Kumbh Mela : భక్తులకు రంగుల తోవ!
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:36 AM
ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటలను నివారించడానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు రంగులతో దారి చూపిస్తామంటున్నారు నార్తర్న్ సెంట్రల్ సీపీఆర్వో శశికాంత్ త్రిపాఠి. క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడమే
నలుదిశలకూ నాలుగు రంగుల ప్రాంగణాలు
స్టేషన్లోకి వచ్చే, వెళ్లే దారులు వేర్వేరుగా
ప్లాట్ ఫాంపైకి నేరుగా ఎవరూ వెళ్లలేరు
తొక్కిసలాట నివారణకు రైల్వే ఏర్పాట్లు
9 స్టేషన్లలో 1186 సీసీ కెమెరాలు
వాటిలో 116 ఏఐ ఆధారిత ముఖ గుర్తింపువి
(ప్రయాగ్ రాజ్ కుంభమేళా
ప్రాంగణం నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి)
ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటలను నివారించడానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు రంగులతో దారి చూపిస్తామంటున్నారు నార్తర్న్ సెంట్రల్ సీపీఆర్వో శశికాంత్ త్రిపాఠి. క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడమే కాకుండా ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు కెమెరాల ద్వారా తప్పిపోయిన వాళ్లనూ గుర్తిస్తామంటున్నారు. ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి మాటామంతీ..
ప్రయాగ్ రాజ్‌కు లక్షల మంది వస్తారు.
రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
సాధారణంగా తొక్కిసలాట వంటి ఘటనలు వెళ్లే వాళ్లు, వచ్చే వాళ్లు ఒకే మార్గంలో ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే, రైల్వే స్టేషన్లలో లోపలికి వచ్చే, బయటకు వెళ్లే దారులను వేర్వేరు చేసేశాం. వచ్చే వాళ్లు సిటీ లైన్ దిశగా వస్తే.. వెళ్లే వాళ్లను సివిల్ లైన్ దిశగా మళ్లిస్తున్నాం. అలాగే, ప్లాట్ ఫాంపైకి నేరుగా ఎవరూ వెళ్లలేరు. అందరూ ఒకేసారి రాకుండా నియంత్రించడానికి నాలుగు ప్రత్యేక ప్రాంగణాలను ఏర్పాటు చేశాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో వెళ్లే వారిని ఆయా ప్రాంగణాల్లో ఉంచి.. అక్కడి నుంచి ప్లాట్ ఫాంలపైకి పంపిస్తాం?
భక్తుల్లో ఎవరు..
ఎక్కడి నుంచి వచ్చారు? అన్నది ఎలా గుర్తిస్తారు!?
ఇందుకు నాలుగు దిశలకు నాలుగు రంగుల (పసుపు, నీలం, ఎరుపు, ఆకుపచ్చ) ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. లఖ్‌నవూ, బనారస్ దిశగా వెళ్లాలంటే ఎరుపు రంగు ప్రాంగణంలోకి వెళ్లాలి. ఉదాహరణకు.. హైదరాబాద్‌కు ఎవరైనా వెళ్లాలనుకోండి. వారిని పసుపు రంగు ప్రాంగణంలోకి పంపిస్తాం. ఇక్కడ మంచినీళ్లు, మరుగుదొడ్ల నుంచి చార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశాం. ఒక్కో ప్రాంగణంలో ప్రత్యేకంగా దాదాపు 20 టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత ప్రాంగణంలోనే వేచి ఉంటారు. వారి రైలు వచ్చినప్పుడు మాత్రమే అక్కడి వలంటీర్లు వారిని ప్రత్యేక మార్గంలో ప్లాట్‌ఫాంపైకి పంపిస్తారు.
ఒక్కో ప్రాంగణంలో ఎంతమంది పడతారు?
