Food Content Creator: హలో అమ్మా!
ABN , Publish Date - Apr 09 , 2025 | 01:51 AM
పెళ్లైన తర్వాత తల్లి వంటల రుచి మిస్సైన అర్పిత దాస్, తల్లి సూచనలతో సంప్రదాయ వంటల్లో నిపుణత సాధించారు. ఇప్పుడు ఫుడ్ కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాలో వన్ మిలియన్ ఫాలోవర్స్ లక్ష్యంగా దూసుకుపోతున్నారు.

పెళ్లయ్యాక అమ్మ చేతి రుచులకు దూరమైన ఓ అమ్మాయి... తల్లి సూచనలతో సంప్రదాయ వంటకాల తయారీలో నిష్ణాతురాలయ్యారు. ఫుడ్ కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. ఏడాదిన్నర కాలంలో మూడున్నర లక్షలకు పైగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న అర్పిత దాస్ ప్రయాణం గురించి, ప్రయోగాల గురించి ఆమె మాటల్లోనే...
‘‘కొత్త కాపురం మొదలుపెట్టాక... ప్రతి అమ్మాయి మిస్ అయ్యే వాటిలో ప్రధానమైనది... అమ్మ చేతి వంట. ఇల్లాలుగా వంటిల్లు పూర్తిగా తన చేతుల్లోకి వచ్చేస్తుంది. వంటలో ఎంతో కొంత అనుభవం ఉన్నా... ‘ఏది చెయ్యాలి? ఎలా చెయ్యాలి?’ అనేది ఎప్పుడూ ప్రశ్నే. అందుకే ‘హలో అమ్మా!’ అంటూ తల్లికి కాల్ చేసి, ఇంటి వంటకాల తయారీ గురించి సందేహాలను అడగడం దాదాపు రోజూ జరుగుతూనే ఉంటుంది. అందుకు నేను మినహాయింపు కాదు.
అందుకే ధైర్యం చేశాను...
మాది పశ్చిమబెంగాల్‌లోని హౌరాకు చెందిన జమీందారీ కుటుంబం. సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరిగాను. సృజనాత్మకంగా ఏదో చెయ్యాలనే తాపత్రయం నాకు చిన్నప్పటి నుంచీ ఉండేది. ‘బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్’ (బిఎ్‌ఫఎ) పూర్తి చేశాను. పెయింటింగ్స్ వేసేదాన్ని, డిజైనింగ్ చేసేదాన్ని, కథలు రాసేదాన్ని. గొప్ప జీవిత లక్ష్యాలేవీ లేకుండా... కుటుంబ సభ్యులతో, స్నేహితులతో రోజుల్ని సరదాగా గడిపేసేదాన్ని. అలాంటి నేను.... సింగపూర్‌లో డాక్టర్‌గా పని చేస్తున్న సౌమిక్‌తో పెళ్ళయ్యాక... పూర్తిగా భిన్నమైన ప్రపంచంలోకి అడుగు పెట్టాను. మిగిలినవన్నీ బాగానే ఉన్నా... నా పుట్టింటి రుచులకు దూరమయ్యాననే అసంతృప్తి ఉండేది. హౌరాలోని మా ఇంట్లో ఎంతోమంది పనివారు ఉండేవారు. కానీ వంట మాత్రం అమ్మే చేసేది. అమ్మ ఏది చేసినా బ్రహ్మాండంగా ఉండేది. ఏది అడిగినా విసుక్కోకుండా చేసి పెట్టేది. సింగపూర్‌లో అది ఎలా సాధ్యమవుతుంది? రోజూ అమ్మకు వీడియో కాల్ చేసి, ఆమె చెప్పిన వంట పద్ధతులు అనుసరించేదాన్ని. ఆ వంటకాలు నా భర్తకు కూడా బాగా నచ్చాయి. తీరిక సమయాల్లో కొన్ని యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు... సంప్రదాయికమైన బెంగాలీ వంటకాల గురించి సాధికారికంగా వివరించేవి పెద్దగా కనిపించలేదు.
