CPM General Secretary: సీపీఎం కొత్త సారథి ఎంఏ బేబీ

ABN, Publish Date - Apr 07 , 2025 | 03:51 AM

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, మైనార్టీ సామాజికవర్గానికి చెందిన తొలి నేతగా ఇది చరిత్రలో నిలిచింది. విద్యా మంత్రిగా పనిచేసినప్పుడు సంస్కరణలు తెచ్చిన ఆయన, బీజేపీని ఎదుర్కోవడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

CPM General Secretary: సీపీఎం కొత్త సారథి ఎంఏ బేబీ

మదురైలో జరిగిన పార్టీ మహాసభలో

జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక

తొలిసారిగా మైనారిటీ నేతకు పగ్గాలు

సంఘ్‌ను ఎదుర్కోవడమే లక్ష్యమన్న బేబీ

పొలిట్‌ బ్యూరోలో బీవీ రాఘవులు,

అరుణ్‌కుమార్‌లకు చోటు

ప్రకాశ్‌ కరత్‌, బృందా కరత్‌కు ఉద్వాసన

సీసీలో మరో 9 మంది తెలుగువారు

చెన్నై, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కేరళకు చెందిన సీనియర్‌ నేత మరియం అలెగ్జాండర్‌ బేబీ (ఎంఏ బేబీ) సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్‌ సమావేశంలో ప్రధాన కార్యదర్శితోపాటు 84 మంది సభ్యుల కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీనితో మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ తాత్కాలిక కోఆర్డినేటర్‌గా ఆ బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. క్రిస్టియన్‌ అయిన ఎంఏ బేబీ సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి మైనార్టీ నేత కావడం విశేషం. వామపక్ష రాజకీయాలకు కేంద్రమైన కేరళ నుంచి ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ తర్వాత ఈ పదవికి ఎన్నికైన రెండో నేత ఎంఏ బేబీ. ఎంఏ బేబీ 1954లో కేరళలోని ప్రాక్కులంలో జన్మించారు. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేశారు. అప్పుడే ఆయన ఎస్‌ఎ్‌ఫఐకి పూర్వరూపమైన కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌లో చేరి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కొల్లాంలోని ఎస్‌ఎన్‌ కాలేజీలో డిగ్రీలో చేరినా పూర్తి చేయలేదు. తర్వాత ఎస్‌ఎ్‌ఫఐకి, సీపీఎం యూత్‌ విభాగం ‘డెమొక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీవైఎ్‌ఫఐ)‘కి అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో కొంతకాలం జైలు జీవితం అనుభవించారు. 1986లో కేవలం 32 ఏళ్ల వయసులోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా నియామితులయ్యారు. 2006, 2011లో కేరళలోని కుందర ఎమ్మెల్యేగా గెలిచారు.

2006 నుంచి 2011 వరకు రాష్ట్ర విద్యా మంత్రిగా పనిచేశారు. 71 ఏళ్ల ఎంఏ బేబీకి కరుడుగట్టిన నాస్తికుడిగా పేరుంది. కేరళ విద్యా మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన తెచ్చిన పలు సంస్కరణలు, నాస్తికత్వాన్ని బోధించే పాఠ్యాంశాలను స్కూల్‌ సిలబ స్‌లో ప్రవేశపెట్టడం వంటివి వివాదాస్పదం అయ్యాయి. కాగా, బలహీనంగా ఉన్న చోట సీపీఎంను బలోపేతం చేయడం, బీజేపీ ఆధ్వర్యంలోని సంఘ్‌ పరివార్‌ను ఎదుర్కోవడమే తన ముందున్న ప్రధాన లక్ష్యాలని ఎంఏ బేబీ తెలిపారు. పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నట్టు తెలిపారు.


సీనియర్లకు ఉద్వాసన!

మదురైలో 3రోజులుగా జరుగుతున్న సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్‌ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శితోపాటు కొత్తగా కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులను ఎన్నుకున్నారు. పార్టీలో అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్‌ బ్యూరోలోకి కొత్తగా ఎనిమిది మందికి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో సీనియర్లు ప్రకాశ్‌ కరత్‌, బృందా కరత్‌, మాణిక్‌ సర్కార్‌ తదితర సీనియర్లకు పొలిట్‌ బ్యూరో నుంచి ఉద్వాసన పలికి.. కేంద్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశమిచ్చారు. మొత్తంగా కేంద్ర కమిటీలో 20ు మంది మహిళలు ఉన్నారని సీపీఎం ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మందికి చాన్స్‌

తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు, ఆర్‌.అరుణ్‌కుమార్‌లకు పొలిట్‌ బ్యూరోలో.. తెలంగాణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శులు జాన్‌ వెస్లీ, వి.శ్రీనివాసరావులతోపాటు తమ్మినేని వీరభద్రం, ఎస్‌.వీరయ్య, జ్యోతి, పుణ్యవతి, సాయిబాబు, రమాదేవి, లోకనాథంలకు కేంద్ర కమిటీలో చోటు దక్కింది. ఇందులో ఆర్‌.అరుణ్‌కుమార్‌తోపాటు పుణ్యవతి, సాయిబాబులకు ఢిల్లీ కోటాలో కేంద్ర కమిటీలో చోటు కల్పించినట్టు సమాచారం. వీరిలో రాఘవులు, శ్రీనివాసరావు, వీరభద్రం, పుణ్యవతి ఇప్పటటికే కేంద్ర కమిటీలో ఉండగా.. మిగతావారికి కొత్తగా చోటు కల్పించారు.


ఇవి కూడా చదవండి:

'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం

జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి

Read Latest and International News

Updated Date - Apr 07 , 2025 | 03:58 AM