ఎకోఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం అబ్బురపరిచే అద్భుత లోకం
ABN , Publish Date - Feb 16 , 2025 | 06:35 AM
చెట్లు నరుకుతూ ఉంటే అడవులు అంతరించిపోతాయని ఆయనకు కలత చెందారు. 80 ఎకరాలలో సొంతంగా ఒక అడవిని పెంచారు.

రామ్‌దేవ్‌రావు తల్లితండ్రులది వరంగల్ జిల్లాలోని నెక్కొండ. తండ్రి నారాయణరావు అటవీ కాంట్రాక్టర్. చెట్లను నరికి అమ్మడం ఆయన పని. కానీ ఆయన ప్రకృతి అంటే మమకారం. చెట్లు నరుకుతూ ఉంటే అడవులు అంతరించిపోతాయని ఆయనకు కలత చెందారు. 80 ఎకరాలలో సొంతంగా ఒక అడవిని పెంచారు. రామ్‌దేవ్ పెరిగింది ఆ అడవిలోనే. ప్రకృతిని కాపాడాలనే ఆలోచన పుట్టింది కూడా ఆ అడవిలోనే! ఆ తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలను తిరిగి చెట్లను సేకరించి వాటిని మన దేశానికి తీసుకువచ్చి పెంచటం ప్రారంభించారు. ఎవ్వరి దగ్గర లేని చెట్లను అందించటం ఆయన ప్రత్యేకత. దీనితో అనేక మంది ప్రముఖులు ఆయన దగ్గర నుంచి చెట్లు కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. రామ్‌దేవ్ ఆలోచన అక్కడితోనే ఆగిపోలేదు. ప్రపంచంలోనే ఎక్కడా లేనన్ని చెట్లను ఒక చోటకు తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ఆలోచనల రూపమే ఎక్స్‌పీరియం. 150 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఇలాంటి పార్కు ప్రపంచంలోనే ఎక్కడా లేదనటం అతిశయోక్తి కాదు. ఒక్కసారి ఈ పార్కులోకి అడుగుపెడితే రకరకాల మొక్కలు సందర్శకులను కళ్లు తిప్పుకోనివ్వవు. అందుకే వెయ్యిరూపాయల ఎంట్రీ టిక్కెట్టు కొని... వేల మంది ఈ ఎక్స్‌పీరియంకు వస్తున్నారు.
అన్ని వ్యాపారాలూ వదిలేసి...
మొక్కలపై ఉన్న ఆసక్తితో రామ్‌దేవ్ తన అన్ని వ్యాపారాలనూ వదిలేశారు. ప్రంపంచంలో పేరొందిన నర్సరీలను చూసేందుకు ఇప్పటి వరకు 78 దేశాలు తిరిగారు. ఎక్స్‌పీరియంలోని మొక్కల విలువ కోట్లలో ఉంటే.. ఆ భూమి విలువ మాత్రం వెయ్యి కోట్లకు పైనే ఉంటుంది. ‘‘ఇంత విలువైన భూమిలో రియల్‌ఎస్టేట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది కదా?’’ అని ఎవరైనా ఆయన్ని ప్రశ్నిస్తే చిన్నగా నవ్వుతారు. ‘‘ఇది నాకు హాబీ. ఇష్టమైన పని. ఉన్న వ్యాపారాలన్నీ ఎప్పుడో వదిలేశా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు?’’ అంటారాయన. ఎక్స్‌పీరియం నిర్వహణకు ప్రతి నెల మూడు కోట్లకు పైనే ఖర్చు అవుతుంది. ‘‘అందుకే సందర్శకులకు టిక్కెట్టు పెడుతున్నాం. ఆదాయం కోసం కాదు’’ అంటారాయన.
