Tea and Coffee: కాఫీ, టీలతో క్యాన్సర్‌కు చెక్!
ABN, Publish Date - Jan 05 , 2025 | 03:14 AM
‘హే.. చాయ్ గుటుక్కున తాగరాభాయ్!’- అంటూ విరామ సమయాల్లోనే కాదు.. తరచుగా అవకాశం ఉన్న ప్రతిసారీ టీతోపాటు కాఫీలు కూడా తాగడం మంచిదని చెబుతున్నారు పరిశోధకులు.
అమెరికా అధ్యయన కర్తల వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 4: ‘హే.. చాయ్ గుటుక్కున తాగరాభాయ్!’- అంటూ విరామ సమయాల్లోనే కాదు.. తరచుగా అవకాశం ఉన్న ప్రతిసారీ టీతోపాటు కాఫీలు కూడా తాగడం మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. ఇలా తరచుగా కాఫీలు, టీలు తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు. అంతేకాదు, నోరు, గొంతు, స్వరపేటిక క్యాన్సర్‌లను సైతం టీ, కాఫీలు అరికట్టే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పలు విషయాలను అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ‘క్యాన్సర్’ అనే జర్నల్‌లో ప్రచురించింది. మొత్తంగా 14 అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని దీనిలో పొందుపరిచింది. ‘ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమాలజీ కన్సార్టియం’ ఈ అధ్యయనాలను నిర్వహించింది. మొత్తం 9,500 మంది తల, మెడ క్యాన్సర్ రోగులను పరీక్షించడంతోపాటు క్యాన్సర్ నుంచి బయటపడిన 15,700 మందిని సైతం అధ్యయనం చేసింది. నిత్యం కాఫీ, టీలు తీసుకుంటున్న వారిలో మెడ, తల క్యాన్సర్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్టు అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
అధ్యయనం వివరాలు ఇవీ..
ఫ అసలు కాఫీ తాగని వారితో పోల్చుకుంటే.. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తీసుకునేవారిలో 17ు క్యాన్సర్ కారకాలు తగ్గుముఖం పడతాయి.
ఫ రోజూ ఎక్కువ మొత్తంలో కాఫీ తీసుకునే వారిలో నోటి క్యాన్సర్ లక్షణాలు 30 శాతం తక్కువగా ఉంటే గొంతు క్యాన్సర్ కారకాలు 22 శాతం తక్కువగా ఉన్నాయి.
ఫ నిత్యం 3-4 కప్పుల కాఫీ తాగేవారికి గొంతు కింది భాగంలో వచ్చే ‘హైపోఫారింజీల్’ క్యాన్సర్ లక్షణాలు 41 శాతం తక్కువగా ఉంటాయి. రోజుకు ఒక్క కప్పయినా టీ తాగేవారిలో 9ు తల, మెడ క్యాన్సర్ కారకాలు తక్కువగా ఉంటాయి. అయితే.. అదే పనిగా టీ తాగినా ఇబ్బందులు తప్పవని అధ్యయనం వెల్లడించింది. ఎక్కువ మోతాదులో టీ తాగేవారిలో ‘హైపోఫారింజీల్’ క్యాన్సర్ లక్షణాలు 38ు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది.
Updated Date - Jan 05 , 2025 | 03:14 AM