Tax Relief : రూ.10 లక్షల వరకు ఐటీ లేదు?

ABN, Publish Date - Jan 24 , 2025 | 04:24 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌లో వేతన జీవులకు భారీగా ఊరట కలిగించే అవకాశం ఉన్నట్టు ఓ కథనం వెలువడింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు

 Tax Relief : రూ.10 లక్షల వరకు  ఐటీ లేదు?

బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట!

కొత్తగా 25ు పన్ను శ్లాబ్‌ యోచన

పరిశీలనలో ఉన్నట్టు సమాచారం

న్యూఢిల్లీ, జనవరి 23: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2025-26 బడ్జెట్‌లో వేతన జీవులకు భారీగా ఊరట కలిగించే అవకాశం ఉన్నట్టు ఓ కథనం వెలువడింది. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఒక ఆంగ్ల మేగజీన్‌లో ప్రచురితమైన ఆ కథనం తెలిపింది. ప్రస్తుతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75 వేలు ఉన్నందున రూ.7.75 లక్షల వార్షిక ఆదాయం వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. దీన్ని రూ.10 లక్షల ఆదాయం వరకూ పెంచనున్నట్టు ఆ కథనం పేర్కొంది. అలాగే, రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల ఆదాయం వరకు కొత్తగా 25% పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఆ కథనం తెలిపింది. ప్రస్తుతం 15 లక్షల పైబడిన ఆదాయానికి 30ు పన్ను విధిస్తున్నారు. దీన్ని 25 శాతానికి తగ్గించడం వల్ల 15 లక్షల పైబడిన వార్షిక ఆదాయం ఉన్నవారికి ఊరట కలుగనుంది. ఈ మేరకు ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి సంకేతాలు వచ్చాయని ఆ కథనం తెలిపింది. ‘ఈ రెండు ప్రతిపాదనలపై మేం లెక్కలు వేస్తున్నాం. బడ్జెట్‌ అనుమతిస్తే ఈ రెండూ ప్రవేశపెట్టే అవకాశం ఉంది’ అని ప్రభుత్వంలోని ఒకరు చెప్పినట్టు పేర్కొంది. జీడీపీ వృద్ధి మందగించిన ప్రస్తుత తరుణంలో తాజా ప్రతిపాదనలు పట్టణాల్లోని పన్ను చెల్లింపుదారులకు చేతినిండా డబ్బు ఉండేలా, తద్వారా వారు టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితరాల కొనుగోలుకు మరింత వ్యయం చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.


2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి గత ఏడు త్రైమాసికాల కనిష్ఠ స్థాయికి(5.4%) పడిపోయింది. దీంతో వేతన జీవులకు ఆదాయ పన్నుల్లో ఉపశమనం కలిగించేందుకు రెవెన్యూ నష్టాలను రూ.50 వేల కోట్ల నుంచి రూ.1లక్ష కోట్ల వరకు భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కథనం తెలిపింది. కొత్తగా 25% పన్నుశ్లాబ్‌ తీసుకురావడం పట్టణ పన్ను చెల్లింపుదారులు మరింత వ్యయం చేసేలా దోహదపడుతుందని, ఇది అంతిమంగా ప్రభుత్వానికే మేలు చేస్తుందని సీబీడీటీ(ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు) మాజీ సభ్యుడు అఖిలేశ్‌ రంజన్‌ పేర్కొన్నారు. తాజా బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయనున్నట్టు ఎక్కువమంది నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, పాత పన్ను విధానాన్ని తొలగించబోరని అంకిత్‌ జైన్‌ అనే నిపుణుడు తెలిపారు.

Updated Date - Jan 24 , 2025 | 04:24 AM