ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maha Kumbh Mela: మహా కుంభ మేళాకు వేళాయె!

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:41 AM

మహా కుంభమేళా..! ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఉత్సవం! ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం!

రేపటి నుంచే అతి పెద్ద హిందూ ఉత్సవం

144 ఏళ్లకొకసారి వచ్చే ఆధ్యాత్మిక సమ్మేళనం

45 రోజులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు

40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ

(ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి)

మహా కుంభమేళా..! ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ఉత్సవం! ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం! ఆహ్వానం లేకుండానే కోట్లాదిమంది హాజరయ్యే వేడుక! భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంగా భావించే ‘మహా కుంభమేళా’కు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమైంది. సోమవారం నుంచి ఫిబ్రవరి 26 వరకూ 45 రోజులపాటు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో మహా కుంభమేళా జరగనుంది. జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమయ్యే ఈ బృహత్తర క్రతువు ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుక కావడంతో యూపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్‌ను యోగి సర్కార్‌ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. పట్టణంలో అడుగు పెట్టిన చోటు నుంచే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దాదాపు ప్రతి కూడలిలో గజ్జెలు, ఢమరుకం వంటి చిహ్నాలను ఉంచింది. గోడలకు పెయింటింగులు వేయించింది! విద్యుత్తు, ఇతర స్తంభాలకు త్రినేత్రం తదితర సొబగులను అద్దింది. నెలన్నరపాటు పుణ్య స్నానాలు ఆచరించేందుకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు, యాత్రికులు వస్తారని యూపీ సర్కారు అంచనా వేస్తోంది. త్రివేణి సంగమానికి ఇరువైపులా దాదాపు 4 వేల హెక్టార్లలో సౌకర్యాలు కల్పిస్తోంది.

ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘా

కోట్లాదిమంది భక్తులు హాజరయ్యే మహా కుంభమేళా కోసం ప్రభుత్వం అంతే స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ఇప్పటికే సమగ్ర కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 2,750 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. అత్యంత కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏఐ ఆధారిత కెమెరాలను బిగిస్తోంది. భక్తులకు సమాచారాన్ని అందించడానికి 80 వీఎండీ టీవీ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తోంది. ‘1920’ పేరిట హెల్ప్‌లైన్‌తోపాటు 50 మందితో కాల్‌ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తోంది. వేలాది సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠమైన నిఘా కోసం డ్రోన్లు, ఏఐ సాయంతో కెమెరాలను వినియోగించనుంది. నీటిలోనూ నిఘా ఉంచే డ్రోన్లు అందుబాటులో ఉంచుతోంది. సైబర్‌ మోసాలకు తావు లేకుండా 56 మంది సైబర్‌ సెక్యూరిటీ నిపుణులను రంగంలోకి దించుతోంది.


కుంభమేళాలు నాలుగు..

హిందూ పురాణాల ప్రకారం.. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మథిస్తారు. అప్పుడు ఒక కుండ (కుంభం)లో అమృతం బయటకు వస్తుంది. దానిని రాక్షసులకు అందకుండా చేయడం కోసం మోహినీ రూపం ధరించిన విష్ణువు ఆ కుండను తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలోనే నాలుగు అమృతం చుక్కలు నేలపై పడతాయి. ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, ఉజ్జయిని, నాసిక్‌. అందుకే, వాటిని పవిత్ర పుణ్య క్షేత్రాలుగా భావిస్తూ కుంభమేళాలు నిర్వహిస్తారు. వీటిలో ఒక్కో కుంభమేళాను ఒక్కో చోట నిర్వహిస్తారు. మాఘ మేళాను ఏటా మాఘ మాసంలో ప్రయాగ్‌రాజ్‌లో; అర్ధ్‌ కుంభ మేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్‌, ప్రయాగ్‌రాజ్‌ల్లో నిర్వహిస్తారు. పూర్ణ కుంభమేళాను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మొత్తం నాలుగు క్షేత్రాల్లోనూ అట్టహాసంగా నిర్వహిస్తారు. మహా కుంభ మేళా మాత్రం 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. దీనిని ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే నిర్వహిస్తారు.

ఏం చేస్తారంటే..

