Supreme Court: సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:18 AM
సమాచార కమిషన్లలో పలు పదవులు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిని తక్షణమే భర్తీ చేయాలని మంగళవారం ప్రభుత్వాలను ఆదేశించింది.
న్యూఢిల్లీ, జనవరి 7: సమాచార కమిషన్లలో పలు పదవులు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వాటిని తక్షణమే భర్తీ చేయాలని మంగళవారం ప్రభుత్వాలను ఆదేశించింది. పదవులు ఖాళీగా ఉంటే ఆ సంస్థలు ఉండి ఏమి ఉపయోగమని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాచార కమిషనర్లు లేకపోవడంతో తెలంగాణ, త్రిపుర, ఝార్ఖండ్‌ల్లో సమాచార కమిషన్లు క్రియారహితంగా మారాయని అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ పదవుల్లో కేవలం బ్యూరోక్రాట్లను మాత్రమే నియమిస్తుండడంపై ప్రశ్నించింది. అన్ని వర్గాల ప్రముఖులకు అవకాశం కల్పించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల పదవులు భర్తీ కావడం లేదంటూ అంజలి భరద్వాజ్, మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు. వారి తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ కమిషన్లలోని పదవులను భర్తీ చేయడం లేదంటే సమాచార హక్కు చట్టాన్ని హత్య చేయడమేనని అన్నారు.
ధర్మాసనం స్పందిస్తూ కేంద్ర సమాచార కమిషన్‌లో పదవుల భర్తీ ప్రక్రియ 2024 ఆగస్టులోనే ప్రారంభించినా ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖను ప్రశ్నించింది. కమిషనర్ల పదవుల కోసం 161 మంది దరఖాస్తు చేశారని, వారి వివరాలను వెల్లడించాలని తెలిపింది. అర్హులను ఎంపిక చేసి రెండు వారాల్లో జాబితాను రూపొందించాలని సూచించింది. ఝార్ఖండ్ సమాచార కమిషనర్ పదవులను భర్తీ చేయాలని గత ఏడాది జూన్‌లో ఆదేశాలు ఇచ్చినా, ప్రతిపక్ష నేత లేరన్న సాకుతో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. కమిషన్లలో ఉన్న ఖాళీలు, అభ్యర్థుల అర్హతలు, ఎంపిక కమిటీల స్వరూపంపై వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వాటిని భర్తీ చేశాక నివేదిక సమర్పించాలంది.
Updated Date - Jan 08 , 2025 | 05:18 AM