Justice Yashwant Varma: న్యాయ నియామకాలపై ఏంచేద్దాం!

ABN, Publish Date - Mar 26 , 2025 | 04:23 AM

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టల వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. న్యాయ నియామకాల్లో పారదర్శకత కోసం మోదీ ప్రభుత్వం మళ్లీ ఎన్‌జేఏసీ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.

Justice Yashwant Varma: న్యాయ నియామకాలపై ఏంచేద్దాం!

అఖిలపక్ష భేటీలో రాజ్యసభ చైర్మన్‌

ముందు మీ ప్రతిపాదనలు చెప్పండి

ఆ తర్వాతే మేం చెప్తాం: విపక్షాలు

సభలో కాకుండా చాంబర్లో చర్చ జరపడం ఏమిటి: టీఎంసీ

మళ్లీ ఎన్‌జేఏసీపై కేంద్రం దృష్టి?

జస్టిస్‌ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ

30-35 నిమిషాలపాటు నివాస ప్రాంగణంలో పరిశీలన

అలహాబాద్‌ హైకోర్టు లాయర్ల నిరవధిక సమ్మె ప్రారంభం

న్యూఢిల్లీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టల వ్యవహారం నేపథ్యంలో.. రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ మంగళవారం తన చాంబర్‌లో అఖిలపక్ష భేటీ జరిపారు. న్యాయ నియామకాల అంశంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత మాట్లాడిన ధన్‌ఖడ్‌.. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) బిల్లును సుప్రీంకోర్టు 2015లో కొట్టివేయడంపై తన అభిప్రాయాలను మరోమారు ఘాటుగా వ్యక్తపరిచినట్లు సమాచారం. ఎన్‌జేఏసీ బిల్లు కొట్టివేతను అప్పట్నుంచీ ఆయన పలుమార్లు బాహాటంగానే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో సూచించాలని అఖిలపక్ష భేటీకి హాజరైన నేతలను కోరినట్లు తెలిసింది. అయితే, న్యాయనియామకాలపై ప్రభుత్వం తన ప్రతిపాదనలను స్పష్టంగా తెలియజేయాలని.. అప్పుడే తమ వైఖరిని తెలియజేస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి. న్యాయవ్యవస్థలో నియామకాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న విషయంలో తమకు సందేహం లేదని కాంగ్రె్‌సతో సహా పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరి జాతీయ న్యాయనియామకాల కమిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలేమిటో (రోడ్‌ మ్యాప్‌) కూడా చెప్పాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుతానికైతే న్యాయ నియామకాలు పారదర్శకంగా జరగడం లేదని, ఇందుకు ప్రత్యామ్నాయం అవసరమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం లభించడం లేదని, రిజర్వేషన్‌ పద్ధతే లేదని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థపై ప్రభుత్వం ప్రతిపాదనలతో ముందుకు వచ్చినప్పుడే తాము తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలమని ఆయన అన్నారు.


అదే సమయంలో న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత సుఖేందు శేఖర్‌ రాయ్‌ కూడా.. ఎన్‌జేఏసీ వంటి యంత్రాంగంపై ప్రభుత్వ వైఖరి చెప్పినప్పుడే తాము స్పందిస్తామని స్పష్టం చేశారు. ఇక.. న్యాయనియామకాల విషయంపై ఎన్డీఏ సహచరులతో చర్చించి తాము ఒక నిర్ణయానికి వస్తామని సభా పక్ష నేత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా చెప్పారు. ఈలోపు ఆయా పార్టీలు తమ నాయకత్వంతో చర్చించి స్పష్టతకు రావాలని ఆయన సూచించారు. మరోవైపు.. ఎలాంటి ఏకాభిప్రాయమూ లేకుండానే ఈ భేటీ ముగిసిందని శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. బహుశా వచ్చేవారం సభలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. రాజ్యసభ చైర్మన్‌ ఈ అంశంపై ఫ్లోర్‌ లీడర్లతో విడివిడిగా సమావేశమై చర్చిస్తారని తెలిపారు. కాగా.. ఈ అంశంపై సభలో చర్చించాలి తప్ప, చాంబర్‌లో కాదని.. సమస్యలపై చర్చకు ఒక పద్ధతి ఉందని.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు అఖిలపక్ష భేటీలో వ్యాఖ్యానించినట్టు సమాచారం. ‘ఓటర్‌ ఐడీ కార్డులపై చర్చకు ఏఐటీసీ ఒక నోటీసు ఇచ్చింది. అది 10 రోజులుగా జాబితాలో చేరలేదు. మేం చాలా ఓపిక పడుతున్నాం. కానీ, ఈ ప్రభుత్వం పార్లమెంటును అవమానిస్తోంది. ఇలాంటి అంశాలన్నింటినీ సభలో చర్చించాలి తప్ప వేరేచోట కాదు’’ అని ఒక నేత ఘాటుగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

