పసికందులు సురక్షితంగా
ABN, Publish Date - Apr 08 , 2025 | 06:23 AM
పసికందుల కోసం ఎంచుకునే ఉత్పత్తుల్లో హానికారక రసాయనాలు దాగి ఉంటాయనేది ఒక పెద్ద ఆందోళన. ఫార్మాల్డిహైడ్, ప్లాస్టిక్, విషపూరిత రంగులు, సబ్బులు, షాంపూలు వంటి వాటి వల్ల అలర్జీలు, చర్మ సమస్యలు, శ్వాసకోశ, నాడీ సమస్యలు ఉంటాయి. పసిపిల్లలను ఈ ప్రమాదాల నుంచి రక్షించేందుకు విష రహిత, సేంద్రీయ ఉత్పత్తులను ఎంచుకోవడం ముఖ్యం

పసికందులకు సుతిమెత్తని దుస్తులు ఎంచుకుంటాం. నాణ్యమైన సబ్బులు, పౌడర్లను వాడుకుంటాం. అయితే వాటిలో దాగి ఉండే హానికారక రసాయనాలను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? పసిపిల్లల ఉత్పత్తుల్లో దాగి ఉండే హానికారకాలు, సురక్షితమైన ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకుందాం!
అత్యధికంగా రసాయనాలకు బహిర్గతమైనవీ, పిల్లల చర్మానికి ఎక్కువ సమయం పాటు తగులుతూ ఉండేవే అత్యంత విషపూరితమైన పసిపిల్లల ఉత్పత్తులని వైద్యులు అంటున్నారు. పసిపిల్లల దుస్తుల తయారీలో ఉపయోగించే ఫార్మాల్డిహైడ్, విషపూరిత రంగులు పిల్లలకు అలర్జీలు, చర్మ సమస్యలను తెచ్చి పెడతాయి. అత్యంత తరచుగా ఉపయోగించే ప్లాస్టిక్ పాల సీసాలు, బొమ్మలు, డయాపర్లు, పౌడర్లు, లోషన్లు, షాంపూల్లో కూడా అత్యధిక విష మోతాదులు ఉంటున్నట్టు వైద్యులు అంటున్నారు. ఇలాంటి విషపూరిత రసాయనాలకు బహిర్గతమయ్యే పిల్లల్లో ఎదుగుదల లోపాలు, శ్వాసకోశ సమస్యలు, నాడీసంబంధ రుగ్మతలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాల నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే, విష రహిత, బిస్ఫినాల్ రహిత, సేంద్రీయ ఉత్పత్తులను ఎంచుకోవాలి. తరచూ ఉపయోగించే బొమ్మలు, గిన్నెలు, స్పూన్లు లాంటి వాటిని తరచూ శుభ్రంగా కడుగుతూ ఉండాలి. అలాగే పాలు పట్టడం కోసం ప్లాస్టిక్ బదులుగా స్టీలు, లేదా గాజు సీసాలను ఎంచుకోవాలి. అలాగే ఘాటు వాసన కలిగి ఉండే సబ్బులు, షాంపూల వాడకం మానేయాలి. అలాగే ఈ జాగ్రత్తలు పాటించాలి.
లేబుల్స్: ఉత్పత్తుల లేబుళ్ల మీద పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, బిపిఎ ఫ్రీ అని రాసి ఉన్న వాటినే ఎంచుకోవాలి
ధృవీకరించినవి: సేంద్రీయ లేదా విష రహిత ధృవీకరణల కోసం వెతకాలి
సహజసిద్ధమైనవి: వృక్షాధారిత లోషన్లు, చెక్క బొమ్మలు ఎంచుకోవాలి
సువాసన లేనివి: సబ్బులు, షాంపూలు సువాసన లేనివాటిని ఎంచుకోవాలి
కొత్తవి: కొత్త దుస్తులు, బొమ్మలను కొన్న వెంటనే శుభ్రంగా కడగాలి
రీయూజబుల్: వస్త్రంతో తయారైన డయాపర్లు, వైప్స్ వాడుకోవాలి
Updated Date - Apr 08 , 2025 | 06:23 AM