Share News

Ayodhya Ram Temple: అయోధ్యరాముడికి వచ్చే నెలలో పట్టాభిషేకం

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:04 AM

అయోధ్య రామాలయంలో వచ్చే నెల శ్రీరాముని పట్టాభిషేకం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రామదర్బార్‌ విగ్రహాల్ని ప్రసిద్ధి శిల్పులు పాండే కుటుంబం రూపొందిస్తోంది.

Ayodhya Ram Temple: అయోధ్యరాముడికి వచ్చే నెలలో పట్టాభిషేకం

ఈ నెలాఖరుకల్లా రామదర్బార్‌ సిద్ధం

జైపూర్‌లో రూపుదిద్దుకుంటున్న రాజసభ

అయోధ్య, ఏప్రిల్‌ 8: అయోధ్య రామాలయంలో గత ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, సాధువులు, కళాకారులు, పారిశ్రామికవేత్తలు సహా 8 వేల మంది ప్రముఖులు తరలిరాగా.. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఇప్పుడు మరో కీలక ఘట్టం అక్కడ ఆవిష్కృతం కానుంది. అయోధ్యాధీశుడిగా శ్రీరాముడి పట్టాభిషేకాన్ని వచ్చే నెలలో నిర్వహించేందుకు సకల సన్నాహాలూ జరుగుతున్నాయి. దానికి ముందుగా ఈ నెలాఖరులోగా ఆలయ మొదటి అంతస్తులో రామదర్బార్‌ లేదా రాజసభను నెలకొల్పనున్నారు. అయితే పట్టాభిషేకాన్ని ప్రాణప్రతిష్ఠ తరహాలో పటాటోపంగా నిర్వహించడం లేదు. పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించనున్నారు. ప్రధాని మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా సారథ్యంలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పర్యవేక్షణలో ఆలయ నిర్మాణం చకచకా పూర్తవుతోంది. ఆలయ సముదాయం ఈ నెలాఖరుకల్లా సిద్ధమవుతుందని మిశ్రా ఇటీవల స్వయంగా చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి ఆలయ ప్రాకారం పూర్తవుతుందన్నారు. ప్రాకారం లోపల, వెలుపల నిర్మించిన ఆలయాల్లో ప్రతిష్ఠించాల్సిన విగ్రహాలు ఈనెల 30నాటికి వచ్చేస్తాయన్నారు.


బాలరాముడి విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ రూపొందించిన సంగతి తెలిసిందే. రామదర్బార్‌ను ప్రముఖ శిల్పి ప్రశాంత్‌ పాండే నేతృత్వంలోని 20 మంది హస్త కళాకారులు జైపూర్‌లో తీర్చిదిద్దుతున్నారు. ఈయన తండ్రి సత్యనారాయణ పాండే పర్యవేక్షిస్తున్నారు. ఆ కుటుంబంలో నాలుగు తరాలుగా అందరూ శిల్పప్రావీణ్యం కలిగినవారే కావడం విశేషం. రామదర్బార్‌లో సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయుడి విగ్రహాలు (తెల్ల మార్బుల్‌) కూడా ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో నెలకొల్పే సూర్యదేవుడు, విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, దుర్గాదేవి, అన్నపూర్ణాదేవి విగ్రహాలు, సప్తర్షి ఆలయంలో ప్రతిష్ఠించే సప్తర్షుల విగ్రహాలను కూడా పాండే రూపుదిద్దుతున్నారు. ‘ఇది ప్రస్తుతం తుది ప్రక్రియలో ఉంది. పూర్తికాగానే అయోధ్య రామాలయానికి తరలిస్తాం’ అని పాండే చెప్పారు. కాగా.. ‘రామచరిత మానస్‌’ రాసిన సంత్‌ తులసీదాస్‌ విగ్రహాన్ని కూడా ఆలయ ప్రాంగణంలోనే నెలకొల్పుతున్నారు. మరోవైపు, రామాలయానికి 4కిలోమీటర్ల దూరాన ప్రధాన అంతర్జాతీయ రామకథ మ్యూజియంను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో శ్రీరామ జననం, రామాయణ ఇతర ఘట్టాలను కళ్లకుగట్టే హోలోగ్రాం, రామాలయ నిర్మాణానికి శతాబ్దాలుగా సాగిన ఉద్యమం తాలూకు డాక్యుమెంటరీ.. పురావస్తు శాఖ తవ్వకాల్లో వెలుగుచూసిన ప్రాచీన కళాఖండాలు, శిల్పాలను ప్రదర్శిస్తారు.

Updated Date - Apr 09 , 2025 | 03:04 AM