పండుగ నాడు... పోషక శోభ
ABN, Publish Date - Jan 14 , 2025 | 06:07 AM
మకర సంక్రాంతి విందు పసందైన ఆరోగ్యాన్ని అందించేలా ఉండాలి. అందుకోసం పండుగ పిండివంటల్లో ఈ పోషకభరిత పదార్థాలకు స్థానం కల్పించాలి. సంక్రాంతితో ఆరోగ్య శోభ వెల్లివిరియడం కోసం అనుసరించవలసిన పోషక నియమాలు ఇవే!...
మకర సంక్రాంతి విందు పసందైన ఆరోగ్యాన్ని అందించేలా ఉండాలి. అందుకోసం పండుగ పిండివంటల్లో ఈ పోషకభరిత పదార్థాలకు స్థానం కల్పించాలి. సంక్రాంతితో ఆరోగ్య శోభ వెల్లివిరియడం కోసం అనుసరించవలసిన పోషక నియమాలు ఇవే!
పండుగల్లో పిండివంటలదే ప్రత్యేక స్థానం. నోరూరించే పిండివంటల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉంటాయి. వ్యాధినిరోధకశక్తిని పెంచడం ద్వారా కాలానుగుణ రుగ్మతల నుంచి రక్షణ కల్పించే బలవర్థకమైన పోషకాలను అందించడమే పండుగనాటి పిండిపదార్థాల ఽలక్ష్యం. కాబట్టి సంప్రదాయసిద్ధమైన పిండివంటలకే ప్రాధాన్యమిస్తూ, వాటిలో పోషకవిలువలకు పెద్ద పీట వేయాలంటున్నారు వైద్య నిపుణులు.
నువ్వుల లడ్డూలు
దీన్లోని నువ్వులు, బెల్లం, వేరుశనగలు, యాలకుల పొడిలో లెక్కలేనన్ని పోషకాలుంటాయి. సంక్రాంతి నాడు వండుకునే ఈ సంప్రదాయ పిండి వంటతో ఒరిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏవంటే...
నువ్వులు: నల్ల నువ్వుల్లో విటమిన్లు, ప్రొటీన్లు, ఇనుము, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. వీటితో రక్తంలో చక్కెర నియంత్రణలో ఉండడంతో పాటు, కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గుతాయి. అధిక రక్తపోటు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గి, జీర్ణశక్తి మెరుగు పడుతుంది.
బెల్లం: కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక శరీర బరువు మరింత పెరగకుండా నియంత్రించే బెల్లం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది.
వేరుశనగలు: పీచు, మెగ్నీషియం, ఇనుము, జింక్ మొదలైన ఖనిజ లవణాలు, బి, కె విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువ. వేరుశనగలతో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గి మధుమేహం అదుపులో ఉంటుంది. వీటిలోని విటమిన్ ఇ, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
యాలకులు: రక్తపోటు తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్లో క్యాన్సర్ వ్యతిరేక, బ్యాక్టీరియా వ్యతిరేక గుణాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వ్యాధిగ్రస్థులకు వేరుసెనగలు ఎంతో మేలు చేస్తాయి.
పసందైన పొంగలి
సుప్రసిద్ధమైన దక్షిణ భారతీయ వంటకమైన పొంగలి, బియ్యం, పెసరపప్పు, జీలకర్ర, మిరియాలు, ఇంగువ, కరివేపాకు, అల్లంతో తయారవుతుంది. వీటిలో పోషకాలు ఏవంటే...
పెసరపప్పు: ఈ పప్పుతో మధుమేహం నియంత్రణతో పాటు, కాలేయం దెబ్బతినకుండా రక్షణ దక్కుతుంది. వ్యాధినిరోధకశక్తి మెరుగు పడుతుంది. పెసరపప్పులో మాంసకృత్తులు, పీచు, ఫోలేట్, విటమిన్ కె, సిలు ఎక్కువ. కీలకమైన పెప్టైడ్స్, పాలీఫినాల్స్ మొదలైన సమ్మేళనాలు కూడా సమృద్ధిగా దొరుకుతాయి.
ఇంగువ: జీర్ణ సంబంధ సమస్యలైన పొట్ట నొప్పి, పేగుల్లోని పరాన్నజీవులు, కడుపుబ్బరంతో పాటు ఉబ్బసం, బ్రాంఖైటిస్, కోరింత దగ్గులకు ఇంగువ ఔషఽధంలా ఉపయోగపడుతుంది.
కరివేపాకు: కార్బజోల్ ఆల్కలాయిడ్స్‌ను సమృద్ధిగా కలిగి ఉండే కరివేపాకుకు మధుమేహాన్ని తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. అలాగే నాడులను కాపాడే స్వభావం కూడా ఉంటుంది. కరివేపాకుతో జీర్ణసంబంధ సమస్యలతో పాటు, పైల్స్, ఎడీమా, ఒళ్లు నొప్పులు కూడా తగ్గుతాయి.
