Bhanu Sureshbabu: మత్తు వదిలిస్తున్నారు
ABN, Publish Date - Jan 06 , 2025 | 04:28 AM
ఇంటి యజమాని మద్యానికి బానిసైతే ఆ కుటుంబం అనుభవించే బాధ వర్ణనాతీతం.. అలాంటి నరకాన్ని ఎన్నో ఏళ్ళు అనుభవించారు చెన్నైకి చెందిన భాను సురే్‌షబాబు.
ఇంటి యజమాని మద్యానికి బానిసైతే ఆ కుటుంబం అనుభవించే బాధ వర్ణనాతీతం.. అలాంటి నరకాన్ని ఎన్నో ఏళ్ళు అనుభవించారు చెన్నైకి చెందిన భాను సురే్‌షబాబు. కష్టనష్టాలు భరించి, ఓర్పుతో, నేర్పుతో తన భర్తను మార్చుకున్నారు. తన దుస్థితి మరే మహిళా అనుభవించకూడదనే ఆలోచనతో... డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి... వందలాదిమందికి కొత్త జీవితాన్ని దిస్తున్నారు. స్ఫూర్తిమంతమైన భాను జీవన ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...
‘‘మావారు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేసేవారు. చీఫ్ మేనేజర్‌గా రిటైరయ్యారు. అయితే మా పెళ్లయిన కొత్తలో ఆయన రేయింబవళ్లు తాగేవారు. ఆయనవల్ల నాతో పాటు మొత్తం మా ఉమ్మడి కుటుంబంలోని 20 మంది సమస్యలు ఎదుర్కోవాల్సివచ్చింది. సరిగ్గా ఆఫీసుకు వెళ్లేవారు కాదు. దాంతో ఉద్యోగం నుంచి తీసేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. నేను వారిని కాళ్లా వేళ్లా పడి బతిమాలితే వదిలేశారు. అలా 1985-94 మధ్య నరకం అనుభవించాను. ఆయనను ఎలాగైనా బాగు చేసుకుందామని ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఎన్నో ఆలయాలకు వెళ్లాను. వ్రతాలు చేశాను. కొంతమంది మాటలతో మతం మార్చుకొనేందుకూ సిద్ధమయ్యాను. అవేవీ ఫలించలేదు.
జీవితం మీద విరక్తి కలిగేది...
చివరకు తిరువాన్మియూరు టీటీకే హాస్పిటల్లో ఒక డి-అడిక్షన్ చికిత్సా కేంద్రం ఉందని తెలిసి, మావారిని చేర్పించాను.. అక్కడ మద్యం బానిసలతో పాటు వారి కుటుంబీకుల్లో ఒకరు తోడు ఉండాలి. దాంతో మావారి వెంట నేనే వున్నాను. అప్పట్లో చెన్నై మ్తొం మీద అలాంటి కేంద్రం అదొక్కటే ఉండేది. ట్రీట్‌మెంట్ తరువాత ఒక నెల బావుండేవారు. తరువాత మళ్లీ పాత పద్ధతే. దాంతో నాకు జీవితం మీద విరక్తి కలిగేది. ఆ కేంద్రంలో చికిత్స పొందుతున్నవారి కుటుంబ సభ్యులకు కూడా సైకో థెరపీ, కౌన్సెలింగ్ ఇచ్చేవారు. దాంతో నాకు కూడా మద్యపాన సమస్య మీద ఎంతో అవగాహన వచ్చింది. చివరికి... సుమారు పదేళ్ల తరువాత మావారిలో మార్పు వచ్చింది. పూర్తిగా మద్యం మానేశారు. అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. ఒక వ్యక్తి చేత మద్యం మానిపించడానికి నేను ఇంత కష్టపడ్డాను. ఇదే సమస్య ఎదుర్కొంటున్న మిగిలిన మహిళల సంగతేమిటి? అందరూ ఇంతగా పోరాడాల్సిందేనా? ఒక వ్యక్తి మద్యపానంలో కూరుకుపోతే, ఆ కుటుంబం మొత్తం నష్టపోవాలా? దేవుడు నాకు చూపించిన మంచిని నలుగురికి పంచాలనుకున్నాను. అదే కేంద్రానికి వెళ్లి బాధితులకు స్వచ్ఛందంగా కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించాను. అవగాహన కల్పించాను. ఆ సెంటర్లో ఒక పెద్దాయన దీనికి సంబంధించి కోర్సు చేస్తే అధికారికంగా కౌన్సెలింగ్ ఇవ్వవచ్చని సూచించారు. అప్పటికే నేను బీఏ హిస్టరీ చేశాను. అప్పటికి నా వయసు 33 ఏళ్లు.. ఎంఏలో చేరే అవకాశం ఉన్నా... కావాలనే బీఏ సైకాలజీలో చేరాను. తరువాత ఎంఏ సైకాలజీ, ఎంఫిల్ చేశాను. డి-అడిక్షన్ సెంటర్‌లో పని చేయడానికి అవసరమైన శిక్షణ పొందాను. అనేక కోర్సులు చేశాను. ఆ తరువాత టీటీకే సెంటర్ వారు ఫ్యామిలీ థెరపిస్ట్, రిహాబిలిటేషన్ కౌన్సెలర్‌గా అవకాశం ఇచ్చారు. అక్కడ ఏడేళ్ల పాటు పని చేశాను. ఆ తరువాత చెన్నై కార్పొరేషన్‌కు చెందిన ‘కెపాక్స్’ అనే కేంద్రంలో చేరాను. అక్కడి నుంచి 15 సంవత్సరాల పాటు వివిధ కేంద్రాల్లో పని చేశాను.