త్రివేణీ సంగమంలో స్నానం చేసి అక్కడే ఉన్న మాధవుడిని దర్శించుకుని, అక్షయ్‌ వట్‌ (మర్రిచెట్టు)ను దర్శించుకోవడాన్ని మహా కుంభమేళాలో భాగంగా భావిస్తారు. ఆ తర్వాత బడే హనుమాన్‌ ఆలయాన్ని సందర్శిస్తారు. దీపంతోపాటు ఇతర దానాలు చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. సంకీర్తనలు, భజనలు, యోగా, మెడిటేషన్‌కు ప్రాధాన్యం ఇస్తారు. తొలుత, నాగ సాధువులు వచ్చి పుణ్య స్నానాలు చేయడాన్ని కుంభమేళాకు ఆరంభంగా భావిస్తారు. ఆ తర్వాత అఖాడాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. ఆ తర్వాతే సామాన్య భక్తులు స్నానాలు చేయడానికి అనుమతిస్తారు.

పుణ్య స్నానాలకు ముఖ్యమైన రోజులు

నెలన్నరపాటు జరిగే మహా కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ‘షాహీస్నాన్‌’గా పిలిచే పుణ్య స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆత్మ శుద్ధి అవుతుందని, పాపాల నుంచి విముక్తి చెందుతామని నమ్ముతారు.


ముఖ్యమైన రోజులు ఇవే..

జనవరి 13: పుష్య పౌర్ణమి స్నానం (ప్రారంభ రోజు)

జనవరి 15: మకర సంక్రాంతి స్నానం

జనవరి 29 మౌని అమావాస్య స్నానం

ఫిబ్రవరి 3: వసంత పంచమి స్నానం

ఫిబ్రవరి 12: మాఘ పౌర్ణమి స్నానం

ఫిబ్రవరి 26: మహా శివరాత్రి స్నానం (ముగిసే రోజు)

అంకెల్లో మహా కుంభమేళా

45 రోజులు

కుంభమేళా జరిగే మొత్తం రోజులు

12 కిలోమీటర్లు

తాత్కాలిక ఘాట్ల నిర్మాణం

40 కోట్లు

45 రోజుల్లో కుంభమేళాకు వస్తారనుకుంటున్న భక్తులు

దాదాపు 2 లక్షలు

ప్రయాగ్‌రాజ్‌లో తాత్కాలిక టెంట్లు

15 వేలు

పారిశుద్ధ్య సిబ్బంది నియామకం

1250 కిలోమీటర్లు

50 వేల నీటి కనెక్షన్లకు మంచినీటి పైప్‌లైన్లు

400 కిలోమీటర్లు

ప్రయాగ్‌రాజ్‌లో తాత్కాలిక రోడ్ల నిర్మాణం

1800 హెక్టార్లు

ప్రయాగ్‌రాజ్‌లో పార్కింగ్‌ స్థలం

యుద్ధ క్షేత్రం నుంచి శాంతి కోసం!

రష్యా, ఉక్రెయిన్‌ నుంచి ప్రయాగ్‌కు

సత్యాన్వేషణకు వచ్చామని వెల్లడి

(ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా ప్రాంగణం నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి)

పుణ్య స్నానాలు ఆచరించేందుకు కొందరు..! పర్యాటక అనుభూతి కోసం మరికొందరు..! సత్యాన్వేషణలో ఇంకొందరు..! ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు తరలి వచ్చే విదేశీయులు ఎందరో!! ఎప్పట్లాగే, ఈసారి కూడా పెద్దఎత్తున విదేశీయులు కుంభ మేళాకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా, యుద్ధ క్షేత్రాలైన రష్యా, ఉక్రెయిన్‌ నుంచి పలువురు ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. వారిలో ఒకరు జెహెనియా! ఆయన రష్యాలో యోగా శిక్షకుడు. మూడేళ్ల కిందట భారత దేశానికి వచ్చేశారు. ప్రస్తుతం ఆయన ప్రయాగ్‌రాజ్‌లో చిన్న టెంట్‌ వేసుకుని కనిపించారు. ఉక్రెయిన్‌ నుంచి ఏడాది కిందట వచ్చిన మరో ముగ్గురు కూడా ఆయనతోపాటు ఇక్కడే ఉన్నారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండడం విశేషం. మీరంతా కుంభమేళాకు ఎందుకు వచ్చారని ప్రశ్నించినప్పుడు ‘సత్యాన్వేషణ’కు అని జవాబిచ్చారు. యుద్ధాలతో రష్యా, ఉక్రెయిన్‌ అల్లకల్లోలంగా మారాయని, శాంతి, ఆధ్యాత్మిక భావాలను అన్వేషించడానికే తాము ఇక్కడికి వచ్చామని వివరించారు. ఇక, క్రియా యోగాను నేర్చుకోవడానికి కొందరు, మానసిక శాంతి కోసం మరికొందరు ప్రయాగ్‌రాజ్‌కు తరలి వస్తున్నారు.

Updated Date - Jan 12 , 2025 | 05:41 AM