Share News

H-1B visa: అమెరికా.. కలలు కల్లలు

ABN , Publish Date - Apr 09 , 2025 | 02:42 AM

అమెరికాలో ఓపీటీ ప్రోగ్రామ్ రద్దు యోచనతో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీసా మార్పుల కారణంగా వృత్తిపరమైన అవకాశాలు తగ్గిపోతుండటంతో, విద్యార్ధులు ఇతర దేశాల్లో అవకాశాల్ని పరిశీలిస్తున్నారు.

H-1B visa: అమెరికా.. కలలు కల్లలు

విద్యార్థులపై ట్రంప్‌ సర్కారు మరో పిడుగు

కారు వేగంగా నడిపారని, లైసెన్స్‌ లేదని..

స్టూడెంట్‌ వీసాలు ఎడాపెడా రద్దు

కాలేజీలకూ సమాచారం ఇవ్వని అధికారులు

వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా

హార్వర్డ్‌ నుంచి స్టాన్‌ఫోర్డ్‌ వరకూ ఇదే తీరు

వర్క్‌ వీసా రద్దుకు ట్రంప్‌ సర్కారు యోచన

ఓపీటీని ముగించాలని కాంగ్రె్‌సలో బిల్లు

వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో గుబులు

హెచ్‌-1బీకి మారాలని నిపుణుల సూచనలు

దేశం విడిచి వెళ్తే రావడం కష్టమని హెచ్చరిక

చైనాపై ట్రంప్‌ బాదుడు 104 శాతానికి..

అమెరికా టారి్‌ఫలపై చర్చలే మార్గం: జైశంకర్‌

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 8: అమెరికా చదువులు ఉద్యోగ భరోసాకు, ఆ దేశంలో శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా సడలిపోతోంది. ఒకవైపు వర్క్‌ వీసా రద్దు చేయాలని భావిస్తోన్న ట్రంప్‌ సర్కారు... మరోవైపు విదేశీ విద్యార్థి వీసాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రద్దు చేస్తోంది. హెచ్‌-1బీ వీసా జారీకి కీలకమైన ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ రద్దు యోచన విదేశీ విద్యార్థులపై ప్రత్యేకించి స్టెమ్‌ కోర్సులు అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఓపీటీని ముగించాలని కోరుతూ అమెరికా కాంగ్రె్‌సలో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వారిలో ఆందోళన రేపుతోంది. వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉపాధి వీసాలకు మారడానికి ఓపీటీపై ఆధారపడుతున్న అమెరికాలోని వేలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్‌ అవకాశాలను ఈ చర్య దెబ్బతీసే ప్రమాదం ఉంది. 2023-24 విద్యా సంవత్సరంలో భారత్‌కు చెందిన 3,31,602 మంది విద్యార్థులు అమెరికాలో విద్యనభ్యసిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23% ఎక్కువ.

gh.gif

వీరిలో సుమారు 97,556 మంది ఓపీటీలో పాల్గొన్నారు. ఓపీటీ రద్దుకు గతంలో చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రస్తుతం ట్రంప్‌ హయాంలో వలస వ్యతిరేక విధానాలు విస్తృతంగా అమలవుతున్న తరుణంలో ఈ బిల్లు తెరపైకి రావడం ఎప్‌-1, ఎం-1 వీసాదారుల్లో గుబులు రేపుతోంది. వీరిలో చాలామంది ఇప్పుడు తమ వీసాను హెచ్‌-1బీకి మార్చుకోవడానికి దోహదం చేసే ఉద్యోగాల కోసం భారతీయ టెక్‌ సంస్థల సహకారంతో అత్యవసరంగా దరఖాస్తు చేసుకుంటున్నారు.


తాజా బిల్లు ఆమోదం పొందితే వర్క్‌ వీసాకు మారే అవకాశం లేకుండానే ఓపీటీ అర్ధంతరంగా ముగుస్తుందని, దీంతో విదేశీ విద్యార్థులు తక్షణం అమెరికాను వీడాల్సి రావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఓపీటీ హోదాలో ఉన్న విద్యార్థులు వెంటనే హెచ్‌-1బీకి మారాలని, లేదా ఇతర దేశాల్లో అవకాశాలను పరిశీలించాలని సూచిస్తున్నారు. ఓపీటీ రద్దయితే అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించేవారు కూడా యూకేలో అమలు చేస్తున్న విధంగా వారి చదువులు ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులపై ఆర్థికంగానూ పెనుభారం పడుతుంది. అమెరికా స్థాయి సంస్థల నుంచి ఏళ్ల తరబడి వచ్చే జీతాలు కోల్పోవడంతో పెద్దమొత్తంలో తీసుకున్న విద్యారుణాలను తిరిగి చెల్లించడంలో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకసారి అమెరికా విడిచి వెళ్తే తిరిగి ప్రవేశించడానికి అనుమతి లభించడం కష్టమేనని, వేసవి సెలవుల్లో స్వదేశాలకు వెళ్లొద్దని కార్నెల్‌, కొలంబియా, యేల్‌ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థలు విదేశీ విద్యార్థులకు అనధికారికంగా సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది భారత విద్యార్థులు ఇప్పటికే తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.