అల్లం: ఎన్నో వేల సంవత్సరాలుగా అధిక రక్తపోటు, దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు, ఇతరత్రా ఇన్‌ఫ్లమేటరీ సమస్యల చికిత్సల్లో అల్లాన్ని ఉపయోగిస్తున్నారు.
బలవర్ధకమైన బెల్లం పాయసం
కొత్త బియ్యం, కొత్త తాటి బెల్లంతో తయారుచేసే బెల్లం పాయసం సంక్రాంతి నాడు వండుకునే తీపి పిండివంటకం. వీటిలోని పోషకాల గురించి తెలుసుకుందాం!
తాటి బెల్లం: ఈ సహజసిద్ధ తీపి పదార్థంలో ఎన్నో పోషకాలుంటాయి. శక్తి పెరగడంతో పాటు, జీర్ణశక్తి మెరుగు పడుతుంది. మైగ్రెయిన్ నొప్పులు తగ్గుతాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులు, నెలసరి నొప్పులు తగ్గుతాయి. అల్జీమర్స్ లాంటి నాడీక్షీణత వ్యాధులను నయం చేయడంలో తాటి బెల్లం కీలక పాత్ర పోషిస్తుంది.
పండుగ వేళల్లో మనం భిన్నమైన పిండి వంటలతో కమ్మని రుచులకే ప్రాధాన్యమిస్తాం. కానీ నిజానికి ప్రత్యేకించి సంక్రాంతి పండుగ నాటి పిండివంటలు అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కాబట్టి ఆత్మన్యూనతకు గురి కాకుండా, బరువు పెరిగిపోతాయమనే భయం లేకుండా పండుగ నాటి పిండిపదార్థాలను ఆస్వాదించాలి. అయితే అతి సర్వత్రా నష్టదాయకమే! కాబట్టి పరిమితంగా ఆస్వాదించడం మర్చిపోకూడదు. మరీ ముఖ్యంగా మధుమేహులు ఒకట్రెండు తీపి పదార్థాలకే పరిమితం కావాలి. పండుగ విందుల్లో ఇలాంటి సూపర్ ఫుడ్స్‌ను జోడించుకోవడం ద్వారా అటు సంప్రదాయాన్నీ, ఇటు పోషణనూ సమంగా సమన్వయం చేసుకోవాలి. అలాంటప్పుడే పండుగ వేడుకల ప్రయోజనాలను సంపూర్తిగా అందుకోగలుగుతాం!
పోషకభరిత నువ్వులు
నువ్వుల్లో జింక్, క్యాల్షియం, పీచు సమృద్ధిగా ఉంటాయి. నువ్వులు ఆరోగ్య ప్రయోజనాలను అందించే శక్తిభాండాగారాల్లాంటివి. కాబట్టి నువ్వులతో లడ్లు చేసుకోవాలి. అరిసెల్లో కూడా నువ్వులు చేర్చాలి.
బలవర్ధకమైన బెల్లం
చక్కెరను బెల్లంతో భర్తీ చేయడం అన్నివిధాలా ప్రయోజనకరమే! ఈ సహజసిద్ధ తీపిపదార్థంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. బెల్లంతో పిండివంటలకు ప్రత్యేకమైన రుచితో పాటు పోషకాలు కూడా సమకూరతాయి.
కమ్మని కుంకుమ పువ్వు
రుచి, పోషకవిలువలను పెంచే కుంకుమ పువ్వును తీపి వంటకాల్లో విరివిగా వాడుతూ ఉంటాం. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పులు వాపులను తగ్గిస్తాయి. రుచి, ఆరోగ్యం పరంగా ప్రయోజనకరంగా ఉండే కుంకుమ పువ్వు ఖరీదే అయినప్పటికీ పండుగ సందర్భాల్లో తప్పనిసరిగా వాడుకోవాలి.
దారుఢ్యాన్ని పెంచే నట్స్
బాదం, వాల్‌నట్స్, పిస్తాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు, పోషకాలు ఉంటాయి. కాబట్టి తీపి వంటకాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. పండుగ పనుల్లో తీరిక లేని పనులతో అలసటకు లోనవకుండా, రోజంతా అప్పుడప్పుడూ నట్స్‌ను తింటూ ఉంటే, నిస్సత్తువ ఆవరించకుండా ఉంటుంది.
పొట్టు తీయని ధాన్యం
సజ్జలతో, జొన్నలు లాంటి పొట్టుతీయని వాటినే పిండివంటలకు ఉపయోగించడం ఉత్తమం. వీటిలో పీచుతో పాటు పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దాంతో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. పండుగ కార్యకలాపాలన్నింట్లో చురుగ్గా పాల్గొనే శక్తి సమకూరుతుంది.
Updated Date - Jan 14 , 2025 | 06:07 AM