Sankranti : సహజ సంక్రాంతి
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:30 AM
‘సం-క్రాంతి’ అనే పదంలో ‘సం’ అంటే ‘శుభం’ అని, ‘క్రాంతి’ అంటే ‘పరివర్తన’ లేదా ‘విప్లవం’ అని అర్థం. ‘సంక్రాంతి’ అంటే శుభకరమైన పరివర్తన తెచ్చే రోజు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ‘మకర సంక్రమణం’ అంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది.
‘సం-క్రాంతి’ అనే పదంలో ‘సం’ అంటే ‘శుభం’ అని, ‘క్రాంతి’ అంటే ‘పరివర్తన’ లేదా ‘విప్లవం’ అని అర్థం. ‘సంక్రాంతి’ అంటే శుభకరమైన పరివర్తన తెచ్చే రోజు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ‘మకర సంక్రమణం’ అంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అప్పటివరకూ దక్షిణ దిక్కున ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకొని... ఉత్తర దిక్కులో సంచారం మొదలుపెడతాడు. సూర్యుడి గమనం మారడం వల్ల... వాతావరణంలో మార్పులు వస్తాయి.
సమస్త సృష్టికి ఆధారభూతుడు సూర్య భగవానుడు. ఆయన అనుగ్రహం లేకపోతే మానవాళికి మనుగడ లేదు. తను నిరంతరం మండుతూ సమస్త విశ్వానికి మేలు చేకూరుస్తాడు. ఇతరులకు ఆనందం కలిగిస్తాడు. ఈ గుణాలు మనలో పెంపొందించుకుంటే అహంకారానికి తావుండదు. రాత్రి చీకటి వల్ల మనం నిద్రావస్థలో ఉంటాం. సూర్యుడు ఉదయించాక... ఆయన ప్రకాశం వల్లనే పనులన్నీ జరుగుతాయి. కాబట్టి అన్ని కార్యాలను ప్రభావితం చేసేది సూర్యుడే. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... మిగిలిన పండుగలన్నీ చంద్రుని గమనం ఆధారంగా జరుపుకొంటే... సంక్రాంతిని సూర్య గమనాన్ని పరిగణనలోకి తీసుకొని జరుపుకొంటాం. అందుకే ఇది చాలా ముఖ్యమైన రోజు.
పెద్ద పండుగ
సంక్రాంతి పండుగ సమయానికి ధాన్యం పొలాల నుంచి ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో పొంగిపోతారు. కొత్త బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అలాగే అరిసెలు, చక్కిలాలు లాంటివి తయారు చేస్తారు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేస్తారు, అందుకే ఈ పండుగను అక్కడ ‘పొంగల్’ అని పిలుస్తారు. పంటను ప్రసాదించిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ... తాము తయారు చేసిన వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండగ సందర్భంగా ప్రకృతిని, పశువులను కూడా పూజిస్తారు. మొదటి రోజున భోగీ, రెండో రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ... మొత్తంగా ఇది ప్రధానమైన పండుగ. పల్లెల్లో దీన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ధాన్య లక్ష్మికి స్వాగతం చెప్పడానికి ఇంటి గుమ్మాలను మామిడి కొమ్మలతో, పూల దండలతో, వాకిళ్ళను రంగవల్లులతో, వాటిలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలతో అంలకరిస్తారు. సంక్రాంతి జానపద కళా సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, రంగవల్లుల పోటీలు తదితరాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. మూడో రోజు కనుమ రైతులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటూ ధాన్య రాశులను ఇంటికి తీసుకురావడానికి సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతతో పూజలు జరుపుతారు.
సమతుల్యత ప్రధానం
మానవ చరిత్రలో సంభవించిన అనేక విప్లవాల గురించి మనకు తెలుసు. రాజకీయపరమైనవీ, అసమానతల నిర్మాణం కోసం ఉద్దేశించినవి అయిన ఇలాంటి విప్లవాలతో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు సాధ్యమయ్యాయి. కానీ మానవులు సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఉన్నతి మాత్రం సాధ్యపడలేదు. అది జరగాలంటే మనలో అంతర్గతంగా విప్లవం లేదా పరివర్తన రావాలి. అలాంటి పరివర్తనకు మనలో నిగూఢంగా ఉన్న మాతృశక్తి అయిన కుండలీని శక్తి మనకు చాలా సాయం చేస్తుంది. సహజయోగ ధ్యాన సాధన ద్వారా లభించే ఆ అంతర్గత పరివర్తనే సహజ సంక్రాంతి. మన సూక్ష్మ శరీరంలో సూర్యుడి స్థానం మన నుదుటి భాగంలోని ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. ముందుగా దాన్ని శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది సూర్యుడి ద్వారా ప్రభావితం అవుతుంది. ఆజ్ఞాచక్రం సరిగ్గా లేకపోతే మనకు చాలా త్వరగా కోపం వస్తుంది. మనలో క్షమాగుణాన్ని పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే ఆజ్ఞాచక్రాన్ని శుభ్రంగా ఉంచుకోగలం. అందుకే క్షమాగుణం అలవరచుకోవడం చాలా ముఖ్యం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... సూర్యచంద్రుల గమన ప్రభావం మనపై బాహ్యంగానే కాదు... అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థ మీద కూడా ఉంటుంది. మనలో ఎడమవైపున ‘ఇడానాడి’ అంటే చంద్రనాడి, కుడివైపు ‘పింగళానాడి’ అంటే సూర్యనాడి ఉంటాయి. సూర్యనాడి క్రియాశక్తిని, చంద్రనాడి ఇచ్ఛాశక్తిని సూచిస్తాయి. మనం శక్తికి మించిన పని చేసినప్పుడు లేదా అతిగా ఆలోచిస్తున్నప్పుడు కుడి భాగం మీద భారం పడుతుంది. శరీరంలో ఉష్ణం ఎక్కువై అది బలహీనపడుతుంది. ఇక ఏ పనీ చేయాలనే కోరిక లేకుండా, ఎప్పుడూ సోమరితనంతో ఉండేవారిలో చంద్రనాడికి, అంటే ఎడమ పార్శ్వానికి సంబంధించి నసమస్యలు వస్తాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నట్టు ఏదీ అతిగా ఉండకూడదు. దీనివల్ల మనలో ఉండే సహజమైన సమతుల్యత విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి మనలోని సూర్యనాడిని, చంద్రనాడిని ప్రతి నిత్యం ధ్యానం ద్వారా సమతుల్య స్థితిలో ఉంచుకోవాలి. అది సహజయోగ ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది.
సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలంటే మనలో అంతర్గతంగా విప్లవం లేదా పరివర్తన రావాలి. అలాంటి పరివర్తనకు మనలో నిగూఢంగా ఉన్న మాతృశక్తి అయిన కుండలీని శక్తి మనకు చాలా సాయం చేస్తుంది. సహజయోగ ధ్యాన సాధన ద్వారా లభించే ఆ అంతర్గత పరివర్తనే సహజ సంక్రాంతి.
డాక్టర్ పి. రాకేష్ 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
Updated Date - Jan 10 , 2025 | 04:30 AM