Chief Election Commissioner: కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌

ABN, Publish Date - Feb 18 , 2025 | 05:04 AM

ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం మంగళవారం ముగియనున్న నేపథ్యంలో.. తదుపరి సీఈసీని ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సోమవారం భేటీ అయింది.

Chief Election Commissioner: కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్‌

ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ, అమిత్‌షాతోకూడిన ఉన్నతస్థాయి కమిటీ ఎంపిక.. రాష్ట్రపతికి సిఫారసు

నూతన చట్టం ప్రకారం తొలి సీఈసీ నియామకమిదే

ఆ చట్టంపై సుప్రీం తీర్పు వచ్చేదాకా ప్రక్రియను నిలిపివేయాలన్న కాంగ్రెస్‌

ఈ భేటీనే జరిపి ఉండకూడదన్న రాహుల్‌

జ్ఞానేశ్‌ స్థానంలో ఈసీగా వివేక్‌ జోషి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జ్ఞానేశ్‌కుమార్‌.. భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా.. ప్రస్తుతం హరియాణా సీఎ్‌సగా విధులు నిర్వర్తిస్తున్న వివేక్‌ జోషి (1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి) నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం మంగళవారం ముగియనున్న నేపథ్యంలో.. తదుపరి సీఈసీని ఎంపిక చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సోమవారం భేటీ అయింది. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ నేతృత్వంలోని సెర్చ్‌కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్‌కుమార్‌ను సీఈసీగా వారు ఎంపిక చేసి తమ నిర్ణయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫారసు చేసినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది.


కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన జ్ఞానేశ్‌కుమార్‌ (61) గతంలో పలు కీలక శాఖల్లో సేవలందించారు. ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసే బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. అయోధ్యలో రామమందిరం కేసుకు సంబంధించిన పత్రాల వ్యవహారాన్ని.. హోం శాఖలో అదనపు కార్యదర్శిగా ఆయనే పర్యవేక్షించారు.

‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌’ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, కేంద్ర సహకార శాఖల కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది జనవరిలో ఆయన రిటైర్‌ అయ్యారు. సీఈసీ పదవిలో 2029 జనవరి 26 దాకా ఆయన కొనసాగనున్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి.. ‘చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అండ్‌ అదర్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అప్పాయింట్‌మెంట్‌ కండిషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టర్మ్‌ ఆఫ్‌ ఆఫీ్‌స)చట్టం-2023’ పేరుతో రూపొందించిన కొత్త చట్టం ప్రకారం సీఈసీ నియామకం ఇదే మొదటి సారి కావడం విశేషం.


కాంగ్రెస్‌ అభ్యంతరం..

పాత విధానం ప్రకారం.. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యుడిగా ఉండేవారు. అయితే, 2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో.. భారత ప్రధాన న్యాయమూర్తికి బదులు కేంద్ర మంత్రివర్గం నామినేట్‌ చేసే మంత్రికి స్థానం కల్పించింది (దాని ప్రకారమే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గం తరపున కేంద్రమంత్రి అమిత్‌ షా ఉన్నత స్థాయి కమిటీలో సభ్యుడిగా హాజరయ్యారు). దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై తీర్పు వచ్చే దాకా కొత్త చట్టం ప్రకారం నూతన సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాలని కాంగ్రెస్‌ అభ్యంతరం తెలిపింది. ఉన్నతస్థాయి కమిటీ సమావేశానికి హాజరైన రాహుల్‌గాంధీ సైతం.. అసలు ఈ భేటీనే జరిపి ఉండకూడదంటూ తన అసమ్మతిని లిఖిత పూర్వకంగా తెలిపారు. ఆ పిటిషన్లపై సుప్రీంలో బుధవారమే విచారణ జరగనున్న విషయాన్ని కాంగ్రెస్‌ నేతలు గుర్తుచేశారు.


రాజీవ్‌కుమార్‌కు వీడ్కోలు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆయనకు వీడ్కోలు పలికింది. రాజీవ్‌ కుమార్‌ 2020 సెప్టెంబరు 1 న కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా చేరారు. 2022 మే 15న దేశ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కమిషన్‌లో 4.5 సంవత్సరాల పాటు సాగిన ఆయన పదవీ కాలంలో అనేక సంస్కరణలు జరిగాయి. కాగా.. ఎన్నికల ఫలితాలను అంగీకరించలేని పార్టీలు.. ఎన్నికల కమిషన్‌ను బలిపశువును చేస్తున్నాయని వీడ్కోలు కార్యక్రమంలో రాజీవ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా జరిగే ఎన్నికల ప్రక్రియలో ప్రతిదశలోనూ పాల్గొనే అభ్యర్థులు, పార్టీలు.. ఏ దశలోనూ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా, అప్పీళ్లు దాఖలు చేయకుండా.. ఎన్నికలు ముగిశాక మాత్రం ప్రజల్లో ఆ ప్రక్రియపై అనుమానాలు రేకెత్తించే ప్రయత్నాలు చేయడం అవాంఛనీయం అని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Sam Pitroda: చైనా మన శత్రువు కాదు.. శామ్ పిట్రోడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Earthquake: ఢిల్లీలో భూకంపం... ఒక్కసారిగా కంపించిన భూమి

New Delhi : రైళ్ల పేర్లలో గందరగోళం వల్లే!

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 18 , 2025 | 05:04 AM