ఓపీటీ అంటే ఏమిటి?

ఎఫ్‌-1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన రంగాల్లో 12 నెలల వరకూ పని చేయడానికి ఓపీటీ అనుమతిస్తుంది. స్టెమ్‌(ఎ్‌సటీఈఎం) గ్రాడ్యుయేట్లు ఈ వ్యవధిని అదనంగా మరో 24 నెలలు పొడిగించుకోవడం ద్వారా మూడేళ్ల వరకూ అమెరికాలో ఉండి పని అనుభవం పొందే అవకాశం ఉంది. హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ పని అనుభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నైపుణ్యం కలిగిన విదేశీయులు మరో ఆరేళ్ల పాటు అమెరికాలో పనిచేయడానికి ఈ వీసా అనుమతిస్తుంది.

విద్యార్థి వీసాలకూ ట్రంప్‌ ఎసరు

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతంలో ఎప్పుడో కారును మితిమీరిన వేగంతో నడిపారనో, లైసెన్స్‌ లేదనో ఏదో ఒక సాకుతో ఇమిగ్రేషన్‌ అదికారులు వారి ఎఫ్‌-1 వీసాలు రద్దు చేసి, విమానం ఎక్కిస్తున్నారు. తాము ఎప్పుడో గతంలో చేసిన ఉల్లంఘనలను అప్పుడే చట్టపరంగా పరిష్కరించుకున్నామని, ఇప్పుడు వాటిని తిరగదోడి శిక్ష విధించడం అన్యాయమని వాపోతున్నారు. భారత్‌ సహా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేస్తున్న ఘటనలు పెరుగుతుండటంపై ఆయా వర్సిటీల అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఫెడరల్‌ ఇమిగ్రేషన్‌ డేటాబేస్‌ పరిశీలించే వరకూ తమతో పాటు బాధిత విద్యార్థులకు కూడా దీనిపై ఎలాంటి సమాచారం ఉండటం లేదని, వీసా రద్దుకు గల కారణాలను అందులో అధికారులు పేర్కొనడం లేదని పేర్కొంటున్నారు. కాగా, డ్రైవింగ్‌ ఉల్లంఘనలు వంటి చిన్నపాటి ఉల్లంఘనల కారణంగా తమ వీసాలను రద్దు చేశారని ఆరోపిస్తూ ఇద్దరు గుర్తుతెలియని విద్యార్థులు తాజాగా ఫెడరల్‌ కోర్డులో దావా వేశారు. ఈ అంశానికి సంబంధించి టెక్సా్‌సకు చెందిన ఒక న్యాయవాది దాదాపు 30 కేసులు వాదిస్తున్నారు. వీసా రద్దు అంశంలో న్యాయ సహాయం కోరుతూ భారతీయ విద్యార్థుల నుంచి పిటిషన్లు ఎక్కువగా వస్తున్నాయన్నారు. మరోవైపు, విద్యార్థి వీసాల రద్దు కార్యక్రమాన్ని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) మార్చి చివరి నుంచి ప్రారంభించింది. ఇప్పటి వరకూ 150 మందికి పైగా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయని తెలుస్తోంది.


9.85 లక్షల మంది వలసదారులకు ఝలక్‌

బైడెన్‌ హయాంలో సీబీపీ వన్‌ యాప్‌ ద్వారా అమెరికాలోకి ప్రవేశించిన లక్షలాది మందికి ట్రంప్‌ సర్కారు షాక్‌ ఇచ్చింది. అప్పట్లో తాత్కాలిక నివాస అనుమతులు పొందిన దాదాపు 9.85 లక్షల మందికి పెరోల్‌ రక్షణను రద్దు చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రకటించింది. వారంతా వెంటనే స్వచ్ఛందంగా దేశం విడిచి పోవాలని స్పష్టం చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారంతా వెంటనే సీబీపీ హోం యాప్‌లో స్వీయ బహిష్కరణకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

రోజుకు రూ.86 వేలు జరిమానా!

బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా దేశం విడిచి వెళ్లని అక్రమ వలసదారులకు భారీ జరిమానాలు విధించాలని ట్రంప్‌ సర్కారు యోచిస్తోంది. రోజుకు దాదాపు రూ.86 వేలు చొప్పున జరిమానా కట్టాలని లేకుంటే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతోంది. స్వీయ బహిహ్కరణల కోసం ఉద్దేశించిన సీబీపీ హోం యాప్‌లో నమోదు చేసుకుని, తుది ఆదేశాలు వెలువడిన తర్వాత కూడా దేశాన్ని విడిచిపెట్టకపోతే రోజువారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని డీహెచ్‌ఎస్‌ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ జరిమానాలకు సంబంధించిన 1996 నాటి చట్టాన్ని ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో తొలిసారిగా అమలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Updated Date - Apr 09 , 2025 | 02:42 AM