Vaikuntha Ekadashi : అప్పుడు ఇల్లే వైకుంఠం
ABN, Publish Date - Jan 10 , 2025 | 04:26 AM
వైకుంఠ ఏకాదశి మహాపర్వదినానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున సంభవించిన దైవ లీలలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి: విష్ణు సేవకులలో ఒకడైన పరమభక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగించి,
నేడు వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ఏకాదశి మహాపర్వదినానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజున సంభవించిన దైవ లీలలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి: విష్ణు సేవకులలో ఒకడైన పరమభక్తుడు ఈ భౌతిక ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగించి, విష్ణులోకానికి వెళ్ళిన సందర్భం. ఆ విశిష్ట భగవత్ సన్నిధానానికే ‘వైకుంఠం’ అని పేరు. ‘విగత కుంఠ యస్మాద్ వైకుంఠ’... ‘విగత’ అంటే ‘పోయినది’ అనీ, ‘కుంఠ’ అంటే ‘ఆందోళన’, ‘ఆత్రుత’, ‘ఆవేదన’ అని అర్థం. ఏ ప్రదేశంలోనైతే ఆతృతకు, ఆందోళనకు, ఆవేదనలకు తావులేదో... ఆ ప్రదేశమే వైకుంఠం.
వైకుంఠాలు అనేకం. మనం నృసింహ భగవానుడి పట్ల ఆకర్షితులమైతే... ఆ నృసింహ వైకుంఠానికి చేరుకుంటాం. అలాగే కేశవ, మాధవ, గోవింద, మధుసూదన, శ్రీరామ తదితర రూపాల పట్ల ఆకర్షితులైనవారు సంబంధిత వైకుంఠాలను చేరుకుంటారు. సాక్షాత్తూ వైకుంఠనాథుడైన శ్రీమహావిష్ణువు స్వయంగా వైకుంఠద్వారం వద్దకు వచ్చి, తన ప్రియభక్తుణ్ణి స్వాగతించడమే వైకుంఠ ఏకాదశి విశిష్టత. భగవత్సందేశాన్ని లోకానికి బోధించే భక్తునికన్నా తనకు ప్రియమైనవారు మరొకరు లేరని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు వివరించాడు. ఈ శుభ తిథినాడు వైకుంఠ ద్వారంలోనికి ప్రవేశించి, ఉత్తర ద్వారం వద్ద ఆసీనుడైన భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నవారు... మోక్షానికి అర్హత పొందుతారని, ప్రస్తుత దేహాన్ని త్యజించిన తరువాత వైకుంఠానికి చేరగలరని శాస్త్రోక్తి. మనమందరం ఈ భౌతిక ప్రపంచమనే అసహజమైన నివాసంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నాం. ఆత్రుత, ఆవేదనల మధ్య కొనసాగే జీవన పోరాటంలో విసిగిపోతూ ఉంటాం. ఇలాంటివాటిని మనలో ఎవరూ కోరుకోం. ఎన్ని భోగభాగ్యాలు ఉన్నా... అంతరంగంలో ఏదో ఒక వెలితి ఉండనే ఉంటుంది. మన నిజ నివాస స్థానమైన ఆ భగవత్సన్నిధానంలో మనం లేకపోవడమే ఆ వెలితి. మరి ఎక్కడికి ఎలా చేరుకోగలం? మన అసలైన ఇంటికి తిరిగి వెళ్ళడం ఎలా? వైకుంఠనాథుడైన ఆ విష్ణుమూర్తిని లేదా నారాయణుణ్ణి లేదా శ్రీకృష్ణుణ్ణి దర్శించడం ఎలా? సామాన్య జనులకు ఈ మార్గ నిర్దేశం చేయడానికే విశుద్ధ భక్తులు ఈ లోకంలో అవతరిస్తూ ఉంటారు.
మన కర్తవ్యమేమిటి?
వైకుఠం అనేది కేవలం ‘ఒక భౌతికాతీతైన లోకం’ మాత్రమే కాదు. ఎలాగైతే విష్ణు భగవానుడు విస్తరించి... ఒక ఆలయంలో మూర్తిగా వెలసి, మనకు దర్శనం ఇస్తాడో... అదే విధంగా వైకుఠం కూడా విస్తరించగలదు. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడి పవిత్రనామాలను ఎవరు జపిస్తారో... వారి ఇంట్లోకి వైకుంఠమే స్వయంగా ప్రవేశిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి భగవన్నామాలను జపిస్తూ... మన ఇంటినే వైకుంఠంగా తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి ‘హరే కృష్ణ హరే రామ’ నామాలను జపించండి. మీ ఇంటిని వైకుంఠంగా మార్చుకోండి. తదుపరి జన్మలో దివ్య వైకుంఠ లోకానికి తిరిగి వెళ్ళండి. అదే ప్రతి జీవునికీ అంతిమ లక్ష్యం.
వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకోవాలి?
. ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ధాన్యాలు, పప్పు దినుసులు భుజించకూడదు. పండ్లు, పాలు, సగ్గుబియ్యం లాంటివి తీసుకోవచ్చు
. విష్ణు ఆలయాన్ని సందర్శించాలి. విష్ణు నామాన్ని జపిస్తూ వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించాలి. ఆలయంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి.
. హరేకృష్ణ మంత్రాన్ని జపించాలి, కనీసం నూట ఎనిమిది సార్లు పఠించడం ఉత్తమం.
. భగవద్గీత లేదా శ్రీమద్భాగవతాన్ని పఠించాలి.
. నిత్యాన్నదానానికి లేదా గోసేవకు దానధర్మాలు చేస్తే మంచిది.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
Updated Date - Jan 10 , 2025 | 07:55 AM