Congress Party: కాంగ్రెస్ దిద్దుబాట
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:36 AM
క్షీణిస్తున్న స్థితి నుంచి పార్టీని గట్టెక్కించేందుకు కాంగ్రెస్ సంస్థాగతంగా మార్పులు చేపట్టనుంది. జిల్లా అధ్యక్షులకు అధిక బాధ్యతలు, పాదయాత్రల ద్వారా బూత్ స్థాయి వరకు కార్యకలాపాలు జరపనున్నారు.

క్షేత్రస్థాయి నుంచీ పార్టీ ప్రక్షాళనపై దృష్టి
ఎదురుదెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు
ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్: సీడబ్ల్యూసీ
‘మతవాదం, హింసతో దేశం విద్వేష అగాధంలోకి
కూరుకుపోతోంది’.. అని పేర్కొంటూ తీర్మానం
సర్దార్ పటేల్ అసలైన వారసత్వం కాంగ్రెస్ పార్టీదే: ఖర్గే
అహ్మదాబాద్‌లోని వల్లభ్ భాయ్ మెమోరియల్‌లో భేటీ
నేడు 1,700 మంది ప్రతినిధులతో ప్రధాన సదస్సు
పేదల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం.. క్షమించలేని నేరం
‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్యాగ్ చేస్తూ సీఎం ట్వీట్
అహ్మదాబాద్, ఏప్రిల్ 8: నానాటికీ కొడిగట్టుకుపోతున్న వైభవాన్ని పునరుద్ధరించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దిద్దుబాట పట్టింది. ఇటీవలి కాలంలో వరుస ఎదురుదెబ్బలతో బలహీనపడిన పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీలో భారీ స్థాయిలో సంస్థాగత మార్పులు చేపట్టనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. మంగళవారం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ మెమోరియల్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
(సీడబ్ల్యూసీ) విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘‘పార్టీకి పునర్వైభవం తేవడంపై సీడబ్ల్యూసీ భేటీలో సుదీర్ఘంగా చర్చించాం.
ఈ ఏడాది మొత్తం పార్టీ పునర్నిర్మాణానికి కేటాయించాలని నిర్ణయించాం. భారీ స్థాయిలో పార్టీ పునర్వ్యవస్థీకరణ చేపడతాం. దీనికి సంబంధించిన ప్రణాళిక, మార్గదర్శకాల రూపకల్పనలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు నిమగ్నమయ్యారు..’’ అని తెలిపారు.
జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యత..
పార్టీలో జిల్లా (డీసీసీ) అధ్యక్షులకు ప్రాధాన్యత కల్పించనున్నట్టు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. జిల్లా అధ్యక్షులకు పార్టీలో మరిన్ని అధికారాలు, బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నామని, త్వరలోనే అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇక సర్దార్ పటేల్ చూపిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని, ఈ మేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేశామని కేసీ వివరించారు. ‘‘పటేల్ బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలిచారు. రైతులు, కార్మికుల హక్కుల కోసం పోరాడారు. గాంధీ హత్య అనంతరం మతవాద శక్తులను వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడం కోసం పటేల్ చూపిన మార్గాన్ని కాంగ్రెస్ అనుసరిస్తుంది.’’ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బలంగా తలపడేలా పార్టీని బలోపేతం చేస్తామని, ఆ దిశగా పార్టీ జిల్లా విభాగాలు, అధ్యక్షులకు అధికారాలు, బాధ్యతలు అప్పగిస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ చెప్పారు. పోలింగ్ బూత్ స్థాయి వరకు చేరేలా విస్తృతంగా పాదయాత్రలు, ఇతర కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
సీడబ్ల్యూసీ సమావేశాల చివరి రోజు బుధవారం ‘న్యాయ్ పథ్’ పేరుతో తీర్మానం చేయనున్నామని, ఇది చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు.
పటేల్ అసలైన వారసత్వం కాంగ్రె్‌సదే: ఖర్గే
దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ కుట్రలకు పాల్పడుతున్నాయని.. వారి గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఏమాత్రం భాగస్వామ్యం లేని సంఘ్ పరివార్ నేతలు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడం కోసం మతపరమైన విభజనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఖర్గే మాట్లాడారు. పటేల్, నెహ్రూ ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాల్లాంటి వారని, వారి మధ్య ఎంతో అనుబంధం ఉన్నా, విభేదాలు ఉండేవంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పటేల్ భావజాలానికి ఆర్‌ఎ్‌సఎస్ సిద్ధాంతాలు పూర్తి విరుద్ధమని, ఆర్‌ఎ్‌సఎ్‌సను ఆయన నిషేధించారని ఖర్గే గుర్తుచేశారు. అలాంటి సంఘ్ పరివార్ నేతలు తాము పటేల్ వారసులమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31న పటేల్ 150వ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
‘విద్వేష అగాధంలోకి దేశం’
మతవాదం, హింసతో దేశం విద్వేష అగాధంలోకి కూరుకుపోతోందంటూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. ‘‘మతపరమైన ఉన్మాదంపై పోరాడేందుకు సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరిస్తాం. మన స్వాతంత్య్ర ఉద్యమం మీద, గాంధీ-నెహ్రూ-పటేల్‌ల నాయకత్వం మీద దాడి జరుగుతోంది. విద్వేష శక్తులను ఓడించేందుకు, వారి అబద్ధాలను బయటపెట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది’’ అని తీర్మానంలో పేర్కొంది. అహ్మదాబాద్‌లో ‘న్యాయ్‌పథ్: సంకల్ప్, సమర్పణ్, సంఘర్ష్’ పేరిట నిర్వహిస్తున్న సీడబ్ల్యూసీ సమావేశాలు బుధవారం ముగియనున్నాయి. చివరి రోజు ప్రధాన సదస్సులో 1,700 మందికిపైగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఏఐసీసీ సభ్యులు పాల్గొననున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు