PM Modi: నేనూ మనిషినే.. భగవంతుణ్ని కాదు!
ABN, Publish Date - Jan 11 , 2025 | 05:00 AM
ప్రధాని మోదీ తొలిసారి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదే ఒక విశేషమైతే.. రెండు గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో ఆయన తన శైలికి విరుద్ధంగా మాట్లాడి, అందరినీ ఆశ్చర్యపరిచారు.
పొరపాట్లు చేసే ఉంటా.. కానీ,
దురుద్దేశంతో తప్పులు చేయలేదు
‘దేశం ముందు’ అన్నదే నా సిద్ధాంతం
గాంధీ, సావర్కర్ మార్గాలు వేరైనా..
‘స్వాతంత్య్రం’ వారి సిద్ధాంతం
ప్రజా సేవ చేయాలన్న మిషన్‌తోనే
రాజకీయాల్లోకి రావాలి
ఎన్నికల్లో అలా మాట్లాడాల్సి వచ్చింది
ఎన్నికలు ముగిశాక పాలనపైనే నా దృష్టి
జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు
ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ, జనవరి 10: ప్రధాని మోదీ తొలిసారి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇదే ఒక విశేషమైతే.. రెండు గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో ఆయన తన శైలికి విరుద్ధంగా మాట్లాడి, అందరినీ ఆశ్చర్యపరిచారు. తానూ మనిషినేనని, పొరపాట్లు జరుగుతాయని చెప్పారు. ‘‘గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో కష్టపడి పనిచేయడానికి ఉన్న ఏ అవకాశాన్నీ వదలబోనని చెప్పా. నా కోసం ఏమీ చేసుకోలేదు. నేను దురుద్దేశంతో ఎన్నడూ తప్పులు చేయలేదు. ఇదే నా జీవన మంత్రం. తప్పులనేవి అనివార్యమైనవి. నేను కూడా చేసే ఉంటా. ఎందుకంటే నేనూ మనిషినే! నేనేమీ భగవంతుణ్ని కాదు కదా?’’ అని మోదీ పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కా్‌స్టలో ప్రధాని మోదీ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడుకున్నారు. ఇంటర్వ్యూ ట్రైలర్‌ను మోదీ తన ఎక్స్ ఖాతాలో పెట్టారు. తొలుత వీడియో ట్రైలర్‌ను పోస్ట్ చేసిన కామత్.. శుక్రవారం పూర్తి వీడియోను విడుదల చేశారు. దాదాపు 2 గంటల పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయాలు, చిన్నతనంలో జరిగిన ఘటనలు, స్నేహితులు, ప్రధానిగా బాధ్యతలు, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఆరంభంలో నిఖిల్ కామత్ మాట్లాడుతూ.. ‘ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఒకింత భయంగా ఉంది’ అన్నారు. దానికి మోదీ బదులిస్తూ.. ‘ఇదే నా తొలి పాడ్‌కాస్ట్. దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు’ అనడంతో నవ్వులు విరిశాయి. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచన ఏంటి? అని నిఖిల్ కామత్ ప్రధానిని అడగ్గా.. ‘‘రాజనీతి కలిగిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఉంది. ప్రజాసేవ చేయాలన్న మిషన్‌తో రాజకీయాల్లోకి రావాలి కానీ, వేరే యాంబిషన్(లక్ష్యం)తో కాదు’’ అని సమాధానమిచ్చారు. రాజనీతి కలిగిన నాయకులు ఉన్నారా? అని అడగ్గా.. దేశంలో అలాంటి యువ నాయకులు ఎంతో మంది ఉన్నారని మోదీ చెప్పారు. ఒకరి పేరు చెబితే మిగిలిన వారికి అన్యాయం సినట్లవుతుందన్నారు.
