Share News

Cancer in India: దేశానికి క్యాన్సర్‌ సవాల్‌

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:11 AM

భారతదేశానికి 2025లో క్యాన్సర్‌ ముఖ్యమైన ప్రజారోగ్య సవాల్‌గా మారనుందని.. దేశవ్యాప్తంగా 15 లక్షల కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

Cancer in India: దేశానికి క్యాన్సర్‌ సవాల్‌

2025లో 15 లక్షల కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం

రేపు ప్రపంచ క్యాన్సర్‌ దినం

ముందే గుర్తిస్తే చాలా కేసులు నయం చేయదగ్గవే

కేంద్రం బడ్జెట్‌ నిర్ణయాలు ప్రశంసనీయం

ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు

భారతదేశానికి 2025లో క్యాన్సర్‌ ముఖ్యమైన ప్రజారోగ్య సవాల్‌గా మారనుందని.. దేశవ్యాప్తంగా 15 లక్షల కొత్త కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మహమ్మారిని నోటిఫయబుల్‌ డిసీజ్‌గా గుర్తించి.. దాని కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. మంగళవారం (ఫిబ్రవరి 4) ‘ప్రపంచ క్యాన్సర్‌ దినం’ సందర్భంగా.. దాని నియంత్రణ, నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన పలుసూచనలు చేశారు. దేశంలో నమోదవుతున్న క్యాన్సర్‌ మరణాల్లో మూడింట రెండువంతులు.. పొగాకు, మద్యం, ఇన్ఫెక్షన్ల కారణంగా సంభవించేవేనని, ఈ క్యాన్సర్లన్నీ నిరోధించదగ్గవి, తొలి దశలో గుర్తించి, సత్వర చికిత్సతో నయంచేయదగ్గవేనని ఆయన స్పష్టం చేశారు. ‘‘క్యాన్సర్‌పై పోరులో అందరూ కలిసిరావాలి’’ అంటూ విధాన నిర్ణేతలు, వైద్య నిపుణులు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. క్యాన్సర్‌ రోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. బాధితులకు సత్వర వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర బడ్జెట్‌లో మోదీ సర్కారు కీలక నిర్ణయాలను ప్రకటించడంపై ప్రశంసలజల్లు కురిపించారు. క్యాన్సర్‌ బాధితుల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడం, 36 ప్రాణాధార ఔషధాలకు కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు, మూడు ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీ తగ్గింపు. మూడేళ్లలో జిల్లాకో క్యాన్సర్‌ డే కేర్‌ కేంద్రం ఏర్పాటు వంటి నిర్ణయాలను..


ఆ వ్యాధిని తొలిదశలోనే గుర్తించి, బాధితులకు అత్యున్నతస్థాయి వైద్యాన్ని అందుబాటులో ఉంచాల్సిన కీలక అవసరాన్ని కేంద్రం నొక్కిచెప్పిన తీరును కొనియాడారు. క్యాన్సర్‌ను జయించినవారి సంఖ్య (సర్వైవల్‌ రేటు) పెరగాలంటే.. దాన్ని సకాలంలో గుర్తించడమే ముఖ్యమని ఆయన తేల్చిచెప్పారు. ‘‘తొలి దశలోనే గుర్తించగలిగితే గనక.. చాలా క్యాన్సర్లకు ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ముందు మనం ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసుకోవాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. అన్ని సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన వ్యక్తులకూ క్యాన్సర్‌ గుర్తింపు, చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు. భారత వైద్య పరిశోధన మండలి తదితర సంస్థల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మన దేశంలో నిత్యం 200 మంది సర్విక్స్‌ క్యాన్సర్‌తో చనిపోతున్నారని.. అన్ని రకాల క్యాన్స ర్‌ బాధితులనూ పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 1600 మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. కొవిడ్‌ మహమ్మారిపై మన దేశం చేసిన పోరాటం నుంచి నేర్చుకున్న విలువైన పాఠాలు క్యాన్సర్‌పై పోరులో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

- సెంట్రల్‌ డెస్క్‌


అలా గుర్తించాలి..

అమెరికాలోలాగానే భారతదేశంలోనూ క్యాన్సర్‌ను ‘నోటిఫయబుల్‌ డిసీజ్‌’గా గుర్తించాలని డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు సూచించారు (అలా గుర్తిస్తే.. తమ వద్దకు వచ్చేవారిలో ఎవరైనా క్యాన్సర్‌ బారిన పడినట్టు వైద్యపరీక్షల ద్వారా తేలితే వైద్యులు వెంటనే ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది). దానివల్ల ఒక ప్రాంతంలో ఎంతమంది క్యాన్సర్‌ బాధితులున్నారు? ఏయే రకాల క్యాన్సర్లు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నదీ? తదితర వివరాలతో కూడిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని, కేసుల సంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాల్లో వనరుల కేటాయింపు చేయవచ్చని ఆయన చెప్పారు. కానీ, ప్రస్తుతం మన దేశంలో నాలుగు రాష్ట్రాలు మాత్రమే క్యాన్సర్‌ను నోటిఫయబుల్‌ డిసీజ్‌గా గుర్తించాయని గుర్తుచేశారు. ‘‘ప్రస్తుతం భారత జనాభాలోని 10ు మందిని మాత్రమే ‘జనాభా ఆధారిత క్యాన్సర్‌ రిజిస్ట్రీ (పీబీసీఆర్‌)’లు కవర్‌ చేస్తున్నాయి. అలా గే.. ‘నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ (ఎన్సీపీఆర్‌)’ 17ు మందిని మాత్రమే కవర్‌ చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో క్యాన్సర్‌ను నోటిఫయబుల్‌ వ్యాధిగా గుర్తిస్తే విధానపరమైన నిర్ణయాలను వేగంగా తీసుకునే వీలుంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Sonia Gandhi: సోనియా గాంధీపై కోర్టులో ఫిర్యాదు చేసిన న్యాయవాది.. ఎందుకంటే..

Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు భక్తజనం.. ఫిబ్రవరి 1 నాటికి ఎంత మంది వచ్చారంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 05:11 AM