ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Diabetes: ముదురు పాకాన పడకుండా...

ABN, Publish Date - Jan 07 , 2025 | 04:12 AM

కొత్త సంవత్సరంలో పాత రుగ్మతలతో అడుగు పెడుతున్నారా? మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలు వెన్నంటే ఉంటాయి కాబట్టి,

కొత్త సంవత్సరంలో పాత రుగ్మతలతో అడుగు పెడుతున్నారా? మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యలు వెన్నంటే ఉంటాయి కాబట్టి, ఈ రుగ్మతను అదుపులో పెట్టుకుంటూ, కొత్త ఏడాదిని ఆరోగ్యకరంగా ఎలా కొనసాగించాలో తెలుసుకుందాం!

మధుమేహంలో ముందస్తు లక్షణాలేవీ కనిపించవు. కాబట్టి సాధారణ అరోగ్య పరీక్షల్లో మధుమేహం లేదా మధుమేహం ముందరి దశ బయటపడుతూ ఉంటాయి. అయితే మధుమేహం లేనప్పుడు, దాని ఫలితంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తనప్పుడు, ముందుగానే జాగ్రత్తలు ఎందుకు పాటించాలి? అని ప్రశ్నించేవారూ ఉంటారు. కానీ ప్రి డయాబెటిక్‌, కచ్చితంగా డయాబెటిక్‌కు దారి తీస్తుంది. అయితే మధుమేహ ముందరి దశ, మధుమేహానికి దారి తీసే పరిస్థితిని వాయిదా వేయడానికి ముందస్తు జాగ్రత్తలు ఎంతో బాగా దోహదపడతాయి. మధుమేహులు ఎలాంటి ఆహార, ఆరోగ్య, వ్యాయామ నియమాలు పాటిస్తున్నారో అవే నియమాలను ప్రిడయాబెటిక్స్‌ కూడా అనుసరించడం మొదలుపెట్టాలి. అలాగే మధుమేహుల మాదిరిగానే 3 నుంచి 6 నెలలకోసారి మధుమేహాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రిడయాబెటిక్స్‌, డయాబెటిక్స్‌లా మందులు వాడుకోవలసిన అవసరం లేకపోవడం మినహా మిగతా నియమాలన్నీ తూచతప్పకుండా పాటించాలి.

లక్షణాలు కొందర్లోనే...

మధుమేహులు అందర్లో లక్షణాలు కనిపించాలనే నియమమేమీ లేదు. వంద మంది మధుమేహుల్లో కేవలం ఇరవై మందికే మధుమేహ లక్షణాలు బయల్పడతాయి. కాబట్టి మధుమేహాన్ని ముందస్తుగానే గుర్తించాలంటే 40 ఏళ్ల నుంచి ప్రతి ఏడాదీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నవాళ్లు 35 ఏళ్ల నుంచే, వార్షిక పరీక్షలు చేయించుకోవడం మొదలుపెట్టాలి. టైప్‌1 మధుమేహం సాధారణంగా 15 ఏళ్ల లోపు పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. క్లోమంలో ఇన్సులిన్‌ ఏమాత్రం తయారు కాని పరిస్థితి ఇది. బరువు తగ్గడం, కడుపు నొప్పి, వాంతులతో వైద్యులను సంప్రతించి, పరీక్షలు చేయించుకున్నప్పుడు, ఈ మధుమేహం బయల్పడుతూ ఉంటుంది. వీళ్లకు నోటి మాత్రలు పని చేయవు. కాబట్టి ఇన్సులిన్‌ ఇవ్వవలసి వస్తుంది. టైప్‌2 మధుమేహుల్లో కేవలం 20 శాతం మందిలోనే ఆకలి పెరగడం, అతి మూత్రం, దాహం పెరగడం లాంటి లక్షణాలతో వ్యాధి బయల్పడుతూ ఉంటుంది. మిగతా 80 శాతం మందికీ ఆరోగ్య ఏపరీక్షల ద్వారా సమస్య బయల్పడుతూ ఉంటుంది. వీళ్లలో హెచ్‌బిఎ1సి 6.4 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, మందులు మొదలుపెట్టుకుంటూ, ఆహార, వ్యాయామ నియమాలు పాటించాలి.


పరీక్షలు క్రమం తప్పకుండా...