అదే నా సిద్ధాంతం
ఆశయాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందన్న ప్రధాని.. అదేసమయంలో సిద్ధాంతాలకు కూడా అంతే విలువ ఉంటుందన్నారు. సిద్ధాంతాలు లేకుండా రాజకీయాలు కూడా లేవని చెప్పారు. గాంధీ, సావర్కర్‌ల మార్గాలు వేరైనప్పటికీ వారి సిద్ధాంతం మాత్రం ఒక్కటేనన్నారు. అదే ‘స్వాతంత్య్రం’ అని మోదీ చెప్పారు. ఇక తన విషయానికి వస్తే.. ‘దేశం ముందు’ అన్నదే తన సిద్ధాంతమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పాత ఆలోచనలను పక్కనపెట్టి, ఎప్పటికప్పుడు కొత్తవాటికి చోటిస్తానని తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఒక బృందాన్ని రూపొందించుకోవాలన్నారు. తాను విజయవంతమవడానికి తన బృందమే కారణమని చెప్పారు.
తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చింది..
తాను విలక్షణ రాజకీయ నాయకుడిని కాదని మోదీ చెప్పారు. పరిపాలనపైనే తాను ఎక్కువ సమయం వెచ్చిస్తానని తెలిపారు. ‘‘ఎన్నికల సమయంలో నేను రాజకీయ ప్రసంగాలు చేశా. అది తప్పనిసరి పరిస్థితి. నాకు నచ్చకపోయినా అలా మాట్లాడాల్సి వచ్చేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత నా సమయం అంతా పరిపాలన కోసమే వెచ్చిస్తా. ఇక అధికారంలో లేని సమయంలో నా దృష్టి మొత్తం సంస్థాగత పనులపైనే ఉంటుంది’’ అని మోదీ పేర్కొన్నారు. తానెప్పుడూ సవాళ్లను ఇష్టపడతానని, ఒక గిరి గీసుకొని అందులో హాయిగా గడపడం తనకు నచ్చదని చెప్పారు. తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోనని, రిస్క్ తీసుకోవడానికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు. తొలి రెండు పర్యాయాలు తాను ప్రారంభించిన అభివృద్ధి పనులను చూసి ప్రధానిగా తన పనితీరును అంచనా వేసుకునేవాడినన్నారు. మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయన్నారు. 2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.
సాధారణ విద్యార్థిని..
మోదీ బాల్యం గురించి కామత్ అడగ్గా.. తానో సాధారణ విద్యార్థినని చెప్పారు. ఏ విషయంపైనా తాను పెద్దగా శ్రద్ధ పెట్టేవాడిని కాదన్నారు. అయితే భేల్జీభాయ్ చౌధరి అనే టీచర్ తనను ఎంతగానో ప్రోత్సహించేవారని మోదీ గుర్తుచేసుకున్నారు. ఆయన ఒక రోజు మా నాన్నతో ‘మీ అబ్బాయి చాలా ప్రతిభావంతుడు. కానీ, దృష్టి పెట్టడు’ అని చెప్పారని తెలిపారు.
నన్ను నేను నియంత్రించుకున్నా..
‘‘ఫిబ్రవరి 24, 2002లో నేను తొలిసారి సీఎంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టా. మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి 27న గోధ్రా ఘటన జరిగింది. రైలుకు నిప్పు పెట్టినట్లు తొలుత మాకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత అల్లర్లు, మృతుల సమాచారం వచ్చింది. అప్పుడు సభలో ఉన్న నేను ఎంతగానో ఆందోళన చెందా. వెంటనే గోధ్రాలో పర్యటిస్తానని చెప్పా. అప్పుడు ఒక్క హెలికాప్టర్ మాత్రమే ఉంది. అది సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ అని, వీఐపీలను అందులో ప్రయాణించడానికి అనుమతించబోమని అధికారులు చెప్పారు. ఏం జరిగినా నాదే బాధ్యత అని వారితో వాదించా. వెంటనే గోధ్రా వెళ్లా. అక్కడ మృతదేహాలు, హృదయవిదారకమైన దృశ్యాలు చూసి చలించిపోయా. కానీ, నేను సీఎం హోదాలో ఉండడంతో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సి వచ్చింది. నన్ను నేను నియంత్రించుకోవడానికి ఎంతో చేయాల్సి వచ్చింది’’ అని మోదీ చెప్పారు.
Updated Date - Jan 11 , 2025 | 05:00 AM