పరిమితులు లేని సేవకోసం...
డి-అడిక్షన్, మద్యపానం, మాదకద్రవ్యాల వ్యసనం తదితర అంశాలపై పని చేశాను. అక్కడ నాకు పరిమితులు ఉండేవి. వాటిని అధిగమించి సేవ చేయడానికి సొంతంగా ఒక స్వచ్ఛంద సంస్థను, దానికి అనుబంధంగా డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని దృఢంగా అనుకున్నాను. ఆ కేంద్ర భవనంలో వార్డులు, ఓపెన్ ఏరియా, థెరపీ సెంటర్, కిచెన్, థియేటర్ హాల్ లాంటివన్నీ ఉండేలా ప్రణాళిక వేసుకున్నాను. దాని గురించి మా వారికి చెబితే ‘‘ఇవన్నీ కావాలంటే కొన్ని కోట్లు కావాలి. మనకంత శక్తి ఎక్కడిది?’’ అన్నారు.. దాంతో మా ఆర్థిక స్థోమత మేరకు పరిమితంగానే పని ప్రారంభించాను. 2005లో ‘కన్సర్న్’ అనే సంస్థను ఏర్పాటు చేశాను. అనంతరం డబుల్-బెడ్‌రూమ్ ఇంటిని అద్దెకు తీసుకొని, అయిదు పడకలతో డి-అడిక్షన్ సెంటర్‌ని ప్రారంభించాం. ఇప్పుడు మాడంబాక్కంలో ఇది నడుస్తోంది. ఈ కేంద్రానికి వచ్చిన వారికి అన్నీ బోధపడేలా చెప్పి, వ్యసనం మాన్పించడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు సామాజిక న్యాయ మంత్రిత్వశాఖతో కలిసి పని చేస్తున్నాం. మా ‘కన్సర్న్’లో ఆహారం, చికిత్స, కౌన్సిలింగ్, మందులు తదితరాలన్నీ ఉచితమే. ఇప్పటి వరకూ 2 వేల మందికి చికిత్స అందించాం.
కుటుంబ మద్దతు అవసరం
మద్యపాన బానిసలకు కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరం. చాలామంది ‘‘ఏం చేసినా ఆయన మారరు’’ అంటూ ఉంటారు. అది తప్పు. అలా అనుకుంటే మా వారు మారేవారా? ఇంతమంది జీవితాలను మేం ప్రభావితం చేయగలిగేవారమా?. కాబట్టి నిరంతరం ప్రయత్నం చేయాల్సిందే. మద్యానికి అలవాటుపడిన వారిని అలాగే వదిలేయకండి. మానసికంగా వారికి దగ్గరవ్వండి, వారి బాగోగులు చూసుకునేందుకు మీరున్నారన్న నమ్మకం కలిగించండి. వారిని ఇలాంటి రిహాబిలిటేషన్ సెంటర్లకు తీసుకువచ్చి చికిత్స చేయించండి. చికిత్స పొందిన తరువాత కూడా ఏడాదిపాటు కుటుంబ సభ్యులు వారిని గమనిస్తూ, అదుపులో ఉంచాలి. ఏడాదిపాటు మద్యం జోలికి పోలేదంటే, ఇక జీవితంలో అటువైపు వెళ్లరు.
