Bihar BJP Minister Blanket Distribution: 40 డిగ్రీల వేడిలో దుప్పట్ల పంపిణీ.. బీహార్ మంత్రి చర్య చర్చనీయాంశం
ABN , Publish Date - Apr 08 , 2025 | 10:39 PM
భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బీహార్ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మెహతా చేపట్టిన దుప్పట్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బీహార్ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మెహతా చేపట్టిన దుప్పట్ల పంపిణీ చర్చనీయాంశంగా మారింది. ఎండాకాలంలో అదీ 40 డిగ్రీల వేడిలో బేగుసరాయ్ ప్రాంతంలోని అహియాపూర్ గ్రామంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మొత్తం 700 మంది హాజరయ్యారు.
అయితే, గౌరవ సూచకంగా అంగవస్త్రాన్ని పంపిణీ చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తాలూకు ఫొటోలు కూడా ఫేస్‌బుక్‌లో దర్శనమిచ్చాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ పేదల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో జనాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పేదలకు సహాయం చేయాలనుకుంటే ఈ దుప్పట్ల పంపిణీ చలికాలంలో చేపట్టి ఉంటే బాగుండేదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.
ఇక త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నితీశ్ సారథ్యంలోని జేడీయూతో కలిసి బరిలోకి దిగుతున్న బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ముందుకెళుతోంది. అయితే, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేని ఓడించాలంటే ప్రతిపక్షాలు ఐకమత్యంగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎవరికి వారు ఎన్నికల్లో పోటీకి దిగితే బీజేపీ ఆయాచిత ప్రయోజనం కలుగుతుందని హెచ్చరించారు. బీహార్ పర్యటనలో భాగంగా సదాకత్ ఆశ్రయంలో పార్టీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో మార్పు కోసం బీహార్‌లో ద్వారాలు తెరుచుకుంటాయి’’ అని ఆయన అన్నారు.
తొలుత రాహుల్ గాంధీ పట్నాలోని ఎస్‌కే మెమోరియల్ హాల్‌లో నిర్వహించిన సంవిధాన్ సురక్షా సమ్మేళన్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, బేగుసరాయిలో ప్రజలకు ఉద్యోగాలు డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఆ తరువాత సదాకత్ ఆశ్రమంలో పార్టీ ఆఫీస్ బేరర్స్‌తో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ వెళ్లిన తరువాత ఓ వ్యక్తి వక్ఫ్ బిల్లుకు మద్దతుగా పాంప్లెట్‌లతో సంచరించడం కలకలానికి దారితీసింది. అయితే, అతడికి అక్కడున్న వారు పార్టీ కార్యాలయం నుంచి పంపించేశారు.
ఇవి కూడా చదవండి:
టీఎంసీ ఎంపీల మధ్య విభేదాలు.. మహువా మొయిత్రాకి మమత వార్నింగ్
వక్ఫ్ చట్టం అమలులోకి.. నెక్ట్స్ జరగబోయేది ఇదే
ఆ టీచర్లకు న్యాయం చేయండి.. రాష్ట్రపతి జోక్యం కోరుతూ రాహుల్ లేఖ