మధుమేహ మాత్రలు వాడుకోవడం ముఖ్యమే అయినా ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం లాంటి అంశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మందుల్లో కూడా దాదాపు 7 రకాలుంటాయి. ఆహారపుటలవాట్లు, బరువు, దైనందిన జీవితం ఆధారంగా వైద్యులు నిర్దిష్ట మందులను సూచిస్తూ ఉంటారు. అయితే కొత్తగా మందులు మొదలుపెట్టినవాళ్లు వైద్యుల సూచించినంత కాలం అవే మందులు వాడుకుంటూ, మధుమేహ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ ఐదు నుంచి పదేళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నవాళ్లు, మధుమేహం హెచ్చుతగ్గులకు లోనవుతున్న వాళ్లు మందులు వాడుకుంటూనే, ప్రతి మూడు నెలలకూ మధుమేహాన్ని పరీక్షించుకుంటూ, ఏడాదికోసారి కొన్ని అదనపు పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి. ఈ కోవకు చెందిన వాళ్లలో మధుమేహం ప్రభావంతో ఇతర ప్రధాన అంతర్గత అవయవాల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఏడాదికోసారి కళ్లు, మూత్రపిండాలు, కాలేయం, గుండె పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి.

సిజిఎమ్‌ తోడ్పాటుతో...

ఏళ్ల తరబడి ఆహార నియమాలను కచ్చితంగా పాటించలేక విసిగిపోయి, నచ్చినట్టు తినేసేవాళ్లలో, వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్లలో, ఒత్తిడిని అదుపులో పెట్టుకోలేకపోయిన వాళ్లలో మధుమేహం హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల కోసం తాజాగా సిజిఎమ్‌ (కంటిన్యూయస్‌ గ్లూకోజ్‌ మానిటరింగ్‌) అనే నానో చిప్‌ అందుబాటులోకొచ్చింది. 10 నుంచి పదేళ్ల పాటు పని చేసే ఈ నానోచి్‌పను భుజానికి అంటించుకుని, సంబంధిత సాఫ్ట్‌వేర్‌ను ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకుని, చక్కెర మోతాదుల్లో హెచ్చుతగ్గులను పరీక్షించుకోవచ్చు. ఆ వివరాల ఆధారంగా చక్కెర పెరిగిన సమయాలు, కారణాలను గుర్తించి, చక్కెరను స్థిరీకరించే మందులను వైద్యులు సూచిస్తారు. చక్కెర హెచ్చుతగ్గులకు లోనయ్యే వారికీ, ఇన్సులిన్‌ తీసుకుంటున్న వాళ్లకూ సిజిఎమ్‌ ఎంతో బాగా అక్కరకొస్తుంది.


షిఫ్టుల్లో పని చేస్తున్నప్పుడు...

ప్రత్యేకించి రాత్రంతా మేలుకుని పని చేస్తూ, పగలు నిద్రపోయే ఉద్యోగులు మధుమేహం అదుపు తప్పకుండా ఉండడం కోసం కొన్ని ఆహార నియమాలు పాటించాలి. రాత్రి పనిలోకి దిగే ముందు, కడుపు నిండా భోంచేయొచ్చు. అయితే తెల్లవారిన తర్వాత, నిద్రకు ఉపక్రమించబోయే ముందు భారీ భోజనం చేయకూడదు. బదులుగా వీలైనంత తేలికపాటి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఉదయం నిద్రపోయే ముందు కడుపు నిండా తింటే, నిద్రపోయినంత సేపు, ఆరు నుంచి ఏడు గంటల పాటు రక్తంలో చక్కెర మోతాదులు అధికంగానే ఉండిపోతాయి. కాబట్టి పగటి షిఫ్టుల్లో పని చేసే వాళ్లైనా రాత్రి షిఫ్టుల్లో పని చేసేవాళ్లైనా నిద్రకు ముందు భారీ భోజనానికి బదులుగా అల్పాహారమే తీసుకోవాలి.

ఈ నియమాలు తప్పనిసరి

చక్కెర: చక్కెరతో శరీరానికి అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా మనం తినే పిండిపదార్థాల్లో చక్కెర ఉంటుంది. కాబట్టి నేరుగా చక్కెర తీసుకోవలసిన అవసరం లేదు.

పిండిపదార్థాలు: ప్రత్యేకించి నిద్రకు ముందు వీలైనంత తక్కువ పిండిపదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా బియ్యం ఆధారిత పదార్థాలు మానేయాలి. అన్నానికి బదులుగా టిఫిన్‌ తింటున్నాం కాబట్టి ఫరవాలేదు అనుకునేవాళ్లూ ఉంటారు. కానీ ఇడ్లీ, దోశల్లాంటివి కూడా బియం్యతోనే తయారవుతాయనే విషయాన్ని వాళ్లు గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి రాత్రి భోజనంలో సాధ్యమైనంత తక్కువ పిండిపధార్థాలు ఉండేలా చూసుకోవాలి. వీలైతే పిండిపదార్థాలను పూర్తిగా మానేయాలి.

