Sara Tendulkar: మనసారా మంచి కోసం
ABN, Publish Date - Jan 04 , 2025 | 04:31 AM
తండ్రి ఆస్తిపాస్తులకే కాదు... ఆయన ఆశయాలకు కూడా వారసురాలిగా నిలిచింది సారా డూల్కర్.
తండ్రి ఆస్తిపాస్తులకే కాదు... ఆయన ఆశయాలకు కూడా వారసురాలిగా నిలిచింది సారా డూల్కర్. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తెగా ఆమె ప్రపంచానికి సుపరిచితురాలు. కానీ నాన్న నీడలో కాకుండా స్వశక్తితో ఎదిగి... తనదైన బాటను నిర్మించుకొంటోంది. ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సారా... మోడల్‌గానే కాకుండా సామాజిక సేవ వైపూ అడుగులు వేస్తోంది. ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి... ఆపన్నులకు అండగా నిలుస్తోంది.
క్రికెట్ దేవుడు సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ ఇప్పుడు ఇంటర్నెట్ సంచలనం. షార్ట్ రీల్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్... రోజూ ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. భారత క్రికెట్ స్టార్ శుభ్‌మన్ గిల్ ప్రేయసి అంటూ 27 ఏళ్ల సారా గురించి కొన్ని మాధ్యమాలు ఊదరగొడుతున్నాయి. అందులో వాస్తవం ఎంతనేది పక్కన పెడితే... దీనివల్ల ఆమెకు ఊహించని ప్రచారం లభించింది. కోట్ల మంది అభిమాన తార అయింది. ముంబయిలో పుట్టి పెరిగిన సారా... ‘ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్’లో చదివింది. 2018లో యూకేలోని ‘యూనివర్సిటీ కాలేజీ లండన్’ (యూసీఎల్) నుంచి బయోకెమికల్ సైన్స్ పట్టా పొందింది. అదే కాలేజీలో క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌తో 2023లో ఎంఎస్సీ పూర్తి చేసింది. తరువాత భారత్‌కు తిరిగివచ్చింది. యూకే ‘అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్’లో రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్టు. పోషకాహార నిపుణురాలిగా కొనసాగాలన్నది ఆమె నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఒకటి. తమ్ముడు అర్జున్ టెండూల్కర్ క్రికెటర్. అమ్మ అంజలి వైద్యురాలు.
అదే ఆమె ఆకాంక్ష...
సచిన్ నీడలో కాకుండా... స్వయంకృషితో ఎదిగి, తనదైన ముద్ర వేయడానికి సారా తాపత్రయపడుతోంది. ఎక్కడకు వెళ్లినా టెండూల్కర్ కూతురుగా కాకుండా తనను తనుగా గుర్తించాలనేది ఆమె ఆకాంక్ష. అందుకే తనకు నచ్చినట్టు కెరీర్‌ను మలుచుకొనే ప్రయత్నం చేస్తోంది. అందుకు ఆమె తల్లితండ్రులు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏదికావాలన్నా సమకూరుస్తున్నారు. ఆ క్రమంలోనే ఇన్‌స్టాలోకి అడుగపెట్టిన సారాకు ఆరంభంలోనే మంచి స్పందన లభించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడామెకు 75 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే బడా బ్రాండ్లు సారా వెంట పడుతున్నాయి. తన దైనందిన జీవిత విశేషాలు, కుటుంబం, స్నేహితులు, సన్నిహితులతో కలిసి విహార యాత్రల్లో ఆస్వాదిస్తున్న మధుర క్షణాలకు సంబంధించిన చిత్రాలు, చిన్న చిన్న వీడియోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. వాటితోపాటు ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ (ఎస్‌టీఎఫ్) చేపట్టే కార్యక్రమాలు, దానితో కలిసి పని చేస్తున్న పలు సంస్థల వివరాలు, తను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ప్రకటనలను అక్కడ పంచుకొంటోంది.
ఫిట్‌నెస్ తరువాతే ఏదైనా...
ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సారా జిమ్‌కు వెళ్లడం మాత్రం మానదు. ఆమెకు ఫిట్‌నెస్ తరువాతే ఏదైనా. సెలవు రోజుల్లో అయినా, ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్నా... దగ్గర్లోని జిమ్‌కు వెళ్లి వ్యాయామాలు చేస్తుంది. ఇటీవల తమ్ముడు అర్జున్‌తో కలిసి విహార యాత్రకు దుబాయ్ వెళ్లిన ఆమె... ఫిట్‌నె్‌సను మాత్రం మరిచిపోలేదు. ఉదయం లేవగానే కొంత సమయం కసరత్తులకు కేటాయించింది. ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటుంది. చర్మసంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది. పలు చర్మసౌందర్య ఉత్పత్తుల ప్రకటనల్లో కూడా నటించింది. భారతీయ సంప్రదాయ వంటలతో పాటు ఇటాలియన్ రుచులంటే ఆమెకు ఇష్టం. బాలి, ఇటలీ నచ్చిన పర్యాటక ప్రాంతాలు. సారా జంతు ప్రేమికురాలు కూడా. పిల్లులు, అరుదైన చేపలు పెంచుకొంటోంది. రెండు మేలు జాతి కుక్కలు కూడా ఇంట్లో ఉన్నాయి.
సామాజిక చైతన్యం...
మనం ఎదగడమే కాదు... మనం జీవిస్తున్న సమాజం గురించి కూడా పట్టించుకోవాలనేది సారా అభిమతం. ఇటీవల తండ్రి నెలకొల్పిన ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’కు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, ఆ దిశగా తొలి అడుగు వేసింది. ‘ఈ కొత్త పాత్రలో సారాను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ప్రజలకు, సమాజానికి చేయూత అందించడంలో తను ఎప్పుడూ ముందుంటుంది. మా ఫౌండేషన్‌ను మరో ఎత్తుకు తీసుకెళుతుందన్న నమ్మకం నాకు ఉంది. వైద్య రంగంపై ఉన్న పరిజ్ఞానం సమాజ సాధికారతకు మరింతగా తోడ్పడుతుంది’ అంటూ ఈ సందర్భంగా సచిన్ తన ట్వీట్ చేశారు.
‘మా నాన్న చేపట్టిన ఈ అద్భుతమైన పనిలో భాగమై, సమాజంలో మార్పు తీసుకురావడానికి నేను కూడా దోహదపడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సారా పేర్కొంది. మారుమూల పల్లె ప్రాంతాల్లోని పిల్లలకు వైద్య సేవలు అందిస్తూ, పోషకాహార లోపాన్ని అధిగమించేలా ఈ ఫౌండేషన్ కార్యక్రమాలు చేపడుతుంది. క్రీడలు, విద్య, ఆరోగ్య సంరక్షణ ద్వారా వారిని సమున్నతంగా నిలిపేందుకు కృషి చేస్తోంది.
ప్రత్యేక సమయం...
ఎస్‌టీఎఫ్ డైరెక్టర్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి సారా ప్రత్యేక సమయం కేటాయిస్తోంది. మోడల్‌గా, న్యూట్రిషనిస్టుగా తన కెరీర్‌కు సంబంధించిన అంశాలతో పాటు ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా చూసుకొంటోంది. తరచూ మారుమూల గ్రామాలకు వెళ్లి, అక్కడి పిల్లలతో మమేకం అవుతోంది. ఈ మధ్య తల్లితో కలిసి రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని గ్రామానికి వెళ్లింది. ‘అక్కడి అణగారిన వర్గాలకు చెందిన చిన్నారులను కలిశాను. వారి ఆరోగ్య సంరక్షణకు క్లినిక్స్ నెలకొల్పాం. పోషకాహారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశాం. ఆ పర్యటన అర్థవంతంగా ముగిసినందుకు సంతృప్తిగా ఉంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. మరింతమంది చిన్నారుల ఆరోగ్యం, అభివృద్ధికి తన వంతు సహకారం అందించే దిశగా భవిష్యత్తు ప్రణాళికలు రచించే పనిలో సారా నిమగ్నమైంది.
మనం ఎదగడమే కాదు... మనం జీవిస్తున్న సమాజం గురించి కూడా పట్టించుకోవాలనేది సారా అభిమతం. ఇటీవల తండ్రి నెలకొల్పిన ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’కు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, ఆ దిశగా తొలి అడుగు వేసింది.
Updated Date - Jan 04 , 2025 | 04:31 AM