ఆ సంతృప్తి మాటల్లో చెప్పలేను...
మాకు ఒకే అబ్బాయి. అతను ఆర్కిటెక్ట్. జీవితంలో స్థిరపడ్డాడు. మాకు ఎలాంటి బరువు బాధ్యతలు లేవు. అందుకే నాలాంటి బాధితుల్ని గట్టెక్కించాలన్న ఉద్దేశంతో ఈ సేవను ఎంచుకున్నాను. మా వారు రిటైరయ్యాక ఆయన కూడా నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఆయన మద్యపానానికి వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. మా దగ్గర చికిత్స పొందిన వారి కుటుంబ సభ్యులు సంతోషంగా మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు కలిగే సంతృప్తిని మాటల్లో చెప్పలేను.’’
డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై
ఫొటోలు: కర్రి శ్రీనివాస్
మమ్మల్ని సంప్రదించాలంటే...
‘‘మా వెబ్‌సైట్ ద్వారా, ‘కన్సర్న్’ హెల్ప్‌లైన్: 044-46865176 ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా సంస్థ గురించి అందరికీ తెలుసు. తమిళనాట ఎవరైనా డి-అడిక్షన్ కేంద్రం పెట్టాలంటే ముందుగా మమ్మల్నే సంప్రదిస్తారు. బాధితుడికి చికిత్స పూర్తయిన తరువాత కొన్ని కుటుంబాలు వారిని తీసుకువెళ్లడానికి ఇష్టపడవు. అలాంటివారికి మేమే నెల రోజుల పాటు బస కల్పిస్తాం. ఆ నెల రోజుల్లో వారు ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాల్సి ఉంటుంది.’’
చికిత్స ఎలా ఉంటుందంటే...
ఇష్టపూర్వకంగా వచ్చిన వారికి మాత్రమే మేము చికిత్చ చేస్తాం. ఆ మేరకు వాళ్లు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ముందుగా వారి మానసిక స్థితిని అంచనా వేస్తాం. కౌన్సెలింగ్ తీసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరించినవారిని మాత్రమే చేర్చుకుంటాం. వారికి 25 నుంచి 30 రోజుల చికిత్స ఉంటుంది. రోజూ ఉదయాన్నే ‘కాగ్నెటిక్ బిహేవియర్ థెరపీ’ ఇస్తాం. ఆనందకర క్షణాల్లో తాగడం, బాధాకర సమయాల్లో తాగడం, డిప్రెషన్‌లో తాగడం, ఒత్తిడిని జయించేకోసమంటూ తాగడం లాంటి అంశాలను వారితో చర్చిస్తాం. మధ్యాహ్నం వాటికి అనుబంధమైన ఒక యాక్టివిటీ జరుగుతుంది. తరువాత గ్రూప్ థెరపీ వుంటుంది. ఆ థెరపీలో వారంతా మనసులోని మాటను బయటపెడతారు. విడిగా కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు... కౌన్సెలర్ వారు సమస్యకు పరిష్కారం చెబుతారు. మా దగ్గర 15 మంది ఉండడానికి అవకాశం వుంది. అంతకు మించి ఎక్కువమందిని తీసుకోం. మా కేంద్రంలో ఒక డాక్టర్, నర్సు, కౌన్సిలర్లు, సహాయకులు, వంట మనుషులు... అందరూ కలిపి 23 మంది సిబ్బంది వుంటారు. ఆంధ్రా, తెలంగాణ నుంచి కూడా చాలామంది ఇక్కడకు వస్తుంటారు.
‘మా స్వస్థలం చెన్నై. మా అత్తగారి పూర్వీకులు ఆంధ్రా సరిహద్దు నుంచి వచ్చి చెన్నైలోనే స్థిరపడ్డారు. మేం తెలుగునాయుళ్లం. ఇంట్లో తెలుగే మాట్లాడతాం. మా పిల్లలు, మనవళ్లు అందరూ ఇంట్లో తెలుగు మాట్లాడాల్సిందే. నో డాడీ.. నో మమ్మీ... ‘అమ్మా-నాన్నా’ అని పిలవాల్సిందే. మన అమ్మ భాషను మరచిపోతే అమ్మను కూడా మరచిపోయినట్లే. అందుకే ఒక్కొక్కరికి నాలుగైదు భాషలు వచ్చినా అందరం మాట్లాడేది తెలుగులోనే.’’
Updated Date - Jan 06 , 2025 | 04:30 AM