Share News

BJP-AIADMK alliance: ఏపీలోవలే.. తమిళనాట బీజేపీ-అన్నాడీఎంకే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా?

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:09 PM

ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం తర్వాత తమిళనాట కూడా భారీ ఆశలు పెట్టుకుంటోంది బీజేపీ. అందుకోసమే ఎన్నికలకు ఏడాది ముందే అన్నాడీఎంకేతో పొత్తు ప్రకటించింది. జనసేనాని ప్రచారం కూడా తమిళనాట ఎంతోకొంత లాభిస్తుందని ఆశిస్తోంది.

BJP-AIADMK alliance: ఏపీలోవలే.. తమిళనాట బీజేపీ-అన్నాడీఎంకే కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా?

BJP-AIADMK alliance: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఏడాది ముందుగా అన్నాడీఎంకే - బీజేపీ చేతులు కలిపాయి. ఈ మేరకు బీజేపీ కీలకనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా - ఏఐఏడీఎంకే నేతలు ఉమ్మడి ప్రకటన చేశారు. నిన్న (శుక్రవారం) అమిత్ షా.. తమ పార్టీ, AIADMK 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని తేల్చి చెప్పారు. AIADMK చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి (EPS) తమిళనాడు కూటమికి నాయకత్వం వహిస్తారన్నారు. అటు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు BJPతో కలిసి బరిలోకి దిగేందుకు AIADMK కూడా ఉత్సాహంగా ఉంది.

ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, పురుచ్చితలైవి, అమ్మ.. జయలలిత చనిపోయిన తర్వాత AIADMK తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. మరో వైపు BJP ఇప్పటికీ తమిళనాడులో తన స్థానాన్ని పదిల పరచుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల కూటమి వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికల్లో అధికారాన్ని కైవశం చేసుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, జయలలిత మరణం తర్వాత AIADMK లో EPS, అప్పటి పార్టీ చీఫ్ ఓ పన్నీర్ ‌సెల్వం మధ్య అంతర్గత వైరం ఉండేది. ఇప్పుడు దాని ప్రభావం తగ్గిపోయింది.

తమిళనాడులో ఇప్పుడు పొత్తుల రాజకీయాల ప్రాధాన్యం పెరిగింది. ఇటీవలి 2024 లోక్‌సభ ఎన్నికల్లో AIADMK, BJPలు ఎవరికివారు ఒంటరిగా పోటీచేశాయి. ఫలితాలు ఇరు పార్టీల్నీ తీవ్రంగా నిరుత్సాహ పరిచాయి. దీంతో 2026 ఎన్నికల కోసం ఇరు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ పొత్తు యొక్క ప్రధాన ఉద్దేశ్యం తమిళనాడులోని అధికార DMK వ్యతిరేక ఓట్లను ఏకం చేయడం, ఐక్య ప్రతిపక్షాన్ని ప్రదర్శించడం లక్ష్యంగా ఈ పొత్తు సాగింది. అయితే, ఓట్ల బదిలీ వల్ల AIADMK.. బిజెపి కంటే ఎక్కువ లాభపడుతుందని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. BJPకి చాలా తక్కువ సీట్లు వస్తాయని, అయితే, BJP ఓట్లు, DMK వ్యతిరేక ఓట్లు AIADMK కి బదిలీ కావచ్చుని అంటున్నారు. మరోవైపు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాట కూటమి తరపున ప్రచారం చేస్తే మరింత మేలు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, ఎఐఎడిఎంకె తమ సొంత చిన్న పార్టీల పొత్తులతో విడివిడిగా పోటీ చేశాయి. ఫలితంగా 39 నియోజకవర్గాలలో కనీసం 13 చోట్ల ఓట్లు చీలి ఇరు పార్టీలకు నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు ఈ పొత్తు చాలా అవసరమని అంటున్నారు. అంతేకాదు, ఓటు బ్యాంకు లెక్కల ప్రకారం ఎఐఎడిఎంకె - బిజెపి కూటమి పొత్తు వల్ల కచ్చితంగా లాభం కలుగుతుందని అంటున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సంఖ్యలను పరిశీలిస్తే, ప్రతిపక్ష ఎఐఎడిఎంకె - అధికార డిఎంకె మధ్య ఓట్ల వాటాలో కేవలం 5 శాతం తేడా ఉంది. కానీ సీట్ల విషయానికి వస్తే, ఇది చాలా ఎక్కువగా ఉంది. అందుకని బీజేపీ, అన్నాడీఎంకే లకు పొత్తు చాలా ముఖ్యమైనదిగా మారింది.

అంతేకాదు, 2024 ఎన్నికల్లో అనుసరించిన ఆంధ్రప్రదేశ్ నమూనా ఫలించిన వేళ, ఇదే సూత్రం తమిళనాట ఎన్డీయేకు విజయాన్ని చేకూరుస్తుందని బీజేపీ పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకనే తమిళనాడులో కూడా ఇదే టెంప్లేట్ తో ముందుకు సాగబోతోంది బీజేపీ. అటు, మహారాష్ట్ర మాదిరే జనసేనాని పవన్ కళ్యాణ్ ను కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకోబోతోంది బీజేపీ. ఇది బీజేపీ-అన్నాడీఎంకే కూటమికి లాభిస్తుందని కూడా భావిస్తోంది.


ఇవి కూడా చదవండి:

MS Dhoni IPL 2025: వరుసగా 5 ఓటములు.. తప్పు ధోనీది కాదు.. వాళ్లదే

కాల్పులతో దద్దరిల్లిన బీజాపూర్.. మావోల హతం

Updated Date - Apr 12 , 2025 | 05:09 PM