అఖండమైన ఆనందం కోసం
ABN, Publish Date - Mar 14 , 2025 | 03:06 AM
హోలీ అంటేనే ఆనందం, ఆహ్లాదం కలగలిసిన ఉత్సవం. సామాజికమైన అంతరాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకొనే సామూహిక వేడుక. భారతీయ సంప్రదాయంలో అనాదిగా భాగమైన ఈ రంగుల సంబరానికి....
సహజయోగ
హోలీ అంటేనే ఆనందం, ఆహ్లాదం కలగలిసిన ఉత్సవం. సామాజికమైన అంతరాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకొనే సామూహిక వేడుక. భారతీయ సంప్రదాయంలో అనాదిగా భాగమైన ఈ రంగుల సంబరానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది.
‘‘హోలీ పండుగ అంటే హోలికా దహనం జరిగిన రోజు. దుష్టశక్తులు దహనమైన రోజు. నిజమైన యోగులు భగవంతుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన భక్తులు జీవితంలో ఎటువంటి ప్రమాదం నుంచి అయినా బయపడగలరు. సంపూర్ణ రక్షణ పొందగలరు. ఎటువంటి దుష్టశక్తీ వారిని ఏమీ చేయలేదు. దీనికి ప్రహ్లాదుడి కథే తార్కాణం’’ అని పేర్కొంటూ... వివిధ సందర్భాల్లో హోలీ పండుగ ప్రాశస్త్యం గురించి శ్రీమాతాజీ నిర్మలాదేవి వెల్లడించారు.
ఈ వేడుక ఎలా ప్రారంభమయిందో తెలిపే ఒక కథ ఉంది దాని ప్రకారం... ప్రహ్లాదుణ్ణి అతని తండ్రి హిరణ్యకశిపుడు అనేక విధాలుగా హింసించేవాడు. అతణ్ణి చంపాలని హోలిక అనే రాక్షసిని హిరణ్యకశిపుడు ఆదేశించాడు. హోలికకు ఉన్న వరం వల్ల అగ్ని ఆమెను ఏమీ చేయలేదు. కాబట్టి బాలుడైన ప్రహ్లాదుణ్ణి పట్టుకొని, మండుతున్న చితిపై కూర్చోవాలని హోలికకు హిరణ్యకశిపుడు చెప్పాడు. అయితే ఆశ్చర్యకరంగా హోలిక అగ్నికి ఆహుతైపోయింది. ప్రహ్లాదుడు కనీసం చిన్న గాయమైనా కాకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు. క్రూరత్వం ఎన్నడూ క్షమార్హం కాదని నిరూపించే పౌరాణిక ఘట్టం ఇది. కాగా. ప్రహ్లాదుడితో కలిసి చితి మీద హోలిక కూర్చున్నప్పుడు... అగ్నిదేవుడికి ఒక సందిగ్ధం ఎదురయింది. ‘ఆమెకు మరణం ఏ రూపంలోనైనా రావచ్చు కాని అగ్ని ద్వారా కాదనే వరం ఉంది. ఆమెను దగ్ధం చెయ్యనని నేను వాగ్దానం చేశాను. కానీ ఇటువైపు చూస్తే ప్రహ్లాదుడున్నాడు. అతను అమాయకత్వంతో నిండినవాడు. దైవాంశతో జన్మించినవాడు. అతడు నా శక్తులకు అతీతుడు. అతణ్ణి ఎలా దహించగలను? ఇప్పుడేంచెయ్యాలి? అని అగ్నిదేవుడు కలవరపడ్డాడు. ఇది కర్తవ్యానికి, ధర్మానికి మధ్య ఏర్పడిన సందిగ్ధత. ఇలాంటి పరిస్థితుల్లో కర్తవ్యం కన్నా ధర్మం గొప్పది. ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు... చిన్న లక్ష్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. అగ్నిదేవుడు కూడా అదే చేశాడు. హోలికను దగ్ధం చేసి, ప్రహ్లాదుణ్ణి క్షేమంగా విడిచిపెట్టాడు.
మీరు మీ ఆత్మ వైపు మరలండి...
