Share News

Supreme Court: బిల్లుల ఆమోదానికి గవర్నర్‌ కాలయాపన చట్టవిరుద్ధం

ABN , Publish Date - Apr 09 , 2025 | 02:50 AM

తమిళనాడు ప్రభుత్వం పంపిన 10 బిల్లులను మూడేళ్లు నిలిపివేసిన గవర్నర్‌ చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండోసారి పంపిన బిల్లులను గవర్నర్‌ తప్పనిసరిగా ఆమోదించాల్సిందేనని స్పష్టం చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

Supreme Court: బిల్లుల ఆమోదానికి గవర్నర్‌ కాలయాపన చట్టవిరుద్ధం

గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలివ్వలేదు

ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు చట్టసభల్లో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపకుండా, అలాగని వెనక్కి పంపకుండా.. ఏళ్లతరబడి కాలయాపన చేసే కొందరు గవర్నర్ల తీరుకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది! తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను దాదాపు మూడేళ్లుగా ఎటూ తేల్చకుండా నానుస్తున్న గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై స్టాలిన్‌ సర్కారు వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. తమకున్న విశేషాధికారాలను ఉపయోగించుకుని, ఆ బిల్లులు ఆమోదం పొందినట్టేనని ప్రకటించింది. అంతేనా.. ఇకపై, చట్టసభలు పంపే బిల్లులపై నిర్ణయాలు తీసుకోవడానికి గవర్నర్లకు గడువు విధిస్తూ సంచలన ఆదేశాలు జారీచేసింది!!

గవర్నర్లు ఇవి పాటించాల్సిందే: సుప్రీం

శాసనసభ తీర్మానించి పంపిన బిల్లును గవర్నర్లు గరిష్ఠంగా నెలరోజులకు మించి పెండింగ్‌లో ఉంచకూడదు. ఒకవేళ రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తేగనక..

నెలరోజుల్లోనే పంపాలి.

మంత్రివర్గ సలహాలు, సూచనలకు విరుద్ధంగా.. సమ్మతిని నిలుపుదల చేయాలని గవర్నర్‌ భావిస్తే.. ఆ విషయాన్ని తెలుపుతూ గరిష్ఠంగా 3 నెలల్లోపు బిల్లును తిప్పి పంపాలి.

మంత్రివర్గ సలహాలకు విరుద్ధంగా బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని భావిస్తే..

గరిష్ఠంగా మూడు నెలలలోపు ఆ పని చేయాలి.

గవర్నర్‌ తిప్పి పంపిన బిల్లును... అసెంబ్లీ గనక మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపితే.. దాన్ని గరిష్ఠంగా నెలలోపు ఆమోదించాలి.

వారు మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే.. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుకారాదు

తమిళనాడు అసెంబ్లీ గవర్నర్‌కు పంపిన 10 బిల్లులూ ఆమోదం పొందినట్టే

వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలూ చెల్లవ్‌.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

బిల్లులపై నిర్ణయానికి గవర్నర్లకు నెల నుంచి మూణ్నెల్ల దాకా గడువు

ఈ తీర్పుతో ఇకపై.. తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే చాన్స్‌లర్‌

వీసీల నియామకాలకు దారి సుగమం.. సుప్రీం తీర్పు చరిత్రాత్మకం: ఎంకే స్టాలిన్‌

గవర్నర్‌ రాజ్‌భవన్‌ను వీడి వెళ్లిపోవాలంటూ డీఎంకే, మిత్రపక్షాల డిమాండ్‌

చెన్నై, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమిళనాడు ప్రభుత్వం పంపిన 10 బిల్లులపై ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండా మూడేళ్లపాటు తొక్కిపెట్టి, ఆ తర్వాత రాష్ట్రపతి పరిశీలనకు పంపడం చట్టవిరుద్ధం అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బిల్లుల విషయంలో గవర్నర్‌ సదుద్దేశంతో వ్యవహరించలేదని, తాము ఓ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాతే వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారని వ్యాఖ్యానించింది.ప్రభుత్వం రెండోసారి పంపినప్పుడైనా గవర్నర్‌ వాటిని ఆమోదించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఆర్టికల్‌ 142 ప్రకారం తనకున్న విశేషాధికారాలను వినియోగించుకుని.. స్టాలిన్‌ సర్కారు రెండోసారి గవర్నర్‌కు పంపినప్పుడే ఆ బిల్లులూ ఆమోదం పొందినట్టు పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది. ఇకపై ఆ బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి ఏవైనా చర్యలు తీసుకున్నా, అవి చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. అలాగని, తాము గవర్నర్ల అధికారాలను తక్కువ చేయట్లేదని పేర్కొన్న కోర్టు.. గవర్నర్లు తీసుకునే చర్యలన్నీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ఉండాలని, ఆ సంప్రదాయాలకు గౌరవమివ్వాలని హితవు పలికింది.