మనసు పడితే కొనేస్తారు
చెట్లు అమ్మడమే కాదు... కొనడం కూడా ఆయనకు హాబీనే. ప్రపంచంలో ఎక్కడైనా అరుదైన మొక్క కానీ, చెట్టు కానీ ఉందని తెలిస్తే అక్కడ వాలిపోతారు. చూసింది మనసుకు నచ్చితే ఎంత ఖర్చైనా దాన్ని కొనేసి ఇక్కడకు తీసుకువచ్చి తన పార్కులో పెట్టుకుంటారు. ఇలా బయట దేశాల నుంచి ఆయన కొనుగోలు చేసిన చెట్ల ఖరీదు వందల కోట్లలో ఉంటుంది. ఎక్స్‌పీరియంలో 150 ఏళ్ల వయసు ఉన్న బోధివృక్షం కనిపిస్తుంది. ఇది ఇండోనేషియాలోని జావా ద్వీపకల్పంలోనిది. దీనిని రూ.60లక్షలకు కొని ఇక్కడకు తరలించారు. ఈ చెట్టు కొమ్మలు, ఆకులను కట్ చేసి ‘కమలం’ ఆకారం తీసుకువచ్చి మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని పెట్టి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ చెట్టును ఇలా తీర్చిదిద్దటానికి రాందేవ్ 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 2008 చైనాలో ఒలింపిక్స్ జరిగిన సమయంలో ఓ నర్సరీ యజమాని ఒక చెట్టును ఒలింపిక్స్ చిహ్నాలతో రూపుదిద్డాడు. దీని కోసం అతను 5 ఏళ్లపాటు శ్రమించాడు. ఒలింపిక్స్ సమయంలో చైనాలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తరువాత కాలంలో ఈ చెట్టును కొనేందుకు ఎంతో మంది ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు దాన్ని రామ్‌దేవ్ 50 లక్షలకు కొనుగోలు చేశారు.
సృజనాత్మకతతో...
రామ్‌దేవ్ స్వతహాగా చిత్రకారుడు. దీనితో మొక్కలను, చెట్లను ఏఏ డిజైన్లలో పెంచాలనే విషయాన్ని ఆయన నిర్ణయిస్తారు. ఇలా పుట్టిందే ప్రపంచంలో అతి పెద్ద గ్రీన్ డోమ్. అనేక చెట్ల సముదాయాలతో ఉండే ఈ గ్రీన్ డోమ్‌ను పై నుంచి చూస్తే పెద్ద గొడుగులా కనిపిస్తుంది. ఇదే విధంగా సందర్శకులకు మొక్కల వివరాలు తెలియటానికి వీలుగా స్కానింగ్ బోర్డ్‌లను ఏర్పాటు చేశారు. ఈ బోర్డులను స్కాన్ చేస్తే మొక్కల వివరాలన్నీ తెలుస్తాయి. ఆయన దూర దృష్టికి మరో నిదర్శనం- మొక్కల శ్మశానం. ‘‘ఎవరైనా చనిపోయిన తర్వాత ఒక మొక్కగా మారాలనుకుంటే వారికి ఆ అవకాశం కల్పిస్తాం. చనిపోయిన తర్వాత పార్థీవదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చి ఖననం చేసుకోవచ్చు. దానిపై వారికి నచ్చిన మొక్కను పాతి పెంచుతాం. వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈ మొక్కను ఎప్పుడైనా చూడవచ్చు. నేను కూడా నా దేహంపై మొక్కను పెంచాలని నా కుటుంబ సభ్యులకు చెప్పా’’ అంటారు రామ్‌దేవ్.
హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరులో నిర్మించిన అతిపెద్ద ఎకో పార్క్... ఎక్స్‌పీరియంకు ఇప్పటి దాకా అయిన ఖర్చు రూ.450 కోట్లు. అర్జెంటీనా, మెక్సికో, థాయ్‌లాండ్, ఉరుగ్వే, ఇటలీ, స్పెయిన్, ఆస్ర్టేలియా, దక్షిణ అమెరికా, మెక్సికో మొదలైన 85 దేశాల నుంచి తెప్పించిన 25 వేలకు పైగా మొక్కలు, వృక్షాలు ఇక్కడ కనిపిస్తాయి. వీటి ధర మార్కెట్లో వేల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ పార్క్‌లో రకరకాల కార్యక్రమాలు నిర్వహించు కోవటానికి కూడా అవకాశముంది. దీనిలో 1500 మంది కూర్చోవడానికి వీలైన యాంఫీ థియేటర్ ఉంది. రూ.50 కోట్లతో నిర్మించిన గ్లో గార్డెన్ ప్రపంచంలోనే మొదటిది. సహజమైన రాతితో మలచిన తొలి బార్ కౌంటర్.. అతిపెద్దవైన స్నో పార్క్.. బాక్స్ క్రికెట్ సౌకర్యం ఇక్కడ ఉన్నాయి. అలాగే 10 వేల మంది కూర్చోవడానికి వీలైన కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు.