Share News

Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:23 AM

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి.

Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!

నిధులిచ్చి బలోపేతం చేయాలి

ఈపీఎఫ్‌ కనీస పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు కార్మిక సంఘాల వినతి

న్యూఢిల్లీ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. ఈ కర్మాగారంతో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా విక్రయించవద్దని.. సాధ్యమైనంత మేరకు వాటికి నిధులు కేటాయించి బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు సన్నాహకంగా నిర్వహించే ప్రి-బడ్జెట్‌ సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సోమవారం 11 కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. సంఘ్‌ పరివార్‌ అనుబంధ సంస్థ అయిన బీఎంఎస్‌ ప్రతినిధి పవన్‌కుమార్‌ విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పింఛను పథకాన్ని రద్దు చేసి పాత పింఛను పథకాన్నే (ఓపీఎస్‌) పునరుద్ధరించాలని సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఇళ్లలో పనిచేసేవారి డేటా సేకరించి వారికి సామాజిక భద్రత కల్పించే విషయం పరిశీలిస్తామని నిర్మల హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈపీఎఫ్‌ కనీస పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని, ఐటీ మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, ‘గిగ్‌’ కార్మికులకు కనీస వేతనాలు కల్పించాలని సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

Updated Date - Jan 07 , 2025 | 05:29 AM