Gayatri Kutumbam - Ugadi Celebrations: గాయత్రీ కుటుంబం ఆధ్యర్యంలో యూఏఈలో వైభవంగా ఉగాది వేడుకలు
ABN, Publish Date - Apr 04 , 2025 | 07:56 PM
యూఏఈలోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్యర్యంలో 2025 మార్చి 31న శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు దేశ రాజధాని కేంద్రం అబుదాబిలో ఘనంగా జరిగాయి.

సనాతనం, సత్సంబంధం, సంఘటితం, సహకారం, సత్సంగం వంటి పంచ ప్రామాణికాలతో ప్రారంభించబడిన యూఏఈలోని అతిపెద్ద బ్రాహ్మణ సమూహం గాయత్రీ కుటుంబం ఆధ్యర్యంలో 2025 మార్చి 31న శ్రీ విశ్వావసు ఉగాది ఉత్సవాలు దేశ రాజధాని కేంద్రం అబుదాబిలో ఘనంగా జరిగాయి. సుమారు 300 కుటుంబాలు ఈ వేడుకలలో పాలు పంచుకున్నాయి.
ప్రారంభం నుండి చివరి వరకూ ఆర్ష సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ ఆద్యంతం చక్కటి కార్యక్రమాలు జరిగాయి. దీపారాధన, విఘ్నేశ్వర పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య విశారద బ్రహ్మశ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ గారిచే పంచాంగ పఠనం, ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి ప్రీతి తాతంభొట్ల, సంగీత గురువులు రాగ మయూరి, ఇందిరా కొప్పర్తి తమ శిష్య బృందంతో సంగీత, నృత్య ప్రదర్శనలు, శ్రీనివాస మూర్తి లాస్య వల్లరి, శివ తాండవ స్తోత్రం, ప్రముఖ తెలుగు కవులు శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో, శ్రీలక్ష్మి చావలి, వెంపటి సతీష్‌ల కవి సమ్మేళనం, భగవద్గీత, అన్నమాచార్య, రామదాసు కీర్తనలు, సుభాషితాలు, సాహిత్య కార్యక్రమాలతో గాయత్రీ కుటుంబానికి సంబంధించిన చిన్నారులు, పెద్దలు తమ అద్భుతమైన ప్రతిభతో పూర్తి తెలుగింటి సంప్రదాయాన్ని కార్యక్రమంలో ఆవిష్కరిస్తూ రసజ్ఞులను సమ్మోహితులను చేశారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి ఉషా బాల కౌతా అందరినీ ఆకట్టుకున్నారు. ఓరుగంటి సుబ్రహ్మణ్య శర్మ గాయత్రీ కుటుంబం ప్రధాన ఉద్దేశ్యాల గురించి వివరిస్తూ, స్వదేశంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకు గాయత్రి కుటుంబం అండదండగా నిలుస్తూ వారికి విద్య, వైద్య , వివాహం వంటి కార్యక్రమాలకు ఇప్పటి వరకూ గాయత్రి కుటుంబ సభ్యులు సుమారు కోటిన్నర రూపాయల వరకు సహాయం అందించారని, భవిష్యత్తులో బ్రాహ్మణ సంక్షేమానికి మరింత సహకారం అందిస్తామని వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, తెలుగు వేద కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గాయత్రీ కుటుంబం సమైక్యతను అభినందిస్తూ, ఈ సమూహం చేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రశంసించారు. "ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆ దేశ సంస్కృతినిని గౌరవిస్తూనే బ్రాహ్మణులు స్వధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకతను కూడా నొక్కి చెబుతూ బ్రాహ్మణులు ధర్మ జీవనం, ధర్మ పరిరక్షణ వదిలిపెట్టవద్దని, ఎల్లప్పుడూ జ్ఞానార్జన చేస్తూ, ఆ జ్ఞనాన్ని అందరికీ పంచాలని, పట్టుదల, దీక్ష, తపస్సు, సహనం, నియమనిష్ఠలతో నిత్యం గాయత్రీ దేవిని ఆరాధించి, బ్రాహ్మణత్వాన్ని పొందాలని పిలుపునిచ్చారు.
ఈ మొత్తం కార్యక్రమానికి సంపంగి గ్రూపు పూర్తి సహకారాన్ని అందించినందుకు నిర్వాహకులు ఆ గ్రూపు పెద్దలను సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో సభ్యులకు ఉగాది పచ్చడి, తిరుమల శ్రీవారి తీర్ధ ప్రసాదాలతో పాటు, అచ్చమైన బ్రాహ్మణ భోజనాన్ని అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని గాయత్రీ కార్యకారిణీ బృందం రాయసం శ్రీనివాసరావు, మోహన్ ముసునూరి, గడియారం శ్రీనివాస్, సుబ్రహ్మణ్య శర్మ, వంశీ చాళ్లురి, రమేష్ సమర్ధవంతంగా నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
బహ్రెయిన్‌లో ఘనంగా 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో వైభవంగా ఉగాది వేడుకలు
ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
మరిన్ని ఎన్నారై వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Apr 04 , 2025 | 07:59 PM