Kunal Kamra: శిందేను ద్రోహి అన్న కునాల్‌.. వేదిక కూల్చివేత

ABN, Publish Date - Mar 25 , 2025 | 03:13 AM

సోమవారం ఉదయం BMC సిబ్బంది హ్యాబిటెట్‌ స్టూడియోను అక్రమ నిర్మాణంగా పేర్కొని కూల్చివేశారు, అయితే ఆదిత్య ఠాక్రే కునాల్‌ కామ్రాకు మద్దతుగా నిలిచారు.

Kunal Kamra: శిందేను ద్రోహి అన్న కునాల్‌.. వేదిక కూల్చివేత

కునాల్‌ కామ్రా వ్యాఖ్యలపై మహారాష్ట్ర సర్కారు ప్రతీకారం

న్యూఢిల్లీ, మార్చి 24: స్టాండప్‌ కామెడీ ఆర్టిస్ట్‌ కునాల్‌ కామ్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రస్తుత డిప్యూటీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేను ఆయన ద్రోహిగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్య శివసేన శిందే వర్గం కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. వారంతా యూనికాంటినెంటల్‌ హోటల్‌లో కునాల్‌ కామ్రా కామెడీ షో నిర్వహించిన వేదిక హ్యాబిటెట్‌ స్టూడియో మీద ఆదివారం రాత్రే దాడి చేసి, ధ్వంసం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 12 మందిని అరెస్టు చేశారు. సోమవారం ఉదయమే బృహన్‌ ముంబై కార్పొరేషన్‌కు చెందిన సిబ్బంది వచ్చి హ్యాబిటెట్‌ స్టూడియో అక్రమ నిర్మాణమంటూ కూల్చివేత చేపట్టారు. నిజానికి హోటల్‌ యజమాని సోమవారం ఉదయమే హ్యాబినెట్‌ స్టూడియోను కొన్నాళ్లు మూసేస్తున్నట్లు ప్రకటించారు. కళాకారుల అభిప్రాయాలతో తమకు సంబంధం ఉండదని చెప్పారు. ఇదే వేదిక మీద కొద్ది నెలల క్రితం ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అలహాబాదియా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి పలు కేసుల్లో ఇరుక్కున్నారు.

కునాల్‌ కామ్రా ఆదివారం తన షోలో ‘దిల్‌ తో పాగల్‌ హై’ సినిమాలోని ఒక పాట ట్యూన్‌లో పాడుతూ మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయాలను అపహాస్యం చేశారు.


శివసేన, ఎన్‌సీపీలు ముక్కలైన తీరును హాస్యభరితంగా చెప్పారు. నా కళ్లతో చూడు ద్రోహి కనిపిస్తాడు.... అని అర్థం వచ్చేలా శిందేను ఉద్దేశించి పాడారు. ద్రోహి వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కునాల్‌ కామ్రా మీద మహారాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోపక్క శివసేన శిందే వర్గం నేతలు కునాల్‌ కామ్రా రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలని హెచ్చరిక జారీ చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఆయన ఎక్కడ కనిపించినా మొహం మీద నల్లరంగు పులుముతామని ప్రకటించారు. ఆయన్ను దేశంలో ఎక్కడా తిరగనీయబోమన్నారు. కునాల్‌ కామ్రా కిరాయి కమెడియన్‌ అని వ్యాఖ్యానించారు. ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆయన తరఫున మాట్లాడటానికి నాయకులెవరూ లేకపోవడంతో కిరాయి కమెడియన్‌ను అద్దెకు తెచ్చుకున్నారని అన్నారు. ఆదిత్య ఠాక్రే కునాల్‌ కామ్రాకు మద్దతు పలికారు. హోటల్‌పై దాడిని ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని మండిపడ్డారు. శిందే ద్రోహి మాత్రమే కాదని, దొంగ కూడా అని చెప్పారు. కునాల్‌ కామ్రా నిజమే చెప్పాడని, శిందే ద్రోహేనని ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రిని కించపరిచేలా చౌకబారు కామెడీకి పాల్పడిన కునాల్‌ కామ్రా క్షమాపణలు చెప్పాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ డిమాండ్‌ చేశారు. ద్రోహి వ్యాఖ్యలు చేసినందుకు తాను చింతించడం లేదని కునాల్‌ కామ్రా ప్రకటించారు. తన వ్యాఖ్యలు తప్పని కోర్టులు చెబితే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నారు. తనకు మహారాష్ట్ర రాజకీయాల మీద వ్యాఖ్యలు చేసిందుకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, తన బ్యాంకు ఖాతాలను అన్నింటినీ తనిఖీ చేసుకోవచ్చని కునాల్‌ కామ్రా పోలీసులకు చెప్పారు.



ఈ వార్తలు కూడా చదవండి..

YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For National News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:39 AM