింకుల కారణంగా ఢిల్లీ లాంటి నగరాల్లో ముప్పు ఎక్కువ అని పేర్కొంటున్నారు. హిమాలయన్ సెస్మిక్ బెల్ట్, ఢిల్లీ-హరిద్వార్ ప్రాంతం, ఆరావళి ఫాల్ట్స్, ఇండో-గంగా మైదానంలో ఎక్కడ భూకంపం సంభవించినా.. ఢిల్లీలో ప్రకంపనలు రావడానికి ఇదే కారణమన్నారు. ఇదిలా ఉండగా, ఇండోనేషియాలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉత్తర సులవేసి ప్రావిన్స్ వద్ద భూకంప కేంద్రం ఉండగా.. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది. కాగా.. మంగళవారం ఉదయం పశ్చిమబెంగాల్, ఒడిసాల్లో 5.1 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే..! దీని ప్రభావం హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో కూడా కనిపించడం గమనార్హం..!
సాధారణమే.. ఇప్పుడు ఎక్కువగా గుర్తిస్తున్నారు
ఒక చోట భూకంప కేంద్రం ఉంటే.. పదులు, వందల కిలోమీటర్ల వరకు ప్రభావం కనిపించడం సాధారణమే. ఇది కొత్తేమీ కాదు. ఇలా సుదూర ప్రాంతాల వరకు భూకంప ప్రభావం ఉండడానికి భూకంప కేంద్రం లోతును ప్రధాన కారణంగా చెప్పవచ్చు. లోతు ఎంత ఎక్కువగా ఉంటే.. భూకంప తీవ్రత అంత తక్కువగా ఉంటుంది. అదే 5-10 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉంటే.. సుదూర ప్రాంతాల్లోనూ భూములు కంపిస్తాయి. ఢిల్లీ వంటి నగరాలు జోన్-4లో ఉన్నాయి. భారత ప్రమాణాల విభాగం(బీఐఎస్) సూచించిన జోన్-4, జోన్-5 ప్రాంతాల్లో భూకంపాల ముప్పు, ఆస్తి/ప్రాణనష్టం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేషనల్ బిల్డింగ్ కోడ్‌కు అనుగుణంగా ఈ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మిస్తే.. నష్టాన్ని అరికట్టవచ్చు.
- రామన్‌చర్ల ప్రదీప్ కుమార్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్