Bihar Cop: దొంగను కాపాడ్డానికి పోలీసును చంపిన గ్రామస్తులు

ABN, Publish Date - Mar 14 , 2025 | 04:43 PM

ఓ దొంగను కాపాడ్డానికి గ్రామస్తులు దారుణానికి ఒడిగట్టారు. పోలీసులపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా వారిని చితక్కొట్టారు. గ్రామస్తుల దాడిలో ఓ పోలీసు అధికారి చనిపోయాడు.

Bihar Cop: దొంగను కాపాడ్డానికి పోలీసును చంపిన గ్రామస్తులు
Bihar Cop

ఒకప్పుడు పోలీసులంటే జనం భయపడి చచ్చేవారు. వారి దగ్గరకు వెళ్లాలంటే జడుసుకునే వారు. ఊర్లోకి పోలీసులు వస్తే ఒణికిపోయేవారు. ఇప్పుడు కాలం మారింది. పోలీసులంటే భయం పూర్తిగా పోయింది. జనం దెబ్బకు దెబ్బ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సాధారణ పౌరులు పోలీసులపై తిరగబడి దాడులు చేసిన సంఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. పోలీసులు తప్పుగా ప్రవర్తించినపుడు తిరగబడ్డంలో న్యాయం ఉండొచ్చు. కానీ, ఎలాంటి తప్పు చేయకపోయినా.. విధి నిర్వహణలో ఉన్న వారిని చంపటం ఎంత వరకు సమంజసం. బీహార్‌లో సభ్య సమాజం తలదించుకునే ఓ సంఘటన జరిగింది. దొంగను కాపాడ్డానికి గ్రామస్తులు పోలీసులపై దాడికి దిగారు. వారిని చావ చితక్కొట్టారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు విడిచాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


పెళ్లి పందిరిలో పోలీసులపై దాడి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని ముంగర్ జిల్లాకు చెందిన రాజీవ్ రంజన్ మాల్ ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుధవారం పేరు మోసిన క్రిమినల్‌ అన్మోల్ యాదవ్‌ను పట్టుకోవడానికి ఫుల్‌కాహా జిల్లాకు వెళ్లాడు. రాజీవ్‌తో పాటు మరికొంత మంది పోలీసులు కూడా వెళ్లారు. ఫుల్‌కాహా జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో జరుగుతున్న పెళ్లిలో అన్మోల్ ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. వారు పెళ్లి జరుగుతున్న చోటుకు వెళ్లారు. అన్మోల్‌ను అరెస్ట్ చేశారు. అతడ్ని స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, గ్రామస్తులు అన్మోల్‌ను అక్కడినుంచి తీసుకెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతోటే గొడవకు దిగారు. వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే అన్మోల్ అక్కడినుంచి పారిపోయాడు.


గ్రామస్తుల దాడిలో రాజీవ్ రంజన్ తీవ్రంగా గాయపడ్డాడు. అయన్ని హుటాహుటిన అరారియా జిల్లాలోని సదర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాజీవ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తేల్చారు. రాజీవ్ మరణ వార్త తెలిసి ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. జిల్లా ఎస్పీ ఈ సంఘటనపై స్పందించారు. రాజీవ్ మరణానికి సరైన కారణం ఏంటో పోస్టు మార్టమ్ రిపోర్టులో తెలుస్తుందని అన్నారు. ఇక, రాజీవ్ మరణానికి కారణం అయిన అన్మోల్ అనుచరులు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం అన్వేషిస్తున్నారు. గ్రామస్తులు పోలీసుపై దాడి చేసి చంపేసిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలాంటి సంఘటనలు మరో సారి పునరావృతం కాకుండా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు..


ఈ వార్తలు కూడా చదవండి:

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ఎండిన పంట.. రైతు గుండె మంట

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..

Read Latest Telangana News and National News

Updated Date - Mar 14 , 2025 | 04:44 PM