హోలీ పండుగ శ్రీకృష్ణుడి కాలంలో ఆరంభమయిందని కూడా అంటారు. ‘‘శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ధర్మాచరణ ఎంతో కఠినంగా ఉండేది. చాలా ఆచారాలు పాటించాల్సి వచ్చేది. దీనివల్ల ఇబ్బందిగా కూడా ఉండేది. ఒక చోట కాకుండా మరో చోట దీపం వెలిగిస్తే భగవంతుడు కోపిస్తాడు. ఎడమచేత్తో ఏదైనా చేస్తే మంచిది కాదు... ఇలాంటి విశ్వాసాలు చాలా ఉండేవి. దీనివల్ల ప్రజలు క్రమంగా ఛాందసులుగా మారారు. ప్రతిదీ మూఢంగా, అంధ విశ్వాసంతో ఆచరించడం ప్రారంభించారు. వారు చాలా కోపిష్టులుగా మారారు. వారిలో ఆనందం, ఉత్సాహం మాయమైపోయాయి. అతి ధర్మాచరణ వల్ల మనుషుల్లో కరువైన ఆనందాన్ని తిరిగి తేవాలనే ఆలోచనతో... శ్రీకృష్ణుడు రంగులతో హోలీ ఆడే సంప్రదాయాన్ని ప్రారంభించాడు. ‘‘ఇప్పుడు మీరు మీ ఆత్మ వైపు మరలండి. చిన్న చిన్న విషయాలలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. మీ దృష్టిని ఉన్నతమైన విషయాల మీద మరల్చాలి’’ అని చెప్పాడు. మన సూక్ష్మ శరీరంలో కుడివైపు హృదయ చక్రంలో శ్రీరాముడు, గొంతు దగ్గర ఉండే విశుద్ధ చక్రంలో శ్రీకృష్ణుడు ఉంటారు. సామూహికత, ఆనందం, సంఘ శక్తి... ఇవన్నీ విశుద్ధ చక్రం ఆశీస్సులే. అలాగే మనలోని సూక్ష్మ శరీరంలో ఉండే ఏడు శక్తి కేంద్రాలు భిన్నమైన రంగులను కలిగి ఉంటాయి. మూలాధార చక్రం ఎర్రగా, స్వాధిష్ఠాన చక్రం పసుపుగా, మణిపూరక చక్రం ఆకుపచ్చగా, అనాహత చక్రం గులాబీ రంగులో, విశుద్ధ చక్రం నీలంగా, ఆజ్ఞా చక్రం తెల్లగా, సహస్రార చక్రం సప్తవర్ణాల సమ్మిళితంగా ఉంటాయి. ‘‘ఆ చక్రాల తాలూకు అన్ని రంగులను మీమీద చల్లుకోండి. ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో ఆడుకోండి. అంత గంభీరంగా ఉండాల్సిన అవసరం ఏమిటి? మీరు భగవంతుణ్ణి చేరినట్టయితే సంతోషంగా ఎందుకులేరు?’’ అంటూ శ్రీకృష్ణుడు హోలీని ప్రోత్సహించాడు’’ అని నిర్మలాదేవి వెల్లడించారు.
సభ్యతగా, మర్యాదగా...
కాబట్టి హోలికా దహనం తరువాత జరుపుకొనే హోలీ... దీపావళిలా ఉండాలి. దాని ఆనందం అఖండంగా ఉండాలి. సాధారణ రోజుల్లో ఆర్థిక స్థాయిలు, హోదాల వల్ల కలవని వారు కూడా హోలీ రోజున కలిసిపోతారు. యజమానులు, సేవకులు, బీదా గొప్పా అనే తేడాలు లేకుండా అందరూ ఈ రంగుల ఉత్సవంలో సంతోషంగా పాల్గొంటారు. మన దేశంలో హోలీ అనే ఈ సామాజిక, సామూహిక వేడుక ఈ విధంగానే ప్రారంభమయింది. కాలక్రమేణా ఈ ఉత్సవాలలోనూ పెడధోరణులు చోటుచేసుకున్నాయి. ‘సభ్యత, మర్యాద ఉండేదే అసలైన వేడుక’ అని గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సహజయోగులు హోలీ పండుగను కామ దహనానికి ప్రతీకగా జరుపుకొంటారు. అగ్ని దేవతను హోమ రూపంలో పూజిస్తారు.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఈ వార్తలు కూడా చదవండి:
MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..
Fish and Mutton prices: బర్డ్ ఫ్లూ దెబ్బకు కొండెక్కిన మటన్, చేపల రేట్లు.. పరిస్థితి ఎలా ఉందంటే..
Updated Date - Mar 14 , 2025 | 03:06 AM