Winter health : ఎముకల నొప్పులా?
ABN, Publish Date - Jan 09 , 2025 | 05:21 AM
శీతాకాలంలో విపరీతమైన చలివల్ల కొందరికి కీళ్లు, కండరాలు పట్టేస్తుంటాయి. ఎముకల నొప్పి బాధిస్తుంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే శరీరానికి తగినంత కాల్షియం అందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
శీతాకాలంలో విపరీతమైన చలివల్ల కొందరికి కీళ్లు, కండరాలు పట్టేస్తుంటాయి. ఎముకల నొప్పి బాధిస్తుంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే శరీరానికి తగినంత కాల్షియం అందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, ఛీజ్‌లలో అధికంగా కాల్షియం కొద్ది మోతాదులో డి విటమిన్ ఉంటాయి. వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకుంటే ఎముకలు బలోపేతమవుతాయి. బోలు ఎముకల వ్యాధి, తుంటి పగుళ్లు రావు.
బీన్స్: వీటిలో ప్రోటీన్లు, పీచు పదార్థం, కాల్షియం అధికంగా ఉంటాయి. వీటిని కూర లేదా సలాడ్ రూపంలో తరచూ తినడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. ఎముకలు పెళుసుబారకుండా బలంగా మారతాయి. బీన్స్‌లో కె విటమిన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం పేరుకోకుండా పూర్తిగా వినియోగమయ్యేలా చేస్తుంది. చలికాలంలో ప్రతిరోజూ అర కప్పు బీన్స్ తినడం మంచిది.
సాల్మన్ చేపలు: వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఎముకల్లో నొప్పిని, మంటను తగ్గిస్తాయి. సాల్మన్ చేపల్లో ఉండే డి విటమిన్ ఎముకలను పుష్టిగా మారుస్తుంది. వారానికి ఒకసారైనా వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
అవకాడో: అవకాడో తినడం వల్ల ఎముకల్లో వాపు, మంట తగ్గుతాయి. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎముకల్లో ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడకుండా అడ్డుకుంటాయి. అవకాడోలోని కె విటమిన్ ఎముకలు బిగుసుకోకుండా సులభంగా కదిలేలా చేస్తుంది.
టమాటా: టమాటాలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఎముకల చుట్టూ ఉన్న కణజాలాన్ని కాపాడుతుంది. ఎముకలకు రక్షణగా నిలుస్తుంది. ్డటమాటాను రోజూ తినడం వల్ల శరీరానికి కావాల్సిన కె, డి విటమిన్లతో పాటు కాల్షియం, పొటాషియం లాంటి పోషకాలు అంది ఎముకలు దృఢంగా మారతాయి.
నువ్వులు: వీటిలో రాగి, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవన్నీ ఎముకల వ్యాధులు రాకుండా కాపాడతాయి. మహిళలు తరచూ నువ్వులు తింటూ ఉంటే అకారణంగా ఎముకలు విరగడం, ఎముకల పగుళ్లు, ఎముకల నొప్పి వంటి సమస్యలు రావు.
బాదం: బాదం పప్పులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇ విటమిన్, పీచు పదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎముకలు క్షీణించకుండా కాపాడతాయి. ప్రతిరోజూ అయిదు నుంచి ఎనిమిది బాదం పప్పులు తింటూ ఉంటే ఎముకలు పట్టేయడం లాంటి సమస్యలు రావు.
Updated Date - Jan 09 , 2025 | 05:21 AM