Modi Tamil Nadu speech: అకారణంగా ఏడుస్తుంటారు

ABN, Publish Date - Apr 07 , 2025 | 04:04 AM

పాంబన్‌ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ, తమిళనాడు అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించడంతోపాటు సీఎం స్టాలిన్‌ ఆరోపణలను ఖండించారు. తమిళ భాషపై ప్రేమతో లేఖలు రాస్తున్న నాయకులు తమ సంతకాలు కూడా తమిళంలో పెట్టాలని పరోక్షంగా సూచించారు.

Modi Tamil Nadu speech: అకారణంగా ఏడుస్తుంటారు

కొందరికి ఇది అలవాటుగా మారింది.. మనమేం చేయలేం.. స్టాలిన్‌పై మోదీ విమర్శ

తమ హయాంలోనే తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులని వెల్లడి

తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళంలో సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా

పాంబన్‌ వంతెనను ప్రారంభించిన ప్రధాని.. తమిళనాడు సీఎం గైర్హాజరు

సాంకేతికత-సంప్రదాయాల సమ్మేళనం పాంబన్‌

వందేళ్ల క్రితం గుజరాతీ బిడ్డ నిర్మించాడు

ఇప్పుడు మళ్లీ గుజరాత్‌ బిడ్డకు అవకాశం: మోదీ

చెన్నై, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అయినా అకారణంగా ఏడవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శించారు. ‘వారు ఏడుస్తూనే ఉంటారు. మనమేమీ చేయలేం’ అని తమిళనాడు సీఎం స్టాలిన్‌ అండ్‌కోపై ధ్వజమెత్తారు. అలాగే తనకు ఎంతో మంది తమిళనాడు నేతలు లేఖలు రాస్తుంటారని.. ఒక్కరు కూడా తమిళంలో సంతకం చేయడం లేదని ఆక్షేపించారు. శ్రీలంక పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం వాయుసేనకు చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లో నేరుగా రామనాథపురం జిల్లా మండపం వచ్చిన ప్రధాని.. పాంబన్‌ సముద్ర వంతెనను లాంఛనంగా ప్రారంభించారు. వంతెన పై నుంచి రైలుకు, కింది నుంచి నౌకా రవాణాకు కూడా పచ్చజెండా ఊపారు. అంతేగాక రాష్ట్రంలో రూ.8,300 కోట్ల విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని ప్రసంగించారు. తమిళనాడుకు రావలసిన నిధులను కేంద్రం నిలిపివేసిందన్న సీఎం స్టాలిన్‌ ఆరోపణలను మోదీ ఈ సందర్భంగా ఖండించారు. గతంతో పోలిస్తే గడిచిన పదేళ్లలో తమిళనాడుకు 3 రెట్లు అధికంగా నిధులిచ్చామన్నారు. ‘గత పదేళ్లలో తమిళనాడుకు రైల్వే బడ్జెట్‌ను 7రెట్లు పెంచాం. రామేశ్వరం సహా రాష్ట్రంలో 77 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. పీఎం ఆవాస్‌ యోజన కింద తమిళనాడులో 12 లక్షలకు పైగా ఇళ్లు నిర్మించాం. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఈ రాష్ట్రంలో కోటికిపైగా చికిత్సలు జరిగాయి’ అని తెలిపారు. హిందీ భాషను కేంద్రం తమపై రుద్దాలని చూస్తోందని ఆరోపిస్తున్న స్టాలిన్‌పై ప్రధాని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘చాలా మంది తమిళనాడు నాయకులు నాకు లేఖలు రాస్తుంటారు. కానీ ఎవరూ తమిళంలో సంతకం చేయరు. నిజంగా వారికి తమిళ భాష అంటే అంత అభిమానముంటే మొదట తమిళంలో సంతకం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.

డాక్టర్లు కావాలని కలలు కంటున్న పేద నేపథ్యం కలిగిన విద్యార్థులకు మేలు చేసేలా వైద్య విద్య కోర్సులను మాతృభాష తమిళంలో బోధించాలని స్టాలిన్‌ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తమిళ భాష, సంస్కృతిని ప్రపంచం నలుమూలలకూ చేర్చేందుకు కేంద్రం నిరంతరం కృషిచేస్తోందన్నారు. శ్రీరాముడి జీవితం, సుపరిపాలనా స్ఫూర్తి.. జాతి నిర్మాణానికి ముఖ్యమైన పునాదిగా పని చేస్తాయని చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా పవిత్ర భూమి రామేశ్వరం నుంచి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.