ఇక్కడ ఒకేసారి 5000 మంది ఉండడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అంటే, నాలుగు ప్రాంగణాల్లో కలిపి ఒకేసారి 20 వేల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. దాదాపు పది వేల మంది సిబ్బంది ఈ మొత్తం వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. 200 మంది వరకూ వలంటీర్లు ఉంటారు. వారికి ఇప్పటికే వివిధ భాషల్లో శిక్షణ ఇచ్చాం. ఇదంతా అన్ రిజర్వ్‌డ్ ప్రయాణికుల కోసమే. రిజర్వ్‌డ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక ప్రాంగణం, ప్రత్యేక మార్గం ఉన్నాయి.
మేళాలో ఎవరైనా తప్పిపోవడం లేదా అసాంఘిక శక్తులు చొరబడటం వంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి ఏం చేయబోతున్నారు?
ప్రయాగ్‌రాజ్‌లో మొత్తం తొమ్మిది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 1186 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఒక్క ప్రయాగ్‌రాజ్ ప్రధాన స్టేషన్లోనే 384 కెమెరాలు ఉన్నాయి. వీటిలో 116 ఏఐ ఆధారిత ముఖాన్ని గుర్తించే సీసీ కెమెరాలు. ఎవరైనా తప్పిపోయారనుకోండి. వారి ఫొటో మాకు ఇస్తే.. ఏఐ కెమెరాల పరిధిలో వాళ్లు ఉంటే వెంటనే మాకు తెలిసిపోతుంది. ఏ కెమెరా పరిధిలో ఉన్నారో తెలుసుకుని వారిని గుర్తిస్తాం. అలాగే, కొంతమంది అసాంఘిక శక్తుల డేటాను ఇప్పటికే నమోదు చేశాం. ఒకవేళ వాళ్లు ఎవరైనా ఈ కెమెరాల పరిధిలోకి వస్తే వెంటనే మాకు తెలిసిపోతుంది.
రైళ్ల ద్వారా ఎంతమంది వస్తారని భావిస్తున్నారు? ఎన్ని రైళ్లను అందుబాటులో ఉంచుతున్నారు?
కుంభ మేళాకు దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. వారిలో కోటి మంది వరకూ రైళ్ల ద్వారానే వస్తారని భావిస్తున్నాం. ఇందుకు కుంభమేళా జరిగే 45 రోజులపాటు 13 వేల రైళ్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 3000 వరకూ ప్రత్యేక రైళ్లే. అలాగే, దాదాపు పది వేల వరకూ పాసింజర్ రైళ్లు. కుంభమేళా మొత్తంలో మౌనీ అమావాస్యను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆరోజు పెద్ద సంఖ్యలో వస్తారు. ఆ ఒక్కరోజే 350 రైళ్లను ఏర్పాటు చేశాం.
ఇక్కడి రైల్వే స్టేషన్లు ఒకేరోజు 350 రైళ్లు వస్తే తట్టుకోగలవా!?
సాధారణ రోజుల్లోనే ఇక్కడి మొత్తం 9 స్టేషన్లకు సరాసరిన 200 రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మరో 150 అదనంగా వస్తాయి. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే, వెళ్లే దారులను వేర్వేరు చేసేశాం. రెండూ కలవకుండా మూసేస్తున్నాం. ఒకవేళ వెళ్లే వాళ్లు ఎవరైనా ప్రవేశ ద్వారం వైపు వస్తే చుట్టుతిరిగి మళ్లీ వెళ్లాల్సిందే. అలాగే, తమిళం, తెలుగు, కన్నడ సహా మొత్తం 12 భాషల్లో అనౌన్స్‌మెంట్లు ఇవ్వనున్నాం. ఒక బుక్‌లెట్‌లో కుంభమేళా రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. అలాగే, కుంభ్ రైల్ సేవా 2025 అనే యాప్ తెస్తున్నాం. దాని ద్వారా టికెట్లు తీసుకోవడంతోపాటు పూర్తి వివరాలూ తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
Updated Date - Jan 10 , 2025 | 04:36 AM