అమ్మ చెప్పే రెసిపీలతో వీడియోలు చేయాలనిపించింది. అంతకుముందు నా పర్యాటక అనుభవాలను, పెయింటింగ్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నాను. వీడియో ఎడిటింగ్ తెలుసు. కాబట్టి ధైర్యం చేశాను. అందరూ చేసుకోగలిగే పద్ధతిలో ఫిష్ ఫ్రై చేసి... ఫేస్‌బుక్‌లో ఉంచాను. నా కుటుంబం, పరిచయస్తులు మాత్రమే దాన్ని చూస్తారనుకున్నాను. కానీ రాత్రికి రాత్రి అది వైరల్ అయింది. కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇది నేను ఊహించలేదు. అప్పుడే ఫుడ్ కంటెంట్ క్రియేటర్‌గా మారాలనే ఆలోచన వచ్చింది. ‘ఇక తగ్గేదిలే’ అనుకున్నా.
మొక్కుబడిగా కాకుండా...
అప్పటి నుంచి సంప్రదాయికమైన బెంగాలీ వంటకాలు, ఇంట్లో సులువుగా వండుకోగలిగే పదార్థాలు... ఇంకా చాలా వాటిని తయారు చేసి ‘వీకెండ్ ఫ్లేవర్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించాను. ఒక్కొక్క పోస్ట్ పెడుతూ ఉంటే... వాటికి వీక్షకుల నుంచి వచ్చిన స్పందన నాలో సంతోషంతో పాటు ఉద్వేగాన్ని కూడా కలిగించింది. ‘ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం. అవి ఎలా చెయ్యాలో మీరు చూపిస్తూ ఉంటే... వెంటనే ట్రై చేసేద్దామనిపిస్తోంది’ అని కొందరు... ‘ఆ వంటకం ఎలా చెయ్యాలో చెప్తారా’ అని మరికొందరు, ‘పేరు గుర్తు లేదు కానీ... ఈ దినుసులతో చేస్తారని మాత్రం తెలుసు. అదేమిటో చెప్తారా, ప్లీజ్?’ అని ఇంకొందరు చెబుతూ ఉంటే... రెట్టించిన ఉత్సాహంతో, అమ్మ మార్గదర్శకత్వంతో వరుసగా వీడియోలు చేశాను. కనీసం వారానికి ఒక వీడియో పోస్ట్ చెయ్యాలనేది నియమంగా పెట్టుకున్నాను. సంప్రదాయ వంటకాలకు ఆధునికమైన మెరుగులు దిద్దడం, ఇతర ప్రాంతాలకు చెందిన వంటకాలను బెంగాలీ పద్ధతిలో చేయడం, పిజ్జాలు, బర్గర్స్ లాంటి వాటిలో పాత రుచుల్ని మేళవించడం... ఇలా పలు ప్రయోగాలు చేస్తున్నాను.
అమ్మ చేసిన వంటల తయారీ గురించి ఆమెను అడుగుతున్నట్టు... నా వీడియోలన్నీ ‘హలో అమ్మా!’ అని ప్రారంభమవుతాయి. ఇది వీక్షకులందరికీ నచ్చింది. ఏదో మొక్కుబడిగా చెబుతున్నట్టు కాకుండా... చూస్తున్నవారికి ఆకట్టుకొనేలా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. రచయిత్రిగా నాకున్న కాస్త అనుభవం దీనికి పనికొస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మూడున్నర లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నన్ను జనం గుర్తుపట్టి పలకరిస్తున్నారు. నేను ఎన్నడూ ఊహించని ఈ ప్రయాణం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. ఆహారం కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు. దాని వెనుక ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. భావోద్వేగాలుంటాయి. అది మనుషుల్ని దగ్గర చేస్తుంది. నా కంటెంట్‌ను చూసేవారు తమ ఇంట్లో తిన్న పాత రుచుల్ని గుర్తు తెచ్చుకుంటే... నా ప్రయత్నం సఫలమైనట్టే.’’
ఇవి కూడా చదవండి..
Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు
Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం
For National News And Telugu News