Mulangi: ముల్లంగితో రుచి రుచిగా
ABN, Publish Date - Jan 04 , 2025 | 04:23 AM
ముల్లంగిని దక్షిణభారత దేశంలో కన్నా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా తింటారు. శీతాకాలంలో పండే ఈ దుంప చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
ముల్లంగిని దక్షిణభారత దేశంలో కన్నా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా తింటారు. శీతాకాలంలో పండే ఈ దుంప చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఈ వారం ముల్లంగితో చేసే కొన్ని వంటలు నేర్చుకుందాం...
ముల్లంగి కూర
కావాల్సిన పదార్థాలు
ముల్లంగి కోరు- రెండు కప్పులు, తరిగిన టమోటా ముక్కలు- ఒక కప్పు, జీలకర్ర- ఒక చెంచా, ఆవాలు- ఒక చెంచా, శనగపప్పు- ఒక చెంచా, మినపప్పు- ఒక చెంచా, కరివేపాకు- ఒక చెంచా, తరిగిన కొత్తిమీర- ఒక చెంచా, పల్లిల పొడి- నాలుగు చెంచాలు, నువ్వులు- రెండు చెంచాలు, పచ్చిమిరపకాయ ముక్కలు- ఒక చెంచా, వెల్లుల్లి రెబ్బలు- రెండు, ఇంగువ- తగినంత, ఉప్పు- తగినంత, పసుపు- అరచెంచా, కారం- అర చెంచా, నూనె- నాలుగు చెంచాలు, నీళ్లు- తగినన్ని.
తయారీ విధానం
ఒక మూకుడులో నూనెను వేడి చేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పులను వేయించాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి వేయించాలి.
ఆ తర్వాత టమోటా ముక్కలు, ఇంగువ, కారం కలిపాలి. టమోటా ముక్కలు పచ్చి వాసన పోయే దాకా వేగనివ్వాలి.
ఈ మిశ్రమంలో ముల్లంగి కోరును వేయాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత పల్లీల పొడి, నువ్వులు, ఉప్పు కలపాలి.
మూకుడు మీద నుంచి కిందకు దింపే ముందు కొత్తిమీర వేయాలి.
జాగ్రత్తలు
పచ్చి ముల్లంగికి కొద్దిగా వాసన ఉంటుంది. కానీ ముల్లంగి కోరును వేయిస్తే పోతుంది.
హైబ్రీడ్ టమోటాల కన్నా దేశవాళి టమోటాలను వాడితే బావుంటుంది.
పల్లీల పొడి బదులుగా కొబ్బరి కోరును కూడా వాడవచ్చు.
ముల్లంగి సలాడ్
కావాల్సిన పదార్థాలు:
ముల్లంగి ముక్కలు- ఒక కప్పు, ఉడికించిన బీన్స్- ఒక కప్పు, పళ్ల ముక్కలు- ఒక కప్పు, నిమ్మకాయ రసం- రెండు చెంచాలు, ఆవపిండి- ఒక చెంచా, తేనె- ఒక చెంచా, సోయా సాస్- ఒక చెంచా, మిరియాల పొడి- ఒక చెంచా, ఆవ నూనె- పావు చెంచా, ఉప్పు- తగినంత
తయారీ విధానం
ఒక గిన్నెలో ముల్లంగి ముక్కలు, ఉడికించిన బీన్స్, పళ్లముక్కలను బాగా కలపాలి.
మిశ్రమంలో నిమ్మకాయ రసం, ఆవపిండి, సోయా సాస్ వేసి కలపాలి.
దానిపై మిరయాల పొడి, ఆవ నూనె, ఉప్పు వేసి కలపాలి. ఈ సలాడ్ సూప్‌లో బావుంటుంది.
జాగ్రత్తలు
కొందరు ముల్లంగి ముక్కలను నూనె లేదా నెయ్యిలలో వేయిస్తారు. దీని వల్ల ఈ ముక్కలు దోరగా అవుతాయి.
కొందరు సలాడ్‌లో బూందీ మిక్సర్‌ను కలుపుతారు. దీని వల్ల అదనపు రుచి వస్తుంది.
ముల్లంగి పచ్చడి
కావాల్సిన పదార్థాలు
ముల్లంగి ముక్కలు: ఒక కప్పు, ఎర్ర ఉల్లిపాయ ముక్కలు- అరకప్పు, తెల్ల వెనిగర్: ఒక కప్పు, పంచదార- అర కప్పు, ఆవాలు- ఒక చెంచా, మిరియాల పొడి- ఒక చెంచా, లవంగాలు- ఆరు
తయారీ విధానం
ఒక మూకుడులో తెల్ల వెనిగర్, పంచదార, ఆవాలు, మిరియాల పొడి వేసి- పంచదార కరిగే దాకా వేడిచేయాలి.
ఆ తర్వాత ఆ మిశ్రమంలో ముల్లంగి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఒక నిమిషం తర్వాత దింపేయాలి.
ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్‌లో వేయాలి. దానిలో లవంగాలు వేయాలి.
జాగ్రత్తలు
ముల్లంగి, ఉల్లిపాయ ముక్కలను ఎక్కువ వేడి చేయకూడదు. ఎక్కువ వేడి చేస్తే చెడు వాసన వచ్చే ప్రమాదం ఉంది.
ఈ పచ్చడి బాగా చల్లారిన తర్వాత కానీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇది రెండు వారాల దాకా నిల్వ ఉంటుంది.
Updated Date - Jan 04 , 2025 | 04:23 AM