పాంబన్‌తో ఎంతో మేలు

‘భారతరత్న’ డాక్టర్‌ కలాం జన్మించిన భూమి రామేశ్వరమని ప్రధాని తెలిపారు. ఆయన జీవితం సైన్స్‌-ఆధ్యాత్మికత సమ్మిళితమని.. కొత్త పాంబన్‌ వంతెన కూడా సాంకేతిక-సంప్రదాయాల సమ్మేళనంగా అభివర్ణించారు. వేల సంవత్సరాల పురాతనమైన ఈ పట్టణం.. ఇప్పుడు 21వ శతాబ్దపు ఇంజనీరింగ్‌ అద్భుతంతో.. ప్రధాన భూభాగానికి అనుసంధానమైందన్నారు. పాంబన్‌ సహా దేశంలో నాలుగు దిక్కులా నిర్మించిన వంతెనలను మోదీ ప్రస్తావించారు. ఉత్తరాన జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్‌ వంతెన ప్రపంచంలోనే ఎత్తయిన రైలు వంతెనల్లో ఒకటని.. పశ్చిమాన ముంబైలో ఇప్పుడు దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన అటల్‌ సేతు ఉందని.. తూర్పున అసోంలోని బోగిబీల్‌ వంతెన పురోగతికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. మత్స్యకారుల భద్రతకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని.. గత పదేళ్లలో శ్రీలంక చెర నుంచి 3,700 మందికి పైగా మత్స్యకారులను స్వదేశానికి తీసుకొచ్చామని చెప్పారు. ఇదిలా ఉండగా, శ్రీలంకలో మూడ్రోజుల పర్యటనలో చివరి రోజు ఆదివారం ప్రధాని మోదీ చారిత్రక, ఆధ్యాత్మిక నగరం అనూరాధపురకు వెళ్లారు. అక్కడ రూ.780కోట్ల భారత్‌ సాయంతో పునర్నిర్మించిన మహో-ఒమన్‌థాయ్‌ రైల్వే లైనును ప్రారంభించారు.

తర్వాత జయశ్రీ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. క్రీ.పూ.3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి కుమార్తె సంఘమిత్త మహా థెరి నెలకొల్పిన మహాబోధి వృక్షం వద్ద ప్రార్థనలు చేశారు. మరోవైపు, మోదీ కోరిక మేరకు ఆదివారం 11 మంది తమిళ జాలర్లను శ్రీలంక విడుదల చేసింది.


అప్పుడూ.. ఇప్పుడూ గుజరాతీ బిడ్డే

పాంబన్‌లో వందేళ్ల క్రితం గుజరాత్‌కు చెందిన వ్యక్తి రైల్వే వంతెన నిర్మించారని, మళ్లీ శతాబ్దం తర్వాత ఇదే స్థలంలో కొత్త వంతెన నిర్మించే అదృష్టం గుజరాతీ బిడ్డ(మోదీ)కే వచ్చిందని మోదీ సభలో వ్యాఖ్యానించారు. పాంబన్‌ కొత్త రైలు వంతెనను ప్రారంభించి, జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని.. తమిళ సంప్రదాయ దుస్తులైన ధోవతి, పట్టు చొక్కా, పట్టు అంగవస్త్రం ధరించి రామేశ్వరంలోని పర్వతవర్ధినీ సమేత రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ఆలయానికి వెళ్లిన ఆయన మూలవిరాట్‌ ముంగిట నేలపై ఆశీనులై స్వామివారికి మొక్కారు. ఇదిలా ఉండగా, హెలికాప్టర్లో శ్రీలంక నుండి రామనాథపురం మండపం వచ్చేటప్పుడు ‘రామసేతు’ను దర్శించుకునే అరుదైన భాగ్యం తనకు కలిగిందని మోదీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘దైవానుకూలంగా అయోధ్యలో సూర్యతిలకధారణ జరిగే సమయంలో ఈ సేతుబంధనాన్ని వీక్షించాను. ఇలా ఒకే సమయంలో రెండు దర్శనాలు శ్రీరామచంద్రుడి అనుగ్రహమే’ అన్నారు.


పార్లమెంటులో మోదీ ప్రకటన చేయాలి: స్టాలిన్‌

పాంబన్‌ వంతెన ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్‌ హాజరుకాలేదు. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున ప్రారంభోత్సవానికి రాలేనని ముందుగానే ప్రధానికి తెలియజేశానని ఆయన తెలిపారు. ఆదివారం ఊటీలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తమిళ గడ్డపై అడుగుపెట్టిన మోదీ.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని పార్లమెంటులో విస్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ సవరణ చేయాలని.. సముచిత పునర్విభజనకు ఇదొక్కటే మార్గమని.. మోదీ ఈ పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 1971 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన చేపడతామని 2001లో నాటి ప్రధాని వాజపేయి హామీ ఇచ్చారని.. దీనికి కేంద్రం కట్టుబడి ఉండాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

'అమెరికాను నాశనం చేయడం ఆపండి'

ట్రంప్ టారిఫ్‌ల కల్లోలం

జెలెన్‌స్కీ సొంత నగరంపై రష్యా దాడి

Read Latest and International News

Updated Date - Apr 07 , 2025 | 04:39 AM