Share News

Choksi Arrested: బెల్జియంలో మెహుల్‌ ఛోక్సీ అరెస్టు

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:46 AM

పీఎన్‌బీ కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యాడు. భారత్‌కు అప్పగింత కోసం కేంద్రం బెల్జియంతో చర్చలు కొనసాగిస్తోంది.

Choksi Arrested: బెల్జియంలో మెహుల్‌ ఛోక్సీ అరెస్టు

  • పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.14 వేల కోట్ల మేర కుచ్చుటోపీ

  • నీరవ్‌ మోదీ సహా ఛోక్సీపై కేసు.. 2018లో విదేశాలకు పరారీ

  • లండన్‌ జైలులో నీరవ్‌ మోదీ.. ఏడాదిగా బెల్జియంలోనే ఛోక్సీ

  • బ్లడ్‌ క్యాన్సర్‌కు చికిత్స!.. ఏడాది క్రితమే బెల్జియం పోలీసులకు భారత దర్యాప్తు సంస్థల సమాచారం

  • స్విట్జర్లాండ్‌కు పారిపోయే క్రమంలో అరెస్టు

  • ఛోక్సీని వెనక్కి రప్పిస్తాం: కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)కు రూ.14 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో సహ-నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ బెల్జియంలో అరెస్టయ్యారు. అతను బెల్జియంలో తలదాచుకుంటున్నాడంటూ భారత దర్యాప్తు సంస్థలు ఏడాది క్రితమే అక్కడి ప్రభుత్వానికి సమాచారం అందించాయి. స్విట్జర్లాండ్‌కు పారిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన క్రమంలో ఛోక్సీని అరెస్టు చేసినట్లు బెల్జియం పోలీసులు వెల్లడించారు. 2014-17 మధ్యకాలంలో తప్పుడు లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌(ఎన్‌వోయూ), ఫారిన్‌ లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎఫ్ఎల్‌సీ)లతో విడతల వారీగా పీఎన్‌బీ నుంచి రుణాలు తీసుకున్న ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీ, అతని మేనమామ మెహుల్‌ ఛోక్సీ.. 2018లో తమపై ఆరోపణలు వెల్లువెత్తగానే దేశాన్ని వీడారు. నీరవ్‌ మోదీ లండన్‌కు, ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోయారు. నీరవ్‌ మోదీ ప్రస్తుతం లండన్‌ జైలులో ఉండగా.. ఛోక్సీ ఆంటిగ్వా-బార్బుడా పౌరసత్వం తీసుకున్నారు. వీరిద్దరినీ వెనక్కి రప్పించేందుకు భారత్‌ 2018 నుంచే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2023 నవంబరులో ఛోక్సీ బెల్జియం పౌరురాలైన తన సతీమని ప్రీతి సాయంతో.. ‘ఎఫ్‌ రెసిడెన్సీ కార్డ్‌’ను పొందినట్లు భారత దర్యాప్తు సంస్థలు నిర్ధారించి, ఆ దేశానికి సమాచారం అందించాయి. అతని బెల్జియంపై ఒత్తిడి పెంచాయి. ఈ నేపథ్యంలో ఛోక్సీ.. స్విట్జర్లాండ్‌ పారిపోయేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే బెల్జియం పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు. ఈనెల 12న ఛోక్సీని అరెస్టు చేసిన విషయాన్ని బెల్జియం పోలీసులు ధ్రువీకరించారు.


అప్పగింత ఎలా!

బెల్జియం-భారత్‌ మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం బ్రిటిష్‌ కాలం(1901)లోనే మొదలైంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక-1958లో దాన్ని పునరుద్ధరించారు. 2020లో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ ఈ ఒప్పందాన్ని కొనసాగిస్తూ.. సంతకాలు చేసింది. ఈ ఒప్పందంలోని కీలక అంశాలను బట్టి.. బెల్జియం ప్రభుత్వం ఛోక్సీని అప్పగించాల్సి ఉంటుంది. ఇరుదేశాల్లో నేరంగా పరిగణించే అంశాలు, ఆర్థిక నేరాలు, పన్ను ఎగవేత, ఆదాయానికి సంబంధించిన కేసుల్లో నిందితులను అప్పగించాలి. అదే సమయంలో.. రాజకీయ కారణాలతో అరెస్టులు ఉన్నా.. మిలటరీ సంబంధిత నేరాలైనా.. ఖైదీల అప్పగింత కుదరదు. ఈ నేపథ్యంలో ఛోక్సీ న్యాయవాదులు మానవహక్కులు, రాజకీయ వేధింపుల అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. ఛోక్సీ అప్పగింతపై భారత్‌ చేసిన అభ్యర్థనను పరిశీలిస్తున్నామని బెల్జియం ప్రభుత్వం కూడా సోమవారం అధికారికంగా ప్రకటించడం గమనార్హం..! కాగా, ఛోక్సీని వెనక్కి రప్పిస్తామని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ స్పష్టంచేశారు. ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేయడాన్ని భారత్‌ విజయంగా పేర్కొన్నారు.

sdvgdvs.jpg

2021లో డొమినికాలో అరెస్టు!

ఛోక్సీని డొమినికా పోలీసులు 2021లోనే అరెస్టు చేశారు. అప్పట్లో ఆయన ఆంటిగ్వా-బార్బుడా నుంచి క్యూబా వెళ్లే ప్రయత్నంలో అక్రమంగా డొమినికాలో ప్రవేశించడంతో అరెస్టయ్యాడు. అయితే.. అతణ్ని కిడ్నాప్‌ చేశారని ఛోక్సీ న్యాయవాదులు ఆరోపించారు. దీని వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందన్నారు. డొమినికా పోలీసులు అరెస్టు చేసిన సమయంలోనే.. భారత దర్యాప్తు సంస్థలు ఛోక్సీని రప్పించే ప్రయత్నం చేసినా.. అది సఫలమవ్వలేదు.

అనారోగ్య కారణాలు..

ఛోక్సీ పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. బ్లడ్‌ క్యాన్సర్‌కు బెల్జియంలో చికిత్స పొందుతున్నారని సమాచారం. ఆయన ఆస్పత్రిలో ఉండగానే.. బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. అనారోగ్య కారణాలను ప్రస్తావిస్తూ.. ఆయన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. అదే సమయంలో ఛోక్సీని తమకు అప్పగించాలని సీబీఐ, ఈడీ అధికారులు బెల్జియంను అభ్యర్థించాయి.


ఇవి కూడా చదవండి..

PM Modi: వక్ఫ్ నిబంధనలను స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది: మోదీ

Ayodhya: అయోధ్య రామాలయ ట్రస్టుకు బెదిరింపు మెయిల్

India Laser Weapon: భారత్‌ అమ్ముల పొదిలో లేజర్‌ అస్త్రం

Supreme Court Review Petition Filed: గడువు వద్దు

Updated Date - Apr 15 , 2025 | 04:46 AM