నా భార్యకు నన్ను చూస్తూ ఉండడం ఇష్టం!
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:17 AM
ఉద్యోగులు వారానికి ఎన్ని గంటలు పనిచేయాలనే అంశంపై తాజాగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు.
‘సీరమ్’ సీఈవో పూనావాలా వ్యాఖ్య
ఎల్ అండ్ టీ సంస్థ చైర్మన్‌కు చురకలు
న్యూఢిల్లీ, జనవరి 12: ఉద్యోగులు వారానికి ఎన్ని గంటలు పనిచేయాలనే అంశంపై తాజాగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. పనికి, జీవితానికి మధ్య సమతుల్యత ఉండాలన్న ఆయన ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ వ్యాఖ్యలను పరోక్షంగా విమర్శించారు. మహీంద్రా గ్రూ ప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఎక్కువ పనిగంటల విధానాన్ని వ్యతిరేకించారు. ఈ విషయంలో రాసి కంటే వాసి ముఖ్యమని, ఎన్ని గంటలు పనిచేశామన్నది కాదని.. ఎంత నాణ్యతతో చేశామనేది చూడాలన్నారు. ‘నిజమే(ఆనంద్ మహీంద్రా ), నా భార్య కూడా నేను అద్భుతమైన వ్యక్తిని అనుకుంటుంది. ఆదివారాలు నన్ను చూస్తూ ఉండటమే తనకు ఇష్టం’ అని ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అంతకుముందు ఆనంద్ మహీంద్రా ఇదే అంశంపై వ్యాఖ్యానిస్తూ 48, 70 లేదా 90.. ఇలా ఎన్ని గంటలు పని చేశామన్నది ముఖ్యం కాదని ఉత్పాదకతే ప్రధానమని అభిప్రాయపడ్డారు. ‘‘నా భార్య అద్భుతమైన వ్యక్తి. ఆమెను చూస్తూ ఉండటం నాకెంతో ఇష్టం’’ అని ఆయన పేర్కొన్నారు. వీరిలా స్పందించడానికి ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలే కారణం. ‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతసేపు అలా మీ భార్యను చూస్తారు? భార్యలు మాత్రం ఎంతసేపు భర్తలను చూస్తూ ఉండగలరు? ఆఫీసుకు వెళ్లి పనిచేయండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఆదివారం కూడా పనిచేస్తానని, ఎల్ అండ్ టీ ఉద్యోగులు కూడా ఆదివారం పనిచేస్తే సంతోషిస్తానన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 04:17 AM