భక్తి చైతన్యమూర్తి
ABN, Publish Date - Mar 14 , 2025 | 02:59 AM
మానవులు మంచి దారిలో పయనించాలి. ధర్మబద్ధంగా జీవించాలి. అందుకు మార్గదర్శకులుగా నిలిచిన మహానుభావుల్లో ప్రముఖుడు శ్రీ చైతన్య మహాప్రభువు. సుమారు 500 ఏళ్ళ...
మానవులు మంచి దారిలో పయనించాలి. ధర్మబద్ధంగా జీవించాలి. అందుకు మార్గదర్శకులుగా నిలిచిన మహానుభావుల్లో ప్రముఖుడు శ్రీ చైతన్య మహాప్రభువు. సుమారు 500 ఏళ్ళ క్రితం పశ్చిమ బెంగాల్‌లోని నవద్వీపంలో జన్మించిన ఆయన భగవన్నామ సంకీర్తనమనే మార్గాన్ని ముక్తి మార్గంగా బోధించారు. కలియుగంలో సాక్షాత్తూ శ్రీకృష్ణుడి అవతారంగా ఆయనను భావిస్తారు. ప్రామాణికమైన శాస్త్రాధారాలు లేనిదే ఎవరినీ భగవంతుడి అవతారంగా అంగీకరించకూడదు. ప్రస్తుత కలియుగంలో భగవంతుడు అవతరించడం అనేది చాలా విశిష్టమైన విషయమే. అయితే ఈ అవతార స్వరూపం గురించిన పరిజ్ఞానం లోకంలో చాలా అరుదు. అటువంటి అవతారమూర్తి అయిన శ్రీ చైతన్య మహా ప్రభువు గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయనను ‘గౌర హరి’, ‘గౌరంగ’, ‘గౌర సుందర’ అని కూడా సంబోధిస్తారు.
శ్రీ చైతన్యుల అవతార ప్రస్తావన ‘శ్రీమద్భాగవతం’, ‘మహా భారతం’, ‘వాయుపురాణం’, ‘నృసింహ పురాణం’, ‘చైతన్యోపనిషత్తు’ (అధర్వవేదం) తదితర గ్రంథాలలో ఉంది. ‘‘కలియుగంలో ఆవిర్భవించి, సదా కృష్ణ నామ గానాన్ని చేసే భగవదవతార మూర్తిని మేధో సంపత్తి ఉన్న మనుజులు సామూహిక సంకీర్తనలతో ఆరాధిస్తారు. ఆయనది నలుపు రంగు కాకపోయినా సాక్షాత్తూ శ్రీకృష్ణుడే. ఆయన సంకీర్తనోద్యమాన్ని స్థాపించడానికి తన అనుచరులతో కలిసి భువిపై అవతరిస్తారు’’ అని ‘శ్రీమద్భాగవతం’లో ఉంది. అలాగే ‘శ్రీ విష్ణు సహస్రనామం’లోని ‘సువర్ణ వర్ణో హేమాంగో...’ అనే శ్లోకం ‘‘మేలిమి బంగారు వర్ణఛాయతో అవతరించి, ముందుగా గృహస్తుడిగా పలు లీలలు చేస్తారు. అత్యంత సుందరమైన శరీర అవయవాలపై చందన లేపనంతో... సువర్ణ శోభతో ప్రకాశిస్తారు. ఆ తరువాత సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించి, నిష్టాపరుడై, శాంత స్వభావంతో మెలగుతారు. భక్తి, సామరస్యాలకు తానే ఒక దివ్య సన్నిధానం అవుతారు’’ అని చెబుతోంది. దీనికి శ్రీల ప్రభుపాదులు వివరణనిస్తూ... ‘‘శ్రీల బలదేవ విద్యాభూషణులు ‘నామార్థ సుధ’ అనే పేరుతో ‘శ్రీవిష్ణు సహస్రనామా’నికి భాష్యం రాశారు. పై శ్లోకం ఆధారంగా, ఉపనిషత్తులే సాక్ష్యంగా, ఆధారంగా శ్రీ చైతన్య మహాప్రభువు దేవాదిదేవుని అవతారమని నిర్ధారించారు’’ అంటూ సవివరంగా తెలిపారు. అలా సాక్షాత్తూ శ్రీకృష్ణుడి అవతారమైన శ్రీ చైతన్య మహాప్రభువు... ఫాల్గుణ పౌర్ణమి రోజున జన్మించారు. కలియుగంలో భక్తులు ముక్తి పొందడం కోసం... హరినామ సంకీర్తనను బోధిస్తూ... ‘హరే కృష’్ణ మహా మంత్రాన్ని మనకు అందించారు. ఆయన పుట్టిన రోజైన ఫాల్గుణ పౌర్ణమి నాడు చంద్రోదయం వరకూ ఉపవాసం, తరువాత ధాన్యాలు లేని ఆహారం తీసుకోవడం, వీలైనన్ని సార్లు ‘హరేకృష్ణ’ మంత్రాన్ని, శ్రీకృష్ణుడి పవిత్ర నామాలను జపించడం, సమీపంలోని హరేకృష్ణ ఆలయ సందర్శన, హరినామ సంకీర్తనల్లో పాల్గొనడం, శ్రీమద్భాగవత పురాణ పఠనాన్ని ప్రారంభించడం, గోపోషణకు దానం చేయడం, అన్నదానం లాంటివి చేయడం వల్ల శ్రీ చైతన్య మహాప్రభువు అనుగ్రహం లభిస్తుంది.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
ఈ వార్తలు కూడా చదవండి:
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..
Updated Date - Mar 14 , 2025 | 02:59 AM