hygbkm.gif

మాజీ ఐపీఎస్‌ అధికారి, కేంద్ర దర్యాప్తు సంస్థలో సైతం పనిచేసిన ఆర్‌ఎన్‌ రవి తమిళనాడు గవర్నర్‌గా 2021లో బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ ఆయనకు స్టాలిన్‌ నేతృత్వంలోని తమిళనాడు సర్కారుకు మధ్య బిల్లుల ఆమోదం విషయంలో ఘర్షణ కొనసాగుతూనే ఉంది. దీంతో.. తాము పంపిన పలు బిల్లుల్లో 10 బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపకుండా అనవసర కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ తమిళనాడు సర్కారు 2023 నవంబరులో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


ఆ బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం తీసుకునేందుకు గడువును నిర్దేశించాలని కూడా ప్రభుత్వం తన పిటిషన్‌లో కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని 200వ అధికరణ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల విషయంలో గవర్నర్‌ ముందు మూడే మార్గాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ఒకటి.. ఆయా బిల్లులను ఆమోదించడం, రెండు.. వాటిని పెండింగ్‌లో ఉంచి ప్రభుత్వం నుంచి వివరణ కోరడం, మూడు.. ఏదైనా బిల్లు రాజ్యాంగానికి, ఆదేశసూత్రాలకు లేదా ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉందని భావించినా, జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశంగా భావించినా దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపడం అని గుర్తుచేసింది. ఒకవేళ బిల్లుకు సమ్మతి తెలపకూడదని భావిస్తే గవర్నర్‌ దాన్ని తనవద్ద పెట్టుకోకూడదని.. పునఃపరిశీలించాలని కోరుతూ తప్పనిసరిగా అసెంబ్లీకి తిప్పి పంపాలని స్పష్టం చేసింది. శాసనసభ దాన్ని మరోసారి యథాతథంగా ఆమోదించి మళ్లీ గవర్నర్‌ వద్దకు పంపితే దానికి సమ్మతి తెలపడం మినహా గత్యంతరం లేదని, దాన్ని పెండింగ్‌లో పెట్టలేరని, రాష్ట్రపతి పరిశీలనకు పంపలేరని తేల్చిచెప్పింది. ఒకవేళ.. రెండోసారి పంపిన బిల్లు గనక మొదటిదానికన్నా భిన్నంగా ఉంటే మాత్రమే రాష్ట్రపతి పరిశీలనకు పంపగలరని వివరించింది. రాజ్యాంగంలో గవర్నర్‌కు వీటో అధికారం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని గుర్తుచేసింది. బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి ఆర్టికల్‌ 200లో నిర్దిష్ట కాలపరిమితి విధించకపోయినంతమాత్రాన.. గవర్నర్‌ వాటిపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా కాలయాపన చేసి, పాలనా యంత్రాంగానికి అడ్డంకిగా నిలవరాదని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ ఏ నిర్ణయమూ తీసుకోకపోతే అవి ఉత్తి కాగితాలుగా, మాంసం లేని అస్థిపంజరంగా మిగిలిపోతాయని ఆందోళన వెలిబుచ్చింది. రాజ్యాంగంలోని అధికరణ 200 ప్రకారం గవర్నర్‌ తీసుకునే ఏ నిర్ణయమైనా న్యాయసమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.


గడువు పరిమితమే...

రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించడానికి నిర్ణీత గడువు గురించి ఎక్కడా ప్రస్తావించకపోయినా.. గవర్నర్‌ వాటిని నెలల తరబడి పెండింగ్‌లో ఉంచడానికి వీలున్నట్లు భావించకూడదన్నారు. రాజ్యాంగంలో ఇలా నిర్ణీత గడువులు సూచించని విషయాలలో తగు నిర్ణయాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన గడువులోగా తీసుకోవాలనే భావించాలన్నారు. ఈ నేపథ్యంలో.. గవర్నర్‌ ఏదైనా బిల్లును పెండింగ్‌లో ఉంచడానికి, ఆమోదించడానికి ఒకటి నుండి మూడు నెలలను గడువుగా నిర్ణయిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్‌ 200 కింద తన అధికారాలను వినియోగించే క్రమంలో గవర్నర్‌ మంత్రివర్గం సూచనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందేనని కోర్టు ఈ సందర్భంగా తేల్చిచెప్పింది.