సభలో నోటీసు తిరస్కరణ

అఖిల పక్ష భేటీకి ముందు.. జస్టిస్‌ వర్మ ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టల ఉదంతంపై చర్చకు రాజ్యసభ సభ్యుడు, ఐఏయూఎంఎల్‌ నేత హరీస్‌ బీరన్‌ 267 నిబంధన కింద సభలో ఇచ్చిన నోటీసును జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తిరస్కరించారు. జరిగిన ఉదంతం తనకు ఆందోళన కలిగించిందని.. న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆయన పేర్కొన్నారు. న్యాయనియమకాల విషయంలో ప్రక్షాళనకు రూపొందించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని కోర్టు కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ చరిత్రాత్మక చట్టానికి అసాధారణ రీతిలో ఏకాభిప్రాయం లభించిందని.. అదే అమలులోకి వస్తే పరిస్థితులు వేరేగా ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఒక రాజ్యాంగ సవరణను న్యాయపరంగా సమీక్షించే అధికారం ఎవరికీ లేదని అభిప్రాయపడ్డారు.


విచారణ షురూ..

నోట్లకట్టల వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించిన తిస్రభ్య కమిటీ మంగళవారం ఉదయం జస్టిస్‌ వర్మ నివాసానికి వెళ్లి విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యులు జస్టిస్‌ శీల్‌నాగ్‌, జస్టిస్‌ సంధవాలియా, జస్టిస్‌ అను శివరామన్‌.. అక్కడ 30-35 నిమిషాలపాటు ఉండి జస్టిస్‌ వర్మ ఇంటి ప్రాంగణాన్ని, అక్కడ అగ్నిప్రమాదం జరిగిన స్టోర్‌ రూమ్‌ను నిశితంగా పరిశీలించారు. మధ్యాహ్నం సమయానికి అక్కణ్నుంచీ వెళ్లిపోయారు. ఆ సమయంలో జస్టిస్‌ వర్మ ఇంట్లో ఉన్నారా లేరా అనే విషయం తెలియరాలేదు. మరోవైపు.. జస్టిస్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీం సిఫారసును వ్యతిరేకిస్తూ అలహాబాద్‌ హైకోర్టు న్యాయవాదులు మంగళవారం నిరవధిక సమ్మెకు దిగారు. తమ నిరసన ఏ న్యాయస్థానానికీ, న్యాయమూర్తికీ వ్యతిరేకం కాదని.. న్యాయవ్యవస్థను వంచించినవారికి వ్యతిరేకంగానే తాము సమ్మె చేస్తున్నామని అలహాబాద్‌ హైకోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అనిల్‌ తివారీ తెలిపారు. అవినీతికి పాల్పడ్డవారిపై, పారదర్శకత లేని వ్యవస్థపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘(జస్టిస్‌ వర్మ) బదిలీ ఉత్తర్వును పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలన్నదే మా ప్రధాన డిమాండ్‌’’ అని ఆయన పేర్కొన్నారు.

మరోసారి ఎన్‌జేఏసీపై కేంద్రం దృష్టి?

జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నివాసంలో నోట్ల కట్టలు లభించడం, దీనిపై దేశవ్యాప్తంగా సామాన్యుల్లో సైతం ఆగ్రహం వ్యక్తం కావడం వంటి పరిణామాలను అవకాశంగా తీసుకుని.. మోదీ ప్రభుత్వం జాతీయ న్యాయనియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)పై మరోసారి చట్టం చేసే అవకాశాలున్నాయా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నకు రాజకీయ నిపుణులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష భేటీ అందులో భాగమేనని వారు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏన్‌జేఏసీని తిరస్కరించిన సుప్రీంకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో అలా వ్యతిరేకించే అవకాశాలు లేవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ తాము అలాంటి బిల్లును ప్రవేశపెడితే.. గతంలో లభించిన విధంగానే ఈసారి కూడా దానికి కాంగ్రె్‌సతో సహా అన్ని పక్షాలు ఏకగ్రీవ ఆమోదం లభిస్తుందని మోదీ ప్రభుత్వం విశ్వాసంతో ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వం తన ప్రతిపాదన ఏమిటో స్పష్టంగా చెబితే.. తామూ తమ వైఖరి చెప్తామని ప్రతిపక్షాలు అఖిలపక్ష భేటీలో పేర్కొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu On DSC: మెగా డీఎస్సీపై కీలక అప్డేట్.. వచ్చే నెల మొదటి వారంలోనే

Viveka Case Update: వివేకా హత్య కేసు.. అవినాష్ కుట్రను బయటపెట్టిన ఏపీ సర్కార్

Vallabhaneni Vamsi Remand: మరికొన్ని రోజులు జైల్లోనే వంశీ

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 26 , 2025 | 04:28 AM