Indian Navy Rescues Sailor: మానవత్వం అంటే ఇది.. పాక్ సిబ్బందికి ఇండియన్ నేవీ సాయం
ABN, Publish Date - Apr 07 , 2025 | 10:23 AM
సముద్రం మధ్యంలో తీవ్రంగా గాయపడ్డ పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్యం సాయం అందించి.. మానవత్వం చాటుకుంది ఇండియన్ నేవీ బృందం. మూడు గంటల పాటు శ్రమించి.. ఆపరేషన్ చేసి.. ప్రాణాలు కాపాడారు. ఇండియన్ నేవీ చేసిన సాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆ వివరాలు..

పాకిస్తాన్, ఇండియా రెండు దాయాది దేశాల మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయి. భారత్ ఎంత శాంతియుతంగా ఉందామని భావించినా.. పాక్ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెడుతూనే ఉంటుంది. సందు దొరికితే చాలు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితులు యుద్ధ వాతావారణాన్ని గుర్తు చేస్తాయి. అయితే పాక్‌తో భారత్ వైరం.. ఆ దేశ సరిహద్దులు, నేతలతో ముడిపడి ఉంటుంది తప్ప పాక్ ప్రజలతో కాదు. ప్రజల విషయానికి వస్తే.. విబేధాలు మర్చిపోయి.. మరి వారిని అక్కున చేర్చుకుని.. అవసరమైన సాయం అందజేసి ఇండియా గొప్పతనం చాటుకుంటాము. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్య సాయం అందించి అతడి ప్రాణాలు నిలబెట్టింది ఇండియన్ నేవీ బృందం. ఆ వివరాలు..
మధ్య అరేబియా సముద్రంలో విధులు నిర్వహిస్తూన్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్య సహాయం అందించడానికి భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రికాండ్ రంగంలోకి దిగింది. నేవీ సిబ్బంది వెల్లడించిన సమాచారం ప్రకారం.. మూడు రోజుల క్రితం అనగా ఏప్రిల్ 4, శుక్రవారం నాడు.. ఈ ఘటన చోటు చేసుకుంది. మిషన్‌లో భాగంగా.. ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇండియన్ నేవీ సిబ్బంది.. ఇరానియన్ ఫిషింగ్ దో నుంచి వచ్చిన సందేశాన్ని అందుకుని.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని.. సాయం అందించింది
సందేశం అందినప్పుడు త్రికాండ్ నౌక ఒమన్ తీరానికి దాదాపు 350 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సందేశం సారాంశం ఏంటంటే.. ఇంజిన్‌పై పనిచేస్తున్నప్పుడు దోలో ఉన్న ఒక పాక్ నావికుడి వేళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని.. వెంటనే వైద్యం కావాలని అభ్యర్థిస్తూ సందేశం పంపారు.. అంతేకాక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. బాధితుడిని.. అప్పటికే ఇరాన్ వైపు వెళ్తున్న మరొక ఇరానియన్ ఫిషింగ్ నౌక ఎఫ్‌వీ అబ్దుల్ రెహ్మాన్ హంజియాకు తరలించారు.
సందేశం విన్న ఐఎన్‌ఎస్ త్రికాండ్ బృందం గాయపడిన సిబ్బందికి వైద్య సహాయం అందించడానికి నిర్ణయించుకుని.. తన మార్గాన్ని మార్చుకుంది. గాయపడిన సిబ్బందిని తరలిస్తున్న ఎఫ్‌వీ అబ్దుల్ రెహమాన్ హంజియా నౌక వద్దకు చేరుకుంది. దానిలో ఉన్న సిబ్బందిలో 11 మంది పాకిస్తానీలు (తొమ్మిది మంది బలూచ్, ఇద్దరు సింధీ)కాగా మరో ఐదుగురు ఇరానియన్ సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో పాకిస్తాన్ క్రూ మెంబర్‌కి అనేక చోట్ల ఫ్రాక్షర్స్ కావడం మాత్రమే కాక.. చేతికి తీవ్ర గాయం అయ్యింది. రక్తస్రావం అయ్యింది.
గాయపడిన పాక్ సిబ్బందికి వైద్యం అందించడం కోసం.. ఐఎన్ఎస్ త్రికాండ్ వైద్య అధికారి, మార్కోస్(మెరైన్ కమాండోలు), ఓడ బోర్డింగ్ సిబ్బంది.. ఇరానీయన్ ఓడలోకి చేరుకున్నారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తికి అనస్థీషియా ఇచ్చి అతడి వేళ్లకు కుట్లు వేశారు. సుమారు మూడు గంటలకు పైగా శస్త్రచికిత్స కొనసాగింది. సకాలంలో స్పందించడం వలన చేతి వేళ్లను తొలగించే ప్రమాదం తప్పిందని వెల్లడించారు. మార్గమధ్యంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమిస్తే.. ఆ సమయంలో వినియోగించాల్సిన యాంటీబయాటిక్స్‌తో పాటు వైద్య సామాగ్రాని అందించారు. ఇక ఇండియన్ నేవీ సిబ్బంది చేసిన సాయానికి.. ఇరానియన్ ఫిషింగ్ నౌకలో ఉన్న మొత్తం సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Bengaluru: కామంతో కళ్లు మూసుకుపోయి.. నడి రోడ్డు మీద
Ram Navami: కోల్‌కతాలో మరో కల్లోలం.. రామ నవమి ర్యాలీపై దాడి..
Updated Date - Apr 07 , 2025 | 10:30 AM