అంబేడ్కర్‌ వ్యాఖ్యను ఉటంకించిన సుప్రీం

గవర్నర్‌ రవికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వెలువరించడానికి ముందు ధర్మాసనం.. ‘రాజ్యాంగం ఎంత ప్రయోజనకరమైనదైనా, దానిని అమలు చేసేవారు మంచివారు కాకపోతే, అది చెడ్డదే అవుతుంది’ అన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ సూక్తిని ఉటంకించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 10 బిల్లులపై గవర్నర్‌ రవి తీసుకున్న చర్యలు నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాక, ఘోరతదప్పిదమని చెప్పడం తప్ప తమకు మరో మార్గం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పాలనా వ్యవహారాల్లో గవర్నర్‌ అప్రమత్తంగా వ్యవహరించాలి తప్ప అడ్డంకి కాకూడదని తేల్చిచెప్పింది.

ఇకపై సీఎం స్టాలినే వర్సిటీలకు చాన్స్‌లర్‌

సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై డీఎంకే సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రే చాన్స్‌లర్‌గా వ్యవహరించేలా శాసనసభలో ఆమోదించిన బిల్లుకు కూడా ధర్మాసనం ఆమోదం తెలిపిన నేపథ్యంలో.. గవర్నర్‌ రవి చాన్స్‌లర్‌ పదవిని కోల్పోయారు. ఇకపై సీఎం స్టాలినే చాన్స్‌లర్‌గా వ్యవహరించి.. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల వీసీల నియామకాలు చేస్తారు’’ అని ఆయన వివరించారు.


గవర్నర్‌ ఎలా ఉండాలంటే..

గవర్నర్‌ ప్రవర్తన ఎలా ఉండాలనే అంశంపై సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.

గవర్నర్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి వ్యవహరించాలి.

రాష్ట్ర ప్రభుత్వంతో రాజకీయంగా వ్యవహరించకుండా, ప్రభుత్వ సన్నిహితుడిగా వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఎన్నికైన ప్రభుత్వానికి అడ్డుగోడలా వ్యవహరించకూడదు.

ఎల్లప్పుడూ రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలి. తాను చేసిన ప్రమాణస్వీకారానికి కట్టుబడి పనిచేయాలి.

తాను తీసుకునే చర్యలు జనామోదానికి దగ్గరగా ఉన్నాయా, రాజ్యాంగం ప్రకారం ఉన్నాయా అనే స్వీయపరిశీలన చేసుకోవాలి.


తీర్పు చరిత్రాత్మకం: స్టాలిన్‌

రాష్ట్ర అసెంబ్లీ రూపొందించిన బిల్లుల్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం సరికాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చరిత్రాత్మక తీర్పుగా తమిళనాడు సీఎం స్టాలిన్‌ అభివర్ణించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో ఉండగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. దీని గురించి ఆయన సంతోషంగా సభకు సమాచారం అందించారు. ఈ తీర్పు తమిళనాడుకు మాత్రమే కాక.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ దక్కిన విజయమని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, సీనియర్‌ నేత ఆర్‌ఎస్‌ భారతి అందరికీ మిఠాయిలు పంచుతూ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. తన వివాదాస్పద వ్యవహారశైలితో సుప్రీంకోర్టు చేత అక్షింతలు వేయించుకున్న గవర్నర్‌ రవి తక్షణమే ఆ పదవికి రాజీనామా చేసి, రాజ్‌భవన్‌ను వీడాలని డీఎంకేతో పాటు దాని మిత్రపక్షాలు డిమాండ్‌ చేశాయి. రవికి ఏమాత్రం ఆత్మగౌరవం వున్నా, తక్షణమే రాష్ట్రాన్ని వీడివెళ్లాలని డీఎంకే, సీపీఎం డిమాండ్‌ చేశాయి. సుప్రీం తీర్పు బీజేపీ పాలకులకు చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్‌ అభివర్ణించగా, అన్ని రాష్ట్రాలకూ అనుకూలమైన తీర్పు అని సీపీఐ పేర్కొంది. గవర్నర్ల ద్వారా రాజ్యాన్ని నడపాలనుకుంటున్న బీజేపీ పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని డీపీఐ కటువుగా వ్యాఖ్యానించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Updated Date - Apr 09 , 2025 | 02:50 AM