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌: అన్నానికి బదులుగా చపాతీలు, ఫుల్కాలు తినొచ్చు. అన్నంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువ. కానీ చపాతీలు, ఫుల్లాల్లో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కాబట్టి రక్తంలో చక్కెరలు పెరగకుండా ఉంటాయి.

పండ్లు: మామిడి, ద్రాక్ష, సపోటా, అరటి, పైనాపిల్‌లు తినకపోవడమే మేలు. వీటికి బదులుగా బొప్పాయి, యాపిల్‌, జామ పండ్లు రోజూ తినొచ్చు. ఈ పండ్లను రోజుకొకటి చొప్పున తినొచ్చు. కానీ రసం తీసి తాగకూడదు. గ్లాసుడు రసం కోసం మూడు నాలుగు పండ్లు అవసరమవుతాయి. కాబట్టి నేరుగా పండునే తినాలి. అలాగే కాలానుగుణంగా దొరికే పండ్లను పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. వారానికి ఒకట్రెండు పండ్ల ముక్కలను తినడం వల్ల నష్టం ఉండదు.


ఇన్సులిన్‌ పంప్స్‌

టైప్‌1 మధుమేహులు, ఏళ్ల తరబడి మధుమేహంతో బాధపడుతూ, నోటి మాత్రలు పని చేయని వారికీ ఇన్సులిన్‌ ఇవ్వవలసి వస్తుంది. ఈ కోవకు చెందిన వాళ్లు రోజులో మూడు నుంచి నాలుగు సార్లు ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుంది. ఇలా ఇన్సులిన్‌ తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనేవారి కోసం కొత్తగా ఇన్సులిన్‌ పంప్స్‌ అందుబాటులో కొచ్చాయి. శరీరంలో పొట్ట దగ్గర అమర్చుకునే ఈ పరికరం రక్తంలోని చక్కెరలను పరిశీలిస్తూ, తగిన మోతాదులో ఇన్సులిన్‌ను విడుదల చేస్తూ ఉంటుంది.

కృత్రిమ చక్కెర ప్రమాదమే!

చక్కెరకు బదులుగా పలు రకాల కృత్రిమ చక్కెరలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ సురక్షితమైనవేనని అనుకోకూడదు. కృత్రిమ స్వీటెనర్ల వల్ల పలురకాల దుష్ప్రభావాలున్నట్టు పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వీటి వల్ల రక్తంలోని చక్కెరలు హెచ్చుతగ్గులకు లోనవడంతో పాటు థైరాయిడ్‌, క్లోమ క్యాన్సర్ల ముప్పు కూడా పొంచి ఉంటుంది. కాబట్టి కృత్రిమ చక్కెరలతో పాటు, షుగర్‌ ఫ్రీ స్వీట్లు, బెల్లం, తాటి బెల్లం, పటికలను కూడా తీసుకోకూడదు.

వ్యాయామం ఎంత?

మధుమేహులు వారంలో కనీసం వారంలో ఐదు రోజులు, 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అయితే కొంతమందికి అంత సమయం కూడా దొరకకపోవచ్చు. అలాంటివాళ్లు రోజుకు కనీసం 20 నిమిషాలైనా వ్యాయామానికి కేటాయించాలి. అలాగే వ్యాయామం క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఐదు రోజుల పాటు ఎలాంటి వ్యాయామం చేయకుండా శని, ఆది వారాల్లో గంట చొప్పున వ్యాయామం చేస్తే ఫలితం ఉండదు.

ఒకటికి రెండు మాత్రలు

‘ఒకటికి రెండు మాత్రలు వేసుకుంటే సరిపోతుందిలే’ అనే ఆలోచనతో తీపి తినేసేవాళ్లూ ఉంటారు. కానీ బిపి మాత్రలు, చక్కెర మాత్రలు వైద్యులు సూచించిన మోతాదు మించి వాడుకోకూడదు. తీపి తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగితే వెంటనే ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. కానీ ఒక స్వీటు తిని ఒకటికి రెండు చక్కెర మాత్రలు వేసుకుంటే, రక్తంలో చక్కెర మోతాదు పడిపోయి, అత్యవసర వైద్య పరిస్థితికి దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా స్వీటు తిన్నా, రక్తంలో చక్కెర పెరిగి, తర్వాత నెమ్మదిగా దానంతటదే తగ్గిపోతుంది. కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగని స్వీట్లు కూడా తరచూ తినకూడదు.

డాక్టర్‌ సందీప్‌ ఘంటా

కన్సల్టెంట్‌ - డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌,

స్టార్‌ హాస్పిటల్‌, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్‌.

Updated Date - Jan 07 , 2